Telugu states: తెలుగు రాష్ట్రాల్లో గడ్డకట్టే చలి..ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త
Telugu states: గాలిలో తేమ శాతం పెరగడం, ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లని గాలుల ప్రభావంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
Telugu states
తెలుగు రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో(Telugu states) ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గాలిలో తేమ శాతం పెరగడం, ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లని గాలుల ప్రభావంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా తెల్లవారుజామున , రాత్రి సమయాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే చలి పులి (Telugu states)పంజా విసురుతోంది. రాబోయే మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో చలి రికార్డులు- వణికిస్తున్న ఆదిలాబాద్.. తెలంగాణలో చలి తీవ్రత అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు మంచు గడ్డలా మారిపోయింది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుండి 7 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యల్పంగా నిలిచింది. ఆదిలాబాద్ లో 6.2 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహీర్ ప్రాంతంలో 7.1 డిగ్రీలు, మెదక్ లో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, బిహెచ్‌ఇఎల్ పరిసరాల్లో 10 నుంచి 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి 9 గంటలకే వీధులన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో చలి పంజా- ఏపీ ఊటీలో రికార్డ్ చలి..ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత ఏజెన్సీ ప్రాంతాల్లో గత రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పడిపోతున్నాయి.
చింతపల్లిలో 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్‌లోనే అత్యల్పంగా నిలిచింది. ఇక ఏపీ ఊటీగా పిలువబడే లంబసింగిలో ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల మధ్య ఉంటోంది. ఇక్కడ తెల్లవారుజామున మంచు కురుస్తుండటంతో పర్యాటకులు భారీగా క్యూ కడుతున్నారు. పాడేరులో 6.5 డిగ్రీలు, అరకు లోయలో 7.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో 13 నుండి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
చలి తీవ్రత(Telugu states) పెరుగుతుండటంతో ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు, చిన్న పిల్లలు ,వృద్ధులు తెల్లవారుజామున బయటకు రాకపోవడమే మంచిది. చర్మం పొడిబారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేవారు కచ్చితంగా మందపాటి దుస్తులు, చేతి గ్లౌజులు, మఫ్లర్లు ధరించడం మంచిది. పొగమంచు వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి వాహనదారులు ఫాగ్ లైట్లు వాడుతూ చాలా జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు కోరుతున్నారు.



