Gold: ధనత్రయోదశి వేళ భారీగా బంగారం అమ్మకాలు.. లక్ష కోట్లు దాటేస్తుందా ?
Gold: ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ లక్షా 32 వేల నుంచి లక్షా 25 వేలకు పడిపోయింది. అలాగే వెండి ధర లక్షా 70 వేల నుంచి లక్షా 53 వేలకు పడిపోయింది.

Gold
బంగారం అంటే భారతీయులకు ఒక ఎమోషన్… పండగ వస్తుందన్నా.. శుభకార్యాలు ఉన్నా మహిళలు బంగారం కొనేందుకే మొగ్గుచూపుతుంటారు. గత కొంతకాలంగా బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా కొనుగోళ్ళు మాత్రం భారీగా అయితే పడిపోలేదు. సామాన్య ప్రజలైనా, ధనవంతులైనా తమ తమ స్థాయిలో గోల్డ్ కొంటూనే ఉన్నారు.
ఇప్పుడు దీపావళి పండగ ముంగిట వచ్చే ధనత్రయోదశికి కూడా బంగారం భారీగా అమ్ముడైంది, ధన్‌తేరాస్ వేళ బంగారం కొంటే శుభప్రదమని అందరికీ నమ్మకం. పైగా ఈ సారి ధన్‌తేరాస్ వేళ బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ప్రకారం దేశమొత్తం మీద బంగారం వ్యాపారం ఈసారి లక్ష కోట్లు దాటుతుందని చెబుతున్నారు. ధన్‌తేరాస్ పండగకు ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యానే ఇది సాధ్యమవుతోందని కాన్ఫెడరేషన్ తెలిపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత రెండురోజులుగా గోల్డ్ షాపులు కళకళలాడుతున్నాయి.

ధనత్రయోదశి వేళ పసిడి ధర భారీగా తగ్గడం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇవాళ ఒక్కరోజే రూ. 3180 తగ్గింది. ఓవరాల్ గా గత నెల నుంచి విపరీతంగా పెరిగిన గోల్డ్ రేటు ఇవాళ ఒక్కరోజే 3 శాతం తగ్గడం విశేషం. బంగారం ధర 8 వారాల తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. అలాగే వెండి ధర కూడా ఒక్కసారిగా 8 శాతం తగ్గింది.
ధనత్రయోదశి సెంటిమెంట్ తో గోల్డ్, సిల్వర్ ఆభరణాలకు సహజంగానే మంచి గిరాకీ ఉంటుంది. ఇప్పుడు రేట్లు కూడా తగ్గడంతో బాగానే కొనేస్తున్నారు. పైగా ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు గోల్డ్ షాపులు కూడా స్పెషల్ ఆఫర్స్ తో ఆకట్టుకుంటున్నాయి. ఈ కారణాలతో దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు భారీగా పెరిగాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ లక్షా 32 వేల నుంచి లక్షా 25 వేలకు పడిపోయింది. అలాగే వెండి ధర లక్షా 70 వేల నుంచి లక్షా 53 వేలకు పడిపోయింది.గోల్డ్ మార్కెట్లలో ఇవాళ ఊహించని రద్దీ కనిపించింది. కేవలం బంగారం, వెండి అమ్మకాల వ్యాపారం 60 వేల కోట్లను దాటినట్టు అంచనా. ఢిల్లీ మార్కెట్లలోనే 10వేల కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్టు చెబుతున్నారు, గత ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువగా ఉంది.
గతేడాది 10 గ్రాముల బంగారం ధర 80వేలు ఉండగా ప్రస్తుతం మరో 50 వేల పైగా పెరిగింది. అయినప్పటకీ అమ్మకాల్లో భారీగా వృద్ధి నమోదైనట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడి కావడమే దీనికి ప్రధాన కారణంగా వెల్లడిస్తున్నారు.