just AnalysisJust TelanganaLatest News

Panchayat elections: పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటరు పవర్ ప్లే..2028కి ఇదే ట్రైలర్  కానుందా?

Panchayat elections: తాజా ఫలితాలలో తెలంగాణ పల్లెల్లో హస్తం పార్టీకే ప్రజలు పట్టం కట్టారు.

Panchayat elections

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా సాగిన గ్రామ పంచాయతీ (Panchayat elections)ఎన్నికల సమరం ముగిసింది. మూడు దశల్లో జరిగిన ఈ పోలింగ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ తన హవాను చాటుకుంది. మొదటి రెండు దశల్లోనే ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్, మూడవ దశలో కూడా అదే జోరును కొనసాగించి గ్రామీణ ఓటర్ల మనసు గెలుచుకుంది.ప్రతిపక్ష పార్టీలు వేసిన అంచనాలు తలకిందులవుతూ, మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. తాజా ఫలితాల ప్రకారం తెలంగాణ పల్లెల్లో హస్తం పార్టీకి ప్రజలు పట్టం కట్టారు.

మూడవ విడత ఫలితాలను గమనిస్తే, కాంగ్రెస్ మద్దతుదారులు 1,147 చోట్ల విజయం సాధించగా, బీఆర్ఎస్ 519, బీజేపీ 97 స్థానాల్లో గెలుపొందాయి. మొదటి మరియు రెండో దశల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వరుసగా 2,331 మరియు 2,245 స్థానాలను దక్కించుకుని రాష్ట్రవ్యాప్తంగా తన పట్టును నిరూపించుకుంది.

బీఆర్ఎస్ పార్టీ గతంతో పోలిస్తే గణనీయంగా తన స్థానాలను కోల్పోయి రెండో స్థానానికే పరిమితమైంది. బీజేపీ కూడా కొన్ని చోట్ల తన ఉనికిని చాటుకున్నా కూడా కాంగ్రెస్‌తో పోటీ పడలేకపోయింది. ఈ ఫలితాలు చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయిలో మరింత బలపడిందని స్పష్టమవుతోంది.

ఈ (Panchayat elections)ఎన్నికల్లో కొన్ని ఆసక్తికరమైన గెలుపోటములు కూడా చోటుచేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఒక పోటీలో చంద్రబాబు , జగన్ అనే పేర్లు గల అభ్యర్థులు తలపడ్డారు. ఇందులో భూక్యా చంద్రబాబు విజయం సాధించడంతో, సోషల్ మీడియాలో జగన్‌పై చంద్రబాబు విజయం అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాల్లో కేవలం 3 నుండి 8 ఓట్ల తేడాతో అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. మొత్తానికి తెలంగాణ గ్రామాల్లో జరిగిన ఈ ఎన్నికల సమరం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Panchayat elections
Panchayat elections

మరోవైపు తెలంగాణ పంచాయతీ ఎన్నికల (Panchayat elections)ఫలితాలను కేవలం గెలుపోటముల లెక్కల్లో చూస్తే అది ఒక సాధారణ వార్త అవుతుంది. కానీ ఓటరు మనస్తత్వంలో వచ్చిన లోతైన మార్పుగా చూస్తే, ఇది ఒక అద్భుతమైన రాజకీయ విశ్లేషణగా నిలుస్తుంది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల, బీఆర్‌ఎస్ పతనం, బీజేపీ వెనుకబాటుతనం అన్నీ ఒకే కథలో ఇమిడిపోయాయి. పల్లె ఓటరు తన మనసులోని మాటను ఈ ఎన్నికల ద్వారా చాలా స్పష్టంగా వినిపించాడు.

బీఆర్‌ఎస్‌కు ఇది కేవలం ఓటమి మాత్రమే కాదు, ప్రజలు విధించిన ఒక వింతైన విశ్రాంతి శిక్ష. పది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న ఒక పార్టీకి ప్రజలు సాధారణంగా అపోజిషన్ బెంచ్ ఇస్తారు. కానీ తెలంగాణలో ఓటరు ఒక అడుగు ముందుకు వేసి, మేము కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీని పరీక్షిస్తాం అని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా బీఆర్‌ఎస్‌కు గతంలో ఉన్న ఆ బలమైన భావోద్వేగ మద్దతు ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతోంది. ఇప్పటి ఓటరు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాడు. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌కు బలమైన కేడర్ ఉన్నా కూడా, ఓటరు మాత్రం మార్పు కావాలని కోరుకున్నాడు. ఇది పార్టీపై ఉన్న కోపం కంటే, ఒకే పార్టీని పదేళ్లు చూడటం వల్ల కలిగిన అలసటపై ఇచ్చిన తీర్పుగా కనిపిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ విజయం వెనుక ఒక పక్కా ప్లాన్ కనిపిస్తోంది. దీనిని మనం కర్ణాటక-పంజాబ్-లోకల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ అంటే ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వైపు చూడటం అనే ఇమేజ్ ఉండేది. కానీ ఈసారి స్థానిక నాయకత్వానికి పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చారు. నువ్వే ఈ ప్రాంతానికి నాయకుడివి, గెలుపు ఓటములకు నువ్వే బాధ్యుడివి అని స్థానిక నేతలకు చెప్పడం వల్ల, గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ ఉత్తేజంతో పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయం వారికి ఒక పెద్ద మానసిక బలాన్ని ఇచ్చింది. మళ్లీ మన టైమ్ వచ్చింది అన్న నమ్మకంతో వారు ఒక సైన్యంలా కదిలారు. కర్ణాటకలో ఏ విధంగా అయితే సోషల్ ఇంజనీరింగ్ తో బీజేపీని గద్దె దించారో, అదే ఫార్ములాను ఇక్కడ కూడా వాడారు. రైతు , దళిత సెంటిమెంట్లను కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది.

