Strait of Hormuz : హర్మూజ్ తెరిస్తే చాలా? యుద్ధానికి ట్రంప్ ఎండ్ కార్డ్ వేసేస్తారా?
Strait of Hormuz : జూన్ 17 న హర్మూజ్ జలసంధి తెరిచేలా ఒప్పందం కుదిరినా ..ఇరాన్ దానిని ఉల్లంఘించిందంటూ అమెరికా దాడులు చేయడంతోనే కథ మళ్లీ మొదటికి వచ్చింది.
Strait of Hormuz
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులకు పూర్తిగా తెరపడే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి వరకు మేమే గెలుస్తున్నాం అంటూ ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోక ముడిచే ఆలోచనలో ఉన్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నారు. నిజానికి పది రోజులుగా ట్రంప్‌పై అటు స్వదేశంలోనూ, ఇటు ఇజ్రాయిల్ నుంచీ కూడా ఒత్తిడి పెరుగుతూనే ఉంది.
దీంతో ట్రంప్ ఐదు నెలల సుదీర్ఘ యుద్ధం నుంచి వెనక్కి తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. సైనిక ఆయుధాల కొరత, స్వదేశంలో పెరుగుతున్న ఒత్తిడితో చర్చలతో యుద్ధం ముగించాలని చూస్తున్నారు. ఇరాన్ అణు పరీక్షలు ఇకపై చేయకూడదన్నదే అమెరికా ప్రధాన డిమాండ్. కానీ ఇప్పుడు అణు ఒప్పందం విషయంలో కూడా ట్రంప్ వెనకడుగు వేసినట్టు సమాచారం.
ప్రస్తుతానికి హర్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని పూర్తిగా తెరవాలన్న డిమాండ్‌తోనే రాజీ పడటానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం అగ్రదేశపు ఆయుధ నిల్వలు తగ్గిపోవడమేనని తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా వద్ద ఉన్న ఆయుధ సంపద గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో రక్షణశాఖ బడ్జెట్ పెంచడానికి సెనెట్ సానుకూలంగా లేదు.
మరోవైపు హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) మూసివేత కారణంగా చమురు సంక్షోభం తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో మిత్రదేశాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుండడంతో ట్రంప్‌నకు మరో ఆప్షన్ కూడా లేకుండా పోయింది. అయితే జలసంధిని పూర్తిగా తెరవాలంటే తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని, స్తంభింపజేసిన నిధులను విడుదల చేయాలని, ఆ ప్రాంతం నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

దీనిపైన ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిజానికి జూన్ 17 న హర్మూజ్ జలసంధి తెరిచేలా ఒప్పందం కుదిరినా ..ఇరాన్ దానిని ఉల్లంఘించిందంటూ అమెరికా దాడులు చేయడంతోనే కథ మళ్లీ మొదటికి వచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ యుద్ధానికి ముగింపు ఇవ్వాలన్న ఆలోచనతో ఉండటం వల్ల ఈ సారి హర్మూజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.





