Liquor Scam :ఏపీలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదులుతుందేంటి?
Liquor Scam: ప్రస్తుతం ఏపీని అతలాకుతలం చేస్తున్న వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం (Liquor Scam)కేసు ఇప్పుడు ఊహించని మలుపు తీసుకుంది.

Liquor Scam ప్రస్తుతం ఏపీని అతలాకుతలం చేస్తున్న వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం (Liquor Scam)కేసు ఇప్పుడు ఊహించని మలుపు తీసుకుంది. ఇది కేవలం ఆర్థిక నేరంగా మిగిలిపోకుండా, తెలంగాణ రాజకీయాల్లోనూ భారీ ప్రకంపనలు సృష్టించే దిశగా సాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో ఒక కీలకమైన తెలంగాణ వ్యక్తి ప్రమేయం బయటపడటంతో, గత ప్రభుత్వాల హయాంలో జరిగిన సంచలనాత్మక ఫోన్ ట్యాపింగ్ కేసుతో దీనికి ఉన్న సంబంధాలపై ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది.
Liquor Scam
ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే తన ఛార్జిషీట్‌లో ఈ కుంభకోణం ద్వారా దాదాపు రూ. 3,500 కోట్లు కొల్లగొట్టారని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది అరెస్టయ్యారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టుతో కేసు మరింత వేడెక్కింది. అయితే, ఇప్పుడు ప్రశ్నలు కేవలం ఏపీ నేతలకే పరిమితం కావడం లేదు. ఈ భారీ కుంభకోణం వెనుక నాటి ప్రభుత్వాల పెద్దల అండదండలు ఉన్నాయా? దీనికి సంబంధించిన కీలక వ్యూహరచన హైదరాబాద్‌లోని గోప్యమైన ప్రదేశాల్లోనే జరిగిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ ఇటీవల శ్రవణ్ రావు(Shravan Rao) అనే వ్యక్తిని విచారించడం కేసులో అసలైన ట్విస్ట్. శ్రవణ్ రావు పేరు తెలంగాణలో ఇటీవల బయటపడిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉంది. ఒక సంచలనాత్మక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి మరో పెద్ద కుంభకోణంలో విచారణకు హాజరుకావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ రెండు కేసుల మధ్య ఏదైనా అదృశ్య అనుసంధానం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మద్యం కేసులోని నిందితులకు శ్రవణ్ రావు దుబాయ్‌లో ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలు ఉండటంతోనే సిట్ ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విజయవాడలోని సిట్ అధికారుల ఎదుట ఆయన హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)కి శ్రవణ్ రావు అత్యంత సన్నిహితుడు కావడంతో, ఈ విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ లింకు, కేవలం ఆర్థిక నేరాన్ని మించి రాజకీయ కుట్రల కోణాన్ని బయటపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు వెల్లువెత్తగా, ఏపీ మద్యం కుంభకోణంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రమేయం ఉందని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు, ఈ రెండు పెద్ద కేసుల్లోనూ ఒకే వ్యక్తి పేరు వినిపించడం, రెండు రాష్ట్రాల్లోని గత ప్రభుత్వాల మధ్య ఏదైనా ‘నిగూఢ ఒప్పందం’ జరిగిందా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దల అండదండలతోనే కొందరు వ్యక్తులు ఏపీ మద్యం కుంభకోణానికి సహకరించి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు.
ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యూహరచన మొత్తం హైదరాబాద్‌లోని రహస్య ప్రదేశాల్లోనే జరిగిందని తెలుస్తోంది. చాలాసార్లు ఇక్కడ సమావేశాలు కూడా జరిగాయని, గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి సైతం బహిరంగంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు శ్రవణ్ రావు విచారణతో మరింత బలం పుంజుకుంటున్నాయి. ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి సన్నిహితులపై సిట్ దృష్టి సారించడంతో, హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కార్యకలాపాలు, తెలంగాణ కనెక్షన్ అతి త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఎలాంటి పెను ప్రకంపనలు సృష్టిస్తాయో, ఎవరు ఈ కేసులో చిక్కుకుంటారో చూడాలి.