ఇక బీజేపీ పరిస్థితి చూస్తే, ఆ పార్టీకి తెలంగాణలో ఓటర్లు లేరు అని చెప్పలేం కానీ, వారికి ఒక బలమైన కారణం లేకపోయింది. ఉత్తరాదిలో పనిచేసే మోదీ ఫేస్ , హిందుత్వ నినాదం తెలంగాణ పల్లెల్లో పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. నా గ్రామం, నా పొలం, నా ఉద్యోగం విషయంలో నువ్వు ఏం చేశావు అని ఓటరు అడిగే ప్రశ్నలకు బీజేపీ దగ్గర సరైన సమాధానం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై ఉన్న ఆసక్తి, విశ్వాసంగా మారాల్సిన సమయంలోనే పార్టీలో అంతర్గత గొడవలు మొదలయ్యాయి. లీడర్‌షిప్ మార్పులు , ప్రచారంలో ఉన్న లోపాలు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీశాయి. బీజేపీ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోంది కానీ, గ్రామంలోని ప్రతి గడప దగ్గర కనిపించడం లేదని ఓటరు భావించాడు. అందుకే ట్విట్టర్ ట్రెండ్స్ కు లొంగకుండా ఓటరు తన వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా తీర్పు ఇచ్చాడు.

ఈసారి గ్రామ ఎన్నిక(Panchayat elections)ల్లో ఓటరు ప్రతీకారాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు. గత 10 ఏళ్లలో తాము ఎదుర్కొన్న సమస్యలకు, రైతు ఆత్మహత్యల సైలెంట్ స్టోరీలకు ఓటు ద్వారా సమాధానం చెప్పాడు. బీసీ , దళితుల కోసం ప్రకటించిన పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ అందకపోవడంతో, నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని ప్రజలు తమ కోపాన్ని ప్రదర్శించారు. ఈ ప్రతీకార ఓటు ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు తగిలినా, రేపు పొద్దున్న కాంగ్రెస్ సరిగ్గా పనిచేయకపోతే అది తమకు కూడా తగులుతుంది అని కాంగ్రెస్ గ్రహించాలి. అయితే కాంగ్రెస్ చాలా తెలివిగా స్థానిక నేతల ద్వారా ప్రజలతో మమేకమై ఆ కోపాన్ని తన వైపు మళ్లించుకోవడంలో విజయం సాధించింది.

చివరగా ఈ పంచాయతీ ఫలితాలు కేవలం లోకల్ ఎన్నికలు మాత్రమే కావు. ఇవి రాబోయే 2028 అసెంబ్లీ , 2029 లోక్‌సభ ఎన్నికలకు ఒక ప్రాక్టికల్ రిహార్సల్స్ లాంటివి. కాంగ్రెస్ ఇప్పుడు ప్రతి గ్రామంలో తనకంటూ ఒక లోకల్ పవర్ సెంటర్‌ను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా, మైక్రో మేనేజర్లుగా పనిచేస్తారు.

బీఆర్‌ఎస్‌లో కొత్త రక్తం కనిపించడం లేదు, ఆ పార్టీ ఇంకా పాత ఇమేజ్ మీదనే ఆధారపడుతోంది. బీజేపీ బూత్ లెవల్లో సీరియస్‌గా పనిచేయకపోతే, ఆ పార్టీ కేవలం నగరాలకే పరిమితం అయ్యే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో ఓటరు తెలంగాణలో  జనసేన లాంటి కొత్త పార్టీలను కూడా ట్రయల్ రన్ కింద పరిశీలిస్తున్నాడు. తెలంగాణ రాజకీయ పటాన్ని ఓటరు కొత్తగా గీస్తున్నాడు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button