Jagan: జగన్ ‘ఆపరేషన్ కాంగ్రెస్’ ..వారే టార్గెట్..
Jagan : జగన్ చేపట్టిన ఈ వ్యూహాత్మక మంత్రాంగం ఇప్పటికే ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టింది.

Jagan : ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల ఫలితాలతో కుంగిపోకుండా, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా(Bengaluru Operation) తన పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. చేదు ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకుంటూ, పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇది కేవలం తప్పులను సరిదిద్దుకోవడం కాదు, భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని తిరగరాసే వ్యూహంతో రెడీ అవుతున్నారు.
Jagan Operation Congress
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిని బలంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా, జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే ‘ఆపరేషన్ కాంగ్రెస్’కు రూపకల్పన చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించిన సీనియర్ నేతల(Senior Leaders)ను వైసీపీలోకి ఆహ్వానించడం ఈ వ్యూహంలో మెయిన్ టార్గెట్. అందులోనూ కూటమికి వ్యతిరేకంగా నిలిచే సీనియర్లకే తన పార్టీలో పెద్దపీట వేస్తానంటూ జగన్ క్లారిటీ ఇచ్చారు.
తన పార్టీలోని కీలక నేతలతో నిరంతరం మంతనాలు జరుపుతూ, వారి అభిప్రాయాలకు జగన్(Jagan) ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాజిక సమీకరణలను అత్యంత జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటూ, కొన్ని కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలతో వైసీపీ పెద్దలు టచ్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగళూరులో జగన్‌తో ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలు భేటీ కావడమే దీనికి నిదర్శనం. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఆ సమయంలో వారికి తగిన గుర్తింపు ఉంటుందని జగన్ స్వయంగా హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
జగన్ చేపట్టిన ఈ వ్యూహాత్మక మంత్రాంగం ఇప్పటికే ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తన వారసుడిని వైసీపీలో చేర్చడంతో పాటు, తాను కూడా పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఒక కీలక సీనియర్ నేతను సాకే శైలజానాథ్ ద్వారా జగన్ నేరుగా సంప్రదించి, పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన మరో ముగ్గురు కీలక నేతలు వైసీపీలోకి రావటం దాదాపు ఖాయమైంది. వీరంతా ఆగస్టు 15న పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, 2024 ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ కూడా తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనసేన వైపు చూసినా, అక్కడ సీటు దక్కే అవకాశం లేకపోవడంతో, ఆయన సొంత గూటికే తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సీమ నుంచి టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సుగవాసి బాల సుబ్రమణ్యం వైసీపీలో చేరారు. అనంతపురం జిల్లాకు చెందిన మరో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. 2024 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లు వైఎసీపీ ఓటమిపై గణనీయమైన ప్రభావం చూపించడంతో.. ఇప్పుడు ఆ ఓట్లను తిరిగి తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా జగన్ బెంగళూరు నుంచి తన ఆపరేషన్‌ను పదును పెడుతున్నారు. మొత్తంగా ఈ చేరికలు వైసీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే జగన్ ఆపరేషన్ కాంగ్రెస్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో.. భవిష్యత్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని జగన్ చేపట్టిన ఈ కీలక అడుగు, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి.