AP : ఆయుష్మాన్ భారత్ కంటే గొప్ప స్కీమ్ ఏపీలో.. ఎందుకో తెలుసా?
AP : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఆరోగ్య పథకం (EHS) పరిధిలో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పటికే ఇతర ప్రత్యేక పథకాల ద్వారా వైద్య సదుపాయాలు పొందుతున్నవారు ఈ పథకానికి అర్హులు కారు.

AP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన ఆరోగ్య విధానం దేశంలోనే ఒక విప్లవాత్మక అడుగుగా నిలిచింది. ఇది కేవలం ఒక ఆరోగ్య పథకం కాదు, రాష్ట్ర ప్రజలకు పూర్తిస్థాయిలో ఆరోగ్య భద్రతను అందించే ఒక సమగ్రమైన సంస్కరణ. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 5 కోట్ల మందికి ఏటా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు హైబ్రిడ్ మోడల్‌లో అందించనున్నారు. ఇంత భారీ కవరేజీని, ఈ వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే మొదటిసారి కావడంతో దీనిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది.
ఈ కొత్త ఆరోగ్య విధానం ప్రధానంగా రెండు విభాగాలలో పనిచేస్తుంది. తొలి దశలో, రూ.2.5 లక్షల వరకు ఉన్న వైద్య ఖర్చులను బీమా సంస్థలు( Health Insurance) భరిస్తాయి. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్ పీఎమ్-జే (PMJAY) వంటి పథకాలతో పోలిస్తే మెరుగైన కవరేజీని అందిస్తుంది. అయితే, ఈ పథకం యొక్క అసలైన ప్రత్యేకత రెండో దశలో ఉంది. వైద్య ఖర్చు రూ.2.5 లక్షలు దాటిన తర్వాత, రూ.25 లక్షల వరకు ఉన్న మొత్తాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా చెల్లిస్తారు. ఈ హైబ్రిడ్ మోడల్ దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదు.
అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఆరోగ్య పథకం (EHS) పరిధిలో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పటికే ఇతర ప్రత్యేక పథకాల ద్వారా వైద్య సదుపాయాలు పొందుతున్నవారు ఈ పథకానికి అర్హులు కారు. ఇది డబుల్ బెనిఫిట్ (రెండుసార్లు బీమా) నివారించడానికి, ఎక్కువ మందికి ప్రయోజనం కల్పించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన నిర్ణయం.
ఈ పథకం కింద 3,257 రకాల వైద్య చికిత్సలు వర్తిస్తాయి, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులలో 324 రకాల ప్రత్యేక సేవలు కూడా ఉన్నాయి. జిల్లా ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు – అన్నింటిలోనూ ఈ పథకం వర్తిస్తుంది. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా వృత్తిపరంగా సున్నితమైన వర్గాలైన జర్నలిస్టులకు ఒక గొప్ప వరం. దీని ద్వారా క్యాన్సర్, హృద్రోగం, కిడ్నీ సర్జరీ వంటి ఖరీదైన చికిత్సలను కూడా క్యాష్ లెష్ చికిత్స పొందొచ్చు.
ఈ కొత్త విధానం అమలు పర్యవేక్షణలో కూడా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన ఆరు గంటల్లోపే ప్రి-సాంక్షన్ ప్రక్రియ పూర్తవుతుంది. క్లెయిమ్ చెల్లింపు 15 రోజుల్లోగా జరుగుతుంది. క్యూఆర్ కోడ్, కంట్రోల్ రూమ్ ద్వారా రోగుల పరిస్థితిని రియల్‌టైమ్‌లో ట్రాక్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ యాంటీ-ఫ్రాడ్ విభాగం ద్వారా ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి. ఇది పథకం పారదర్శకతను, సమర్థతను పెంచుతుంది.

ఈ ఆరోగ్య విధానం కేవలం ప్రజలకే కాకుండా, రాష్ట్ర వైద్య రంగానికి కూడా ఒక పెద్ద ముందడుగు. పీపీపీ విధానంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రతిపాదన, ఇందులో మొదటి విడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వంటి పట్టణాల్లో కళాశాలలు వస్తాయి. ఇది వైద్య విద్య అవకాశాలను పెంచుతుంది. అయితే, దీనివల్ల ప్రభుత్వ సీట్లలో కొంత కోత వచ్చే ప్రమాదం ఉందని విమర్శలు ఉన్నాయి.
మొత్తంగా, ఈ కొత్త ఆరోగ్య విధానం ఆంధ్రప్రదేశ్(AP)ను దేశంలో ఆరోగ్య సంరక్షణ విషయంలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిపింది. పీఎమ్-జే, స్టేట్ ట్రస్ట్ , ప్రైవేట్ బీమా వంటి వాటిని సమర్థవంతంగా అనుసంధానం చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అత్యున్నత వైద్య సేవలను అందించడంలో ఈ పథకం ఒక మార్గదర్శిగా నిలుస్తోంది. సెప్టెంబర్ 4, 2025న క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ విధానం, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.