Just Literature

Freebies:ఉచితాలో..? ఉచ్చు తాళ్లో..?

Freebies:చూపుడు వేలుకి పెట్టే సిరా గీతని చౌకగా అమ్మేసుకుంటున్నాం..

Freebies

ఉచితాలు ఏమంత ఉచితమేమీ కాదు..
ఉచితాలు తీసుకొని
హక్కులను మారకం చేస్తున్నాం..
పథకాలు వెనుక పరుగుతో
ప్రగతి బాట తప్పుతున్నాం
సామాజిక పతనమవుతున్నాం..

చెప్పే చదువు కాదు
చంటోడికొచ్చే పైసలే ముఖ్యమన్నాం..
చెత్త నెత్తిలోపలకి చొప్పించుకుంటూ
చైతన్యం లేకుండా చెదిరిపోతున్నాం ..

వెన్నును నిటారుగా‌‌ నిలబెట్టి
ఒక్క ప్రశ్నను సంధించలేకున్నాం..
బహుశా..రహదారుల గోతుల్లో
వెన్నుపూసలు విరిగాయేమో..?

చూపుడు వేలుకి పెట్టే సిరా గీతని
చౌకగా అమ్మేసుకుంటున్నాం..
ఇక సమస్యలనేం వేలెత్తి చూపగలం..
నాయకులు‌ మధ్య వేలు చూపెడుతున్న
ఐదు వేళ్లు బిగించి పైకెత్తలేకున్నాం..!

సామాజిక మాధ్యమాల మాయలో
ఉద్యమాల ఊసులు మరిచాం..
తలెత్తి ప్రశ్నించాల్సిన వేళ
తలవాల్చి చరవాణిల దాస్యం చేస్తున్నాం..!

బురద నీళ్లలో బంగారం
వెతుకుతున్నాం..
బహుమతుల మధ్య భవిష్యత్తు
కలలు‌ కంటున్నాం..

ఉచితాలో..? ఉచ్చు తాళ్లో..?
ఆలోచన మనకెందుకు?
ఇచ్చారు కదా.. పుచ్చేసుకుందాం..
ఆపై వచ్చేవాడు ఇచ్చునో?చచ్చునో?
ఎవరో కొందరు నొచ్చుకున్నా
అచ్చంగా ఇలాగే బతుకు సాగదీద్దాం..

 

–ఫణి మండల
8555988435

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button