Tirumala : ఇక శ్రీవారి దర్శనానికి క్యూలైన్లు అవసరం లేదు..
Tirumala : శ్రీవాణి టికెట్లలో డిజిటల్ విప్లవం.. ఇకపై భక్తులకు వేచిచూసే అవసరం లేకుండానే దర్శనం.

Tirumala
తిరుమల దర్శనానికి ప్రత్యేకంగా ఇచ్చే శ్రీవాణి టికెట్ల పంపిణీలో తిరుపతి తిరుమల దేవస్థానం (TTD) ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేసింది. ఒక్కో రోజు వేల మంది భక్తులు క్యూ కడుతున్న శ్రీవాణి టికెట్ల(SreeVani Tickets) కోసం ఇకపై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. భక్తులకు ఇప్పుడు ‘డిజిటల్ కంకణాలు’ అనే సరికొత్త సౌకర్యాన్ని అందించేందుకు టీటీడీ రంగంలోకి దిగింది.
ప్రతిరోజూ తిరుమల(Tirumala)లో 800 శ్రీవాణి టికెట్లను ఆఫ్లైన్‌లో అందిస్తున్నారు. కానీ ఉదయం 6 గంటలకే క్యూ కడుతున్న భక్తులకు టికెట్ల పంపిణీ మాత్రం 10 గంటలకే ప్రారంభం కావడం వల్ల తీవ్ర అసౌకర్యాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను గమనించిన అదనపు కార్యనిర్వాహకాధికారి వెంకయ్య చౌదరి స్వయంగా పరిస్థితిని అధ్యయనం చేసి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై ఫస్ట్ కమ్ .. ఫస్ట్ సర్వ్ విధానంలో ఉదయం వచ్చిన మొదటి 800 మందికి టోకెన్ తరహాలో డిజిటల్ కంకణం( Digital Token) చేతికి కడతారు. ఇందులో భక్తుల వివరాలు, సీరియల్ నెంబర్ నమోదు చేసి భద్రపరిస్తారు. ఈ కంకణం పొందిన భక్తులు మరింత వేచి ఉండకుండానే తాము కట్టుకున్న సమయంలో దర్శనం కోసం వెళ్లవచ్చు. అంటే క్యూలో నిలబడి టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఇక లేదు.
మరింతగా చెప్పాలంటే… ఇప్పటివరకు శ్రీవాణి టికెట్లను తీసుకున్న తర్వాత మరుసటి రోజే దర్శనానికి అవకాశం కల్పించేవారు. కానీ ఈ విధానాన్ని టీటీడీ మారుస్తూ, టికెట్ తీసుకున్న అదే రోజున సాయంత్రం 4 గంటలకు దర్శనం చేసే అవకాశం కల్పిస్తోంది. అంటే ఒకే రోజు టికెట్ – దర్శనం అన్నట్లు అన్నమాట.
ఇప్పటికే హెచ్‌వీడీసీ ప్రాంతంలో శ్రీవాణి టికెట్ల కోసం ఆధునిక కౌంటర్లు ఏర్పాటయ్యాయి. అయినప్పటికీ రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరగడం వల్ల, ఉదయాన్నే క్యూ కడుతున్న వారు టికెట్ దొరకక తిరుగు ప్రయాణం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై అధికారులపై ఒత్తిడి పెరగడంతో, భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, 10 నిమిషాల్లో టికెట్ పూర్తి చేసేలా కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారు.
వచ్చే వారం రోజుల్లోనే ఈ డిజిటల్ కంకణాల వ్యవస్థను అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. వెంకయ్య చౌదరి నాయకత్వంలో ఉన్నతాధికారుల సమీక్ష జరుగుతోంది.
ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వేచి ఉండే కష్టాలు తప్పనున్నాయి. ఒకవైపు ఆధునిక సాంకేతికత.. మరోవైపు సేవాభావంతో తిరుమల టీటీడీ మార్గదర్శకంగా మారుతోంది.