HPV cancer vaccine:దేశవ్యాప్తంగా ఉచితంగా హెచ్‌పీవీ క్యాన్సర్ టీకా..ఎందుకీ నిర్ణయం?
HPV cancer vaccine: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య చూసుకుంటే దానిలో భారత్ మూడో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం.

HPV cancer vaccine
కేంద్ర ప్రభుత్వం భారతీయ మహిళల ఆరోగ్య భద్రత దిశగా.. ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ..హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్(HPV cancer vaccine) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా 14 ఏళ్ల వయస్సు పైబడిన బాలికలకు ఈ టీకాను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందిస్తున్నారు. గార్డాసిల్ అనే ఈ వ్యాక్సిన్ ద్వారా.. స్త్రీలకు ప్రాణాపాయం కలిగించే క్యాన్సర్లను సమర్థంగా అడ్డుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు.
ఇంతకీ ఎందుకీ టీకా.. దీని ప్రాముఖ్యత ఏంటని చాలామందికి ఓ సందేహం కలుగుతోంది. గర్భాశయ క్యాన్సర్ అనేది హెచ్‌పీవీ వైరస్ వల్ల వస్తుంది. మెయిన్‌గా టైప్ 16, 18 రకాలు 80 శాతం క్యాన్సర్ కేసులకు కారణమని డాక్టర్లు గుర్తించారు. గార్డాసిల్ వ్యాక్సిన్ ఈ వైరస్ రకాలతో పాటు.. టైప్ 6, 11 రకాల నుంచి కూడా లైఫ్ లాంగ్ అమ్మాయిలకు రక్షణను కల్పిస్తుంది.
అంతర్జాతీయంగా జరిగిన పరిశోధనల ప్రకారం, ఈ టీకా సర్వైకల్ క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో 93 నుంచి 100 శాతం వరకు అద్భుతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఇప్పటివరకు ఈ టీకా బయట మార్కెట్‌లో ఒక్కో డోసు ధర సుమారు 3,927 రూపాయలుగా ఉండటంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది భారంగా మారడంతో.. చాలామంది టీకా వేసుకోకుండానే ఉండిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం దీనిని ఫ్రీగా అందించడం వల్ల దేశంలోని ప్రతీ బాలికకు ఇకపై క్యాన్సర్ రక్షణ లభించనుంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య చూసుకుంటే దానిలో భారత్ మూడో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. భారతీయ మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది రెండో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. ఏటా భారత దేశంలో సుమారు 80,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి.దురదృష్టవశాత్తూ ఏటా 42వేల మందికి పైగా మహిళలు ఈ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడంతో పాటు ఈ టీకా ఖరీదైనది కావడంతో చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

మనదేశం ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్(HPV cancer vaccine)ను అమలు చేయడంలో కొంచెం ఆలస్యమయ్యామని అనిపించినా కూడా, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం అత్యంత కీలకమనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ జరుగుతోంది. అందులో 90 దేశాలు సింగిల్ డోస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ టీకాను జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న 160వ దేశంగా భారత్ నిలవనుంది. 2006 నుంచి అందుబాటులో ఉన్న ఈ వ్యాక్సిన్ ..ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డోసులు పంపిణీ చేయబడింది, దీనివల్ల చాలా దేశాల్లో క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.



