Amaravati:రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు డేట్ ఫిక్స్..!
Amaravati:అమరావతి (Amaravati)రాజధాని నగర విస్తరణలో కీలక అడుగు పడింది.

Amaravati:అమరావతి (Amaravati)రాజధాని నగర విస్తరణలో కీలక అడుగు పడింది. రెండో దశ భూ సమీకరణకు ఈ నెలాఖరులోపు అంటే జూలై 24, 25 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఊహించని పరిణామాలు తలెత్తితే తప్ప, నోటిఫికేషన్‌ను కచ్చితంగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనకు వెళ్లేలోపే దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడనుంది.
Amaravati
ఇటీవల జరిగిన CRDA అథారిటీ సమావేశంలో తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు(Land pooling) ఆమోదం లభించింది. అనంతరం, జూలై 9న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ దీనికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఏపీసీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 55లోని సబ్‌సెక్షన్ 2 ప్రకారం సీఆర్‌డీఏ రీజియన్ పరిధిలో భూ సమీకరణ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అయితే, నోటిఫికేషన్ విడుదల తేదీని ఖరారు చేయకపోవడంతో భూ సమీకరణ జరుగుతుందా లేదా అనే గందరగోళం నెలకొంది. దీంతో ఈ నెలాఖరులోపే పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ల నియామక ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు.
బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన చర్చల్లో ఆర్థిక అంశాలపై కొంత స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో భూ సమీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
సింగపూర్ పర్యటనలో అర్బన్ ప్లానింగ్, బ్యూటిఫికేషన్, గార్డెనింగ్, పోర్టులపై చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతం అమరావతి ప్లానింగ్ అంశంపైనే సింగపూర్ ప్రభుత్వంతో రాష్ట్రం చర్చలు జరుపుతోంది. సానుకూల వాతావరణం నెలకొనడంతోనే ఈ బృందం సింగపూర్ పర్యటనకు బయలుదేరుతోంది. అక్కడ చర్చించే అంశాల్లో అమరావతి ప్లానింగ్ అత్యంత కీలకం కానుందని అధికారులు చెబుతున్నారు.
గతంలో జరిగిన పూలింగ్‌కు సింగపూర్‌కు చెందిన సుర్బానా కంపెనీయే ప్లానింగ్ అందించింది. కొత్తగా సమీకరణకు వెళ్లే ప్రాంతంలో ప్లానింగ్ చేయాలంటే చట్టబద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. లేనిపక్షంలో సింగపూర్ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే సింగపూర్ వెళ్లేలోపే దీనికి తగిన విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రులు నారా లోకేష్, పి. నారాయణ, టి.జి. భరత్, అధికారులు కాటంనేని భాస్కర్, యువరాజు, కార్తికేయ మిశ్రాతో పాటు ఎకనామిక్ డెవలప్‌మెంట్ సీఈఓ సాయికాంత్ వర్మ, సీఆర్‌డీఏ కమిషనర్ కె. కన్నబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి జూలై 13న ప్రభుత్వం జీవో 120ని విడుదల చేసింది.