Laptop:భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్,ల్యాప్‌టాప్ ధరలు.. రీజనేంటో తెలుసా?
Laptop: ఎవరైనా గ్యాడ్జెట్లు కొనుగోలు చేయాలనుకుంటే, ధరలు ఇంకా పెరగకముందే వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది.
Laptop
కొత్త స్మార్ట్‌ఫోన్ , ల్యాప్‌టాప్(Laptop) కొనాలని భావిస్తున్న మధ్యతరగతి వినియోగదారులకు రాబోయే రోజుల్లో భారీ ఖర్చు తప్పేలా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు రెక్కలు రాబోతున్నాయి. దీనికి అతిపెద్ద కారణం గ్లోబల్ మార్కెట్లో మెమరీ చిప్‌లకు ఏర్పడిన విపరీతమైన కొరత. ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందడంతో, చిప్ తయారీ కంపెనీలన్నీ తమ దృష్టిని ఏఐ డేటా సెంటర్లకు అవసరమైన హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) చిప్‌ల వైపు మళ్లించాయి.
శాంసంగ్ , ఎస్‌కే హైనిక్స్ వంటి దిగ్గజ సంస్థలు లాభదాయకమైన ఏఐ చిప్‌ల ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తుండటంతో, సాధారణ స్మార్ట్‌ఫోన్లు, టీవీలు , ల్యాప్‌టాప్(Laptop)లలో వాడే డీ-ర్యామ్ (DRAM) , నాండ్ (NAND) ఫ్లాష్ మెమరీ చిప్‌ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉండటంతో ఈ చిప్‌ల ధరలు ఇప్పటికే 60 శాతం వరకు పెరిగాయి.
ఈ ప్రభావం నేరుగా తర్వాత వినియోగదారుల జేబులపైనే పడబోతోంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, గ్లోబల్ మెమరీ మార్కెట్ ఇప్పుడు అత్యంత వేగంగా ధరలు పెరిగే దశలