just AnalysisJust NationalLatest News

Nirmala :నిర్మలమ్మ బడ్జెట్ మ్యాజిక్..వికసిత భారతానానికి బాట వేసిందా?

Nirmala : ఆర్థికవేత్తలు 7.5 నుంచి 8 శాతం వృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అని చెబుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం మధ్యతరగతికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని విమర్శిస్తున్నాయి.

Nirmala

 

ఫిబ్రవరి 1, 2026 ఆదివారం.. భారత పార్లమెంట్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా మారింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్‌తో సభలోకి అడుగుపెట్టినప్పుడు, అది కేవలం నిర్మలమ్మ(Nirmala ) అంకెల పద్దు మాత్రమే కాదు.. 2047 నాటికి వికసిత భారతం ఎలా ఉండబోతుందో వివరించే ఒక విజన్ డాక్యుమెంట్ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

దీనికి తగినట్లుగానే సుమారు రూ. 52 లక్షల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ 2026, దేశ యువత శక్తిని, గ్రీన్ ఎనర్జీ స్వప్నాన్ని, కృత్రిమ మేధస్సు (AI) దిశగా భారత్ వేయబోతున్న అడుగులను ప్రతిబింబించింది. ఫిస్కల్ డెఫిసిట్‌ను 5.1 శాతానికి పరిమితం చేస్తూ, సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చిందించేలా హ్యాపీనెస్ బూస్టర్‌గా ఈ బడ్జెట్‌ను నిర్మలమ్మ(Nirmala ) తీర్చిదిద్దారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా దేశంలో ఉన్న 25 కోట్ల మంది యూత్ కోసం స్కిల్ ఇండియా 2.0 పేరుతో రూ. 1.2 లక్షల కోట్లను ప్రభుత్వం కేటాయించడం ఒక పెద్ద విప్లవం. ఐఐటీలు, ఎన్ఐటీలను హబ్‌లుగా మార్చి సెమీకండక్టర్, ఈవీ , ఏఐ రంగాల్లో 5 కోట్ల మందికి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా, టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే ప్రతి యువకుడికి నెలకు రూ. 15 వేలు స్టైఫండ్ ,ప్లేస్‌మెంట్ గ్యారెంటీ ఇవ్వడం నిరుద్యోగ సమస్యకు ఒక పక్కా సొల్యూషన్‌గా కనిపిస్తోంది.

వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ 4.0 ద్వారా 50 వేల డ్రోన్లను అందుబాటులోకి తీసుకు తెచ్చి, ఏఐ సాయంతో పంటల దిగుబడిని అంచనా వేయడం ద్వారా రైతు రాజ్యాన్ని మరింత బలోపేతం చేయబోతున్నారు. ఎంఎస్పీ కోసం రూ. 2.5 లక్షల కోట్లు, మిల్లెట్స్ ప్రమోషన్ కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు.

ఇక మహిళా సాధికారత విషయంలో ఈ బడ్జెట్ లేడీస్ ఫస్ట్ అనే నినాదాన్ని నిజం చేసినట్లే కనిపించింది. బేటీ బచావో 2.0 కింద ప్రతి బాలిక పుట్టినప్పుడు రూ. 10 వేలు బోనస్ ఇవ్వడం, దేశవ్యాప్తంగా 100 మహిళా స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. దీనిలో రెండు యూనివర్సిటీలు హైదరాబాద్‌లోనే రాబోతుండటం గమనార్హం.

అలాగే మహిళలకు స్కూటీల కొనుగోలుపై 100 శాతం సబ్సిడీ ఇవ్వడం , మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ కల్పించడం వంటి నిర్మలమ్మ నిర్ణయాలు సభలో చప్పట్ల వర్షం కురిపించాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2070 నాటికి నెట్ జీరో టార్గెట్‌ను రీచ్ అవడానికి రూ. 15 లక్షల కోట్లను గ్రీన్ ఎనర్జీకి కేటాయించారు. కోటి ఎలక్ట్రిల్ వాహనాలను రోడ్లపైకి తేవడం, ప్రతి ఇంటికీ 3 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ సదుపాయం కల్పించడం వల్ల భారత్ గ్రీన్ పవర్ హబ్‌గా మారనుంది.

