Esha Singh : చరిత్ర సృష్టించిన ఈషా సింగ్..వరల్డ్ కప్ లో సరికొత్త ప్రపంచ రికార్డ్
Esha Singh : 21 ఏళ్ల ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణం కైవసం చేసుకుంది ఫైనల్స్ లో 43 పాయింట్లు సాధించి సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పింది
Esha Singh
భారత షూటింగ్ సంచలనం ఈషా సింగ్ చరిత్ర సృష్టించింది. మ్యూనిచ్ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణం కైవసం చేసుకుంది. జర్మనీ, బల్గేరియా, చైనా వంటి అగ్రశ్రేణి షూటర్లను నిలువరిస్తూ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది.
21 ఏళ్ల ఈషా సింగ్(Esha Singh) ఫైనల్స్ లో 43 పాయింట్లు సాధించి సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పింది. తద్వారా గతంలో నెలకొల్పిన 42 పాయింట్ల రికార్డును బ్రేక్ చేసింది. అలాగే జూనియర్ స్థాయిలో సైతం ఇదే అత్యుత్తమ రికార్డుగా నమోదైంది. తుదిపోరులో ఎంతో ఒత్తిడిని తట్టుకుని ఆమె ఈ విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్ లో 85 దేశాలకు చెందిన 723 మంది అథ్లెట్లు పాల్గొంటుండగా హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్ అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణం గెలిచి భారత సత్తా చాటింది.
ఫైనల్స్ లో ఈషా సింగ్(Esha Singh) 43 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. జర్మనీకి చెందిన డోరీన్ వెన్నెక్యాంప్ 38 పాయింట్లతో రజతాన్ని, బల్గేరియా షూటర్ మిరోస్లావా మించెవా 31 పాయింట్లతో కాంస్యాన్ని గెలుచుకున్నారు. వరల్డ్ రికార్డుతో వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ గెలిచిన ఈషా సింగ్ ను భారత షూటింగ్ ప్రముఖులు అభినందిస్తున్నారు.
కాగా హైదరాబాద్ కు చెందిన ఈషా సింగ్ చిన్నతనం నుంచే షూటింగ్ పై ఆసక్తి కనబరిచింది. దీంతో ఆమె తండ్రి షూటింగ్ లో జాయిన్ చేయడంతో కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్టార్ షూటర్ గా ఎదిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్ విభాగాలలో అంతర్జాతీయ స్థాయి పోటీలలో అద్భుతంగా రాణిస్తూ మెడల్స్ గెలుస్తోంది.

2018లో కేవలం 13 సంవత్సరాల వయస్సులోనే, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో స్వర్ణం, 3 రజత పతకాలు కైవసం చేసుకుంది. అలాగే ఈజిప్ట్‌లో జరిగిన వరల్డ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించింది.
న్యూఢిల్లీలో జరిగిన ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత , టీమ్ విభాగాలలో రెండు బంగారు పతకాలు సాధించింది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ పోటీలలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం కూడా గెలిచిన ఈషా సింగ్ ఇప్పుడు వరల్డ్ కప్ లో మరోసారి అదరగొట్టింది.
Peddi Movie : పెద్ది మూవీ రిలీజ్‌కు లైన్ క్లియర్.. థియేటర్ల వివాదానికి చెక్ పెట్టిన మెగాస్టార్





