Trump : 20 శాతం ఫీజు మాకే కట్టాలి..హర్మూజ్‌పై ప్రపంచ దేశాలకు ట్రంప్ షాక్
Trump : ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఇకపై మరింత భీకర దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
Trump
ఇరాన్‌తో మళ్లీ యుద్ధం మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) ప్రపంచ దేశాలకు భారీ షాక్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిని అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందని సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించిందనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ జలమార్గం గుండా ప్రయాణించే కార్గో నౌకలపై 20 శాతం టోల్ ఫీజు వసూలు చేస్తామని, ధనిక చమురు ఉత్పత్తి దేశాలు ఈ భద్రతకు గానూ అమెరికాకు డబ్బు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రతిఫలం లేకుండానే ఈ జలసంధిని అమెరికా కాపాడుతూ వచ్చిందని, అయితే ఇకపై ఈ పరిస్థితి మారుతుందన్నారు.
ఈ జలసంధి ప్రాంతంలో ఇరాన్ ఏర్పాటు చేసిన మైనీయింగ్ నౌకలను అమెరికా దళాలు ఇప్పటికే ధ్వంసం చేశాయని, జలమార్గాన్ని మూసివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్(Trump) హెచ్చరించారు. ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఇకపై మరింత భీకర దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసిందని, డ్రోన్ల ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే మరిన్ని తీవ్రమైన దాడులు ఉంటాయని హెచ్చరించారు.
మరోవైపు అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా హర్మూజ్ జలసంధిని మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ తాజా పరిణామాలతో ప్రపంచ దేశాలకు టెన్షన్ మొదలయింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో అత్యధిక భాగం ఈ హర్మూజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది.

సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, మరియు ఇరాన్ వంటి గల్ఫ్ దేశాల ప్రాథమిక చమురు ఎగుమతి మార్గం ఇదే. ఈ జలసంధి ద్వారా వెళ్లే చమురులో దాదాపు 75 శాతం నుంచి 80 శాతం భారతదేశం, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలకే చేరుతుంది.
జూన్ 17న అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం రద్దయినట్లు ట్రంప్(Trump) ప్రకటించడంతో, పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది ప్రపంచ చమురు మార్కెట్ , ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.