అంతేకాదు మధ్యతరగతి ప్రజలకు పన్నుల నుంచి భారీ విముక్తిని ప్రసాదిస్తూ.. రూ. 5 లక్షల వరకు సున్నా పన్ను, రూ. 5 నుంచి రూ. 10 లక్షల ఆదాయంపై 5 శాతం పన్నును నిర్ణయించారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 1.5 లక్షలకు పెంచడమే కాకుండా, హౌసింగ్ లోన్ వడ్డీపై రూ. 5 లక్షల వరకు రాయితీ ఇచ్చారు. ఇది గృహ నిర్మాణ రంగానికి కూడా పెద్ద ఊతం ఇవ్వబోతోంది.

అటు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ. 12 లక్షల కోట్ల వ్యయంతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను విస్తరించారు. దీనిలో భాగంగా హైదరాబాద్-వరంగల్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన తెలుగు ప్రజలకు అతిపెద్ద వరం అనే చెప్పాలలి. రక్షణ రంగానికి 7 లక్షల కోట్లు కేటాయించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణలో రూ. 20 వేల కోట్ల వ్యయంతో ఫార్చూన్ 500 ఐటీ హబ్ , సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆధునీకరణకు రూ. 15 వేల కోట్లు , గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు.

మరోవైపు ప్రజల రోజువారీ ఖర్చులపై ఈ బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతోందనేది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రాణాపాయ వ్యాధుల ట్రీట్మెంట్‌లో వాడే 17 రకాల అత్యవసర ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని సడలించడంతో ఆ ప్రాణరక్షక మందుల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రాబోతున్నాయి.

అలాగే మొబైల్ ఫోన్ల తయారీలో వాడే విడిభాగాలు , క్యాపిటల్ గూడ్స్‌పై ప్రభుత్వ రాయితీల వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత తగ్గే సూచనలున్నాయి.ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా, లిథియం-అయాన్ సెల్స్‌పై ప్రాథమిక సుంకాన్ని మినహాయించడంతో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల ధరలు తగ్గనున్నాయి. దీంతో పాటు వస్త్ర, లెదర్ రంగాలకు ఊతమిస్తూ వెట్ బ్లూ లెదర్ వంటి ముడి పదార్థాలపై డ్యూటీ తగ్గించారు. దీని ద్వారా దుస్తులు , తోలు వస్తువుల ధరలు చౌకవుతాయి.

అటు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు వీలుగా రొయ్యల ఫీడ్ వంటి ఇన్‌పుట్స్‌పై డ్యూటీ-ఫ్రీ దిగుమతి లిమిట్‌ను ఎఫ్‌ఓబీ విలువలో 1 శాతం నుంచి 3 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. క్రీడా రంగంలో యూత్‌ను ప్రోత్సహించడానికి క్రీడా పరికరాల ధరలను కూడా మరింత తగ్గించబోతున్నారు.

Nirmala
Nirmala

అయితే ‘మేక్ ఇన్ ఇండియా’ను బలపరిచేందుకు దేశీయంగా తయారయ్యే వస్తువుల దిగుమతులపై కొన్ని మినహాయింపులను ఈ బడ్జెట్‌లో తొలగించారు, దీనివల్ల కొన్ని విదేశీ యంత్రాలు ,పారిశ్రామిక భాగాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిగరెట్లు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ ,హెల్త్ సెస్ పెంచడం వల్ల వీటి ధరలు మాత్రం భారీగానే పెరగబోతున్నాయి.

మొత్తంగా ఆర్థికవేత్తలు దీనిని 7.5 నుంచి 8 శాతం వృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అని చెబుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం మధ్యతరగతికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా, 2047 నాటి వికసిత భారత స్వప్నాన్ని సాకారం చేసే దిశగా.. ఈ బడ్జెట్ ఒక బలమైన తొలి అడుగు అని ఆర్థిక మంత్రి తన ప్రసంగం ముగించగానే ..సెన్సెక్స్ 2 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకాన్ని బలపరిచినట్లు అయింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button