Kailasagiri: కైలాసగిరిపై గాజు వంతెన..స్పెషాలిటీ ఏంటి?
Kailasagiri: ఈ బ్రిడ్జ్ 100 మంది బరువును భరించగల సామర్థ్యం ఉన్నా కూడా.. పర్యాటకుల సేఫ్టీ కోసం ఒకేసారి 40 మందిని మాత్రమే అనుమతిస్తారు.

Kailasagiri
సముద్ర తీరం, పచ్చని కొండల కలయికతో ఎప్పుడూ పర్యాటకుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటుంది.. విశాఖపట్నం . ఇప్పుడు, ఈ నగరం సాహస ప్రియులకి కూడా స్వర్గధామంగా మారబోతోంది. విశాఖపట్నంలోని కైలాసగిరి(Kailasagiri)పై దేశంలోనే అతిపొడవైన 55 మీటర్ల గాజు స్కైవాక్ బ్రిడ్జ్ సిద్ధమైంది. ఇది విశాఖ టూరిజంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోంది.
విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (VMRDA) ఆధ్వర్యంలో టైటానిక్ వ్యూపాయింట్ దగ్గర నిర్మితమైన ఈ బ్రిడ్జ్, సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో పూర్తయ్యింది. కేరళలోని వాగమన్ గ్లాస్ బ్రిడ్జ్ (40 మీటర్లు) రికార్డును ఇది బ్రేక్ చేసి, దేశంలోనే అతిపెద్దదిగా నిలిచింది. ఈ బ్రిడ్జ్ 100 మంది బరువును భరించగల సామర్థ్యం ఉన్నా కూడా.. పర్యాటకుల సేఫ్టీ కోసం ఒకేసారి 40 మందిని మాత్రమే అనుమతిస్తారు.
ఈ గాజు వంతెనపై నడుస్తున్నప్పుడు, గాల్లో తేలియాడుతున్న అనుభూతి కలుగుతుంది. కింద లోతైన లోయ, చుట్టూ కొండలు, దూరంగా సముద్రం, మరియు విశాఖ నగరపు అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

ఈ ప్రాజెక్ట్‌ను ప్రజా-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) కింద VMRDA, RJ అడ్వెంచర్స్ సంస్థతో కలిసి చేపట్టింది. టికెట్ అమ్మకాల్లో VMRDAకి 40% ఆదాయం వస్తుంది, ఇది ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారనుంది. గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌కి వేగం పుంజుకోవడం విశేషం.
ఈ గాజు బ్రిడ్జ్‌తో పాటు, కైలాసగిరి(Kailasagiri)లో మరిన్ని సాహస క్రీడలు అందుబాటులోకి వస్తున్నాయి. 150 మీటర్ల జిప్‌లైన్ , స్కై సైక్లింగ్ ట్రాక్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. జిప్‌లైన్‌లో గంటకు 80-100 కి.మీ. వేగంతో సముద్రపు అందాలను చూడవచ్చు. స్కై సైక్లింగ్ అయితే 10-15 నిమిషాలపాటు గాల్లో సైక్లింగ్ చేసిన అనుభూతిని ఇస్తుంది. ఈ అడ్వెంచర్ ఆకర్షణలు త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి.
కైలాసగిరి ఇప్పటికే తన ప్రకృతి అందాలతో ఏటా 3 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌లతో ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఈ అడ్వెంచర్ టికెట్ ధరలు రూ.100 నుంచి రూ. 300 మధ్య ఉండవచ్చని VMRDA అధికారులు తెలిపారు.
భవిష్యత్తులో కైలాసగిరి(Kailasagiri)లో నేచర్ కాటేజ్‌లు, రివాల్వింగ్ రెస్టారెంట్, బీచ్ వ్యూ కేఫ్ వంటి మరిన్ని ప్రాజెక్ట్‌లను కూడా చేపట్టే ఆలచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అభివృద్ధి పనులు విశాఖను జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా, ముఖ్యంగా సాహస ప్రియులకు ఒక కొత్త గమ్యంగా మారుస్తాయి.