Just InternationalJust PoliticalLatest News

Gulf:గల్ఫ్ దేశాల సంచలన నిర్ణయంతో అమెరికాకు షాక్.. భారత్‌కు చమురు సెగ ఉంటుందా?

Gulf: అమెరికా ఏకపక్షంగా చేస్తున్న దాడుల వల్ల తమ దేశాల మౌలిక సదుపాయాలు, చమురు బావులు ధ్వంసమవుతున్నాయని.. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ (Gulf)దేశాలు అగ్రరాజ్యంపై తిరుగుబావుటా ఎగురవేశాయి.

Gulf

ప్రపంచం ఇప్పుడు మహా విస్ఫోటనం అంచున నిలబడింది. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధం పదో రోజుకు చేరుకుంది. అమెరికా కూడా ప్రత్యక్ష యుద్ధంలోకి దూకి 1,700కు పైగా లక్ష్యాలపై దాడులు చేయడంతో.. టెహ్రాన్ రక్తసిక్తమైపోయింది. ఈ దాడులలో ఖమేనీతో సహా కొంతమంది కీలక నేతలు చంపబడటంతో ఇరాన్ మహోగ్రరూపం దాల్చింది.

అయితే ఈ యుద్ధం ఇప్పుడు ఎవరూ అనుకోని విధంగా మలుపు తిరిగింది. అమెరికా ఏకపక్షంగా చేస్తున్న దాడుల వల్ల తమ దేశాల మౌలిక సదుపాయాలు, చమురు బావులు ధ్వంసమవుతున్నాయని.. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ (Gulf)దేశాలు అగ్రరాజ్యంపై తిరుగుబావుటా ఎగురవేశాయి. అమెరికాతో ఇప్పటి వరకూ చేసుకున్న భారీ పెట్టుబడి ఒప్పందాలను, క్రీడలు, టెక్నాలజీ కాంట్రాక్టులను కూడా క్యాన్సిల్ చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ‘ఫోర్స్ మేజ్యూర్’ ప్రకటించడం ప్రపంచ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది.

మరోవైపు ఈ యుద్ధ జ్వాలలు గల్ఫ్(Gulf) దేశాల నుంచి డైరక్టుగా భారతదేశంలో సామాన్యుడి వంటింటి వరకు చేరాయి. హార్ముజ్ జలసంధి గుండా చమురు ట్రాన్స్‌పోర్ట్ స్తంభించిపోవడంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో బారెల్ ధర 150 డాలర్లకు చేరిపోయింది.

భారత్ తన చమురు అవసరాల్లో 60 శాతానికి పైగా గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల రవాణా ఛార్జీలు పెరగడంతో .. నిత్యావసర వస్తువులు, పప్పులు, బియ్యం ధరలు కూడా 30 శాతం వరకు పెరుగుతాయి. డాలర్ ధర పెరిగినప్పుడల్లా భారత్ పై 12 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. కేవలం వస్తువుల ధరలే కాదు, గల్ఫ్ లో ఉన్న కోటి మంది భారతీయులు పంపే నిధులు (Remittances) 38 శాతం వరకూ పడిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Gulf
Gulf

మరోవైపు ఇరాన్ అమెరికా , ఇజ్రాయెల్‌పై పగతో రగిలిపోతూ దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లోని విమానాశ్రయాలు, డీశాలినేషన్ ప్లాంట్లపై దాడులు చేయడంతో గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. చమురు ఎగుమతులు 50 శాతం ఆగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా రవాణా వ్యవస్థ స్తంభించింది. కార్గో రేట్లు ఏకంగా మూడు రెట్లు పెరగడంతో ఎలక్ట్రానిక్స్ నుంచి మందుల వరకు అన్నీ ప్రియం కానున్నాయి.

ఇంత జరుగుతున్నా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్ బేషరతుగా లొంగిపోయే వరకు..తాము శాంతించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఇదే సమయంలో యూకే, స్పెయిన్ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలు కూడా కట్ చేసుకోవడం అగ్నికి ఆజ్యం పోస్తోంది.

ఇక ఇలాంటి పరిస్థితుల్లో కనుక మోదీ ప్రభుత్వం తన వ్యూహాత్మక చమురు నిల్వలను వాడటంతో పాటు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం.. సామాన్యుడి బతుకు భారమవ్వడం గ్యారంటీ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటు యుద్ధం పదో రోజుకు చేరినా శాంతి చర్చల జాడ లేకపోవడంతో గ్లోబల్ రీసెషన్ ముప్పును తెచ్చిపెట్టినట్లు అవుతోంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button