Cyclone Mantha: తీరాన్ని తాకిన మొంథా తుఫాను.. మరో 4 గంటలు టెన్షన్ టెన్షన్
Cyclone Mantha: కాకినాడ సమీపాన బుధవారం తెల్లవారుఝాము వరకూ తుఫాను తీరం దాటిపోతుందని వెల్లడించింది. మొంథా తుఫాను(Cyclone Mantha) తీరం దాటడం మొదలుపెట్టగానే బీభత్సమైన వాతావరణం కనిపించింది.
Cyclone Mantha
ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుఫాను(Cyclone Mantha) ఎట్టకేలకు తీరాన్ని తాకింది. దిశ మార్చుకుంటూ అందరినీ టెన్షన్ పెట్టిన మొంథా తుఫాను కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలో తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కాకినాడకు 110 కిలోమీటర్లు, విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వెల్లడించింది. ఈ తుఫాను పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుఝాము వరకూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
కాకినాడ సమీపాన బుధవారం తెల్లవారుఝాము వరకూ తుఫాను తీరం దాటిపోతుందని వెల్లడించింది. మొంథా తుఫాను(Cyclone Mantha) తీరం దాటడం మొదలుపెట్టగానే బీభత్సమైన వాతావరణం కనిపించింది. ఊహించినట్టుగానే సముద్ర తీరాన రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కొన్ని సార్లు లైట్ హౌస్ పై భాగం వరకూ అలసు ఎగిసిపడినట్టు తెలుస్తోంది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి 100 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అటు తీరం దాటుతున్న పరిస్థితులను సీఎం చంద్రబాబు సచివాలయంలోనే ఉండి సమీక్షిస్తున్నారు. ఉదయం వరకూ చంద్రబాబు అక్కడే ఉండి పర్యవేక్షించనున్నారు. పలువురు మంత్రులు కూడా అధికారులతో సమీక్షలు జరుపుతూ అప్రమత్తం చేస్తున్నారు.
ఇప్పటికే తీరప్రాంత ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. వారందరికీ భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించారు. రేపు ఉదయం పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత వారి వారి గ్రామాలకు తరలిస్తారు. ఇదిలా ఉంటే మొంథా తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా బందరు బీచ్ రోడ్డులో ఈదురుగాలుల ప్రభావంతో పలు చెట్లు కూలిపోయాయి. హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే తుపాను తీరం దాటుతుండడంతో రేపు చాలా జిల్లాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ అర్థరాత్రి తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షసూచన ఉన్నట్టు తెలిపింది. తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత ఇది క్రమంగా తెలంగాణవైపు వెళ్లి అక్కడి నుంచి ఛత్తీస్ ఘడ్ వైపు మరలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.



