Metro Rail : ఏపీ వాసులకు డబుల్ ధమాకా కబురు
Metro Rail : దక్షిణ భారతదేశంలో, ఒక సొంత రాజధాని, ముఖ్యంగా మెట్రో రైలు వ్యవస్థ లేకపోవడం ఆంధ్రప్రదేశ్‌కు ఒక వెలితిగా మిగిలిపోయింది.

Metro Rail : దక్షిణ భారతదేశంలో, ఒక సొంత రాజధాని, ముఖ్యంగా మెట్రో రైలు వ్యవస్థ లేకపోవడం ఆంధ్రప్రదేశ్‌కు ఒక వెలితిగా మిగిలిపోయింది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక (బెంగళూరు), తమిళనాడు (చెన్నై), కేరళ (కొచ్చి) తమ రాజధానులలో మెట్రో రైళ్లు దూసుకుపోతుంటే, “మన రాష్ట్రంలో ఎప్పుడో?” అన్న ప్రశ్నతో ఏపీ వాసులు ఎదురుచూస్తున్నారు.
Metro Rail
ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచి, నగర స్వరూపాన్ని మార్చేసింది. బెంగళూరులో నమ్మ మెట్రో ప్రజల దైనందిన జీవనంలో భాగమైపోయింది, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచింది. చెన్నై తన రద్దీని చీల్చేందుకు మెట్రోను సమర్థవంతమైన ఆయుధంగా మలచుకుంది. కొచ్చి మెట్రోతో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చూసింది. ఈ పరిణామాలు చూస్తూ, తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురుచూసిన ఆంధ్రులకు నిరాశే మిగిలింది.
అమరావతిని రాజధానిగా నిర్మించే ప్రయత్నాలను అడ్డుకోవడం, విశాఖపట్నం, విజయవాడ నగరాలు అభివృద్ధిలో ఎదుర్కొన్న అవరోధాలతో ఏపీకి మెట్రో ప్రయాణం అందని ద్రాక్షలా మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవతో ఆ నిరీక్షణకు తెరపడింది.
అవును ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా మెట్రో రైలు ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు కేవలం కాగితాలకే పరిమితమైన ఈ రెండు కీలక ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కేబినెట్ ఇటీవల సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తొలి దశ పనులకు టెండర్లను ఆహ్వానించి, నిర్మాణ పనులను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో, ఈ శుక్రవారం (జూలై 25) నుంచి తొలి విడత టెండర్లను ఆహ్వానించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మెట్రో రైళ్లు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ మెట్రో రైళ్ల ప్రాజెక్టులు మొత్తం రెండు దశల్లో పూర్తికానున్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 21,600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతంలోనూ ఇదే తరహా ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టినా, అవి వివిధ కారణాలతో ముందుకు సాగలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టులు పూర్తిగా వెనక్కి తగ్గాయి. అయితే, ఈసారి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం, వచ్చే మూడేళ్లలో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాలని గట్టి సంకల్పంతో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులను అందించనుంది.
విశాఖపట్నంలో మెట్రో సేవలు భీమిలి వరకు విస్తరించనుండగా, విజయవాడలో రాజధాని అమరావతి చుట్టూ ఉండే ప్రాంతాల్లోనూ ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తొలి విడత కింద, మొత్తం పనుల్లో 40 శాతం పనులకు టెండర్లను పిలవనున్నారు. వీటిలో విశాఖ మెట్రో రైలుకు 11,498 కోట్ల రూపాయలతో, విజయవాడ మెట్రోకు 10,118 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవనున్నారు. తొలి దశకు అవసరమయ్యే నిధులలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కేటాయించనుంది. మలిదశలో పూర్తిగా కేంద్రం తన వాటాను అందించేలా ప్రణాళిక రూపొందించారు.
విశాఖపట్నం(Visakhapatnam) మెట్రో ప్రాజెక్టుకు విశాఖ మెట్రో రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) నుంచి తొలి దశలో 4,100 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ఈ ప్రారంభ నిధులతో నిర్మాణ పనులు మొదలుపెట్టి, ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే ప్రణాళిక ఉంది.
విజయవాడ(Vijayawada) మెట్రోకు రాజధాని అమరావతి నిధులు వెచ్చించనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) నుంచి 3,500 కోట్ల రూపాయలను కేటాయిస్తారు. ఈ నిధులను విడతలవారీగా నిర్మాణ సంస్థలకు అందజేసి, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పొందనున్నారు. ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనతో ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో ఒక నూతన శకం ప్రారంభం కానుంది, రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుంది.