Revanth Reddy: వారి వెనుక నేనెందుకు ఉంటాను.. రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇప్పుడు అదే కుటుంబం, ఆ పార్టీ నాయకులు అవినీతి సొమ్ము పంపకంలో తేడాల వల్ల కొట్టుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు.

Revanth Reddy
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడం , ఆమె తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో ఘాటుగా స్పందించారు.
ఎవరో వెనక నేనెందుకు ఉంటాను? నేను ఎవరి వెనుక ఉండను, ఉంటే ముందే ఉంటాను అంటూ కవిత వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక తానెందుకుంటానని, బీఆర్‌ఎస్ నేతల మధ్య జరుగుతున్న గొడవలు అర్థరహితమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు.
గతంలో తమకు నచ్చని వారిని ఎదగనీయకుండా చేసిన బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు తమలో తామే పంచాయితీలు పెట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నారని విమర్శించారు. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని బండకేసి కొట్టారని సీఎం అన్నారు. ఇప్పుడు అదే కుటుంబం, ఆ పార్టీ నాయకులు అవినీతి సొమ్ము పంపకంలో తేడాల వల్ల కొట్టుకుంటున్నారని ఆరోపించారు.వారు కొట్టుకునే దానిలోకి నన్నెందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.
ఒకప్పుడు గొప్ప పేరున్న జనతా పార్టీ కూడా కనుమరుగైందని, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చిన అద్భుతమైన పార్టీ అయిన టీడీపీ కూడా కొందరి కుట్రల వల్ల తెలంగాణలో సమస్యను ఎదుర్కొంటోందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అక్రమ కేసులు పెట్టి ఎందరినో జైలుకు పంపించిన బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు వారిలో వారే కొట్టుకుంటున్నారని, ఇది వారు చేసిన పాపాలకు ఫలితమని అన్నారు. ‘చేసిన పాపాలు ఎక్కడికి పోవు, కచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్లు అనుభవించి తీరాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు.
2 Comments