Just InternationalJust PoliticalLatest News

War:మండుతున్న పశ్చిమాసియా.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

War: ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ , అమెరికా లక్ష్యాలపై ఏకంగా 230 డ్రోన్లను ప్రయోగించి సంచలనాన్ని సృష్టించింది.

War

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ప్రారంభమైన దాడులు.. ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న అనుమానాలను రేపుతున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ పోరాటం.. ఐదో రోజుకు మరింత భీకరంగా మారిపోయింది. ఇటీవల అమెరికా, ఇజ్రాయిల్ భీకర దాడుల్లో ఇరాన్ దివంగత నేత అయతుల్లా ఖమేనీ చనిపోవడంతో.. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం ఇప్పుడు ఇప్పటి వరకూ లేని విధంగా విరుచుకుపడుతోంది.

తాజాగా ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ , అమెరికా లక్ష్యాలపై ఏకంగా 230 డ్రోన్లను ప్రయోగించి సంచలనాన్ని సృష్టించింది. ఇరాక్ , కువైట్‌లోని అమెరికా స్థావరాలే టార్గెట్ చేస్తూ.. ఈ దాడులు జరిగాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. కేవలం డ్రోన్లే కాదు.. అమెరికా యుద్ధ నౌకలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. సముద్రంలో రీఫ్యూయలింగ్ చేస్తున్న యూఎస్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకపై.. ఖదర్-380 మిస్సైల్‌తో ఇరాన్ దాడి చేయడంతో రెండు నౌకలు మంటల్లో చిక్కుకుపోయాయి. నిజంగానే ఇది అమెరికా నావికాదళానికి పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది.

మరోవైపు ఇజ్రాయెల్ కూడా తన దూకుడును మరింతగా పెంచింది. ఇటీవల ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీని కూడా తాము వదిలిపెట్టమని.. ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ చంపేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ సీరియస్‌గా హెచ్చరికలు జారీ చేశారు.

ఇక ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా తన బి-2 బాంబర్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని సుమారు 2000 వ్యూహాత్మక ప్రాంతాలను, రహస్య అణు ప్రాజెక్టులను ధ్వంసం చేసినట్లు అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి.

అయితే ఈ యుద్ధం కేవలం ఇరాన్‌కే పరిమితం కావడం లేదు. ఇది లెబనాన్‌కు కూడా పాకింది. హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ చేస్తున్న మిసైల్ దాడులతో.. బీరుట్ నగరమంతా అతలాకుతలమవుతోంది. ఈ ఐదు రోజుల యుద్ధం(War )లో .. ఇరాన్‌లో ఇప్పటి వరకు ఏకంగా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని హ్యూమన్ రైట్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఇరాన్ దగ్గర అణుబాంబు నిల్వలు లేకపోయినా, వారి దగ్గర ఉన్న యురేనియం నిల్వలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

War
War

మరోవైపు ఎక్కడా వెనక్కి తగ్గకుండా పైకి గంభీరంగా అమెరికా దాడులు చేస్తున్నా, అగ్రరాజ్యానికి కూడా లోలోపల భయం మొదలైనట్లు తెలుస్తోంది. యుద్ధం(War ) ఇలాగే మరో పది రోజులు కొనసాగితే మిసైళ్ల కొరత తప్పదని పెంటగాన్ ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఎమర్జెన్సీ రిక్వెస్ట్ పంపింది.

అయితే తమ దగ్గర యుద్ధానికి సరిపడా ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ ట్వీట్ చేసినా కూడా, ఆర్థికంగా అమెరికాకు భారీగానే నష్టం జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఫ్రాన్స్ వంటి దేశాలు యూఏఈకి మద్దతుగా తమ రఫేల్ యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించడంతో. .ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోనని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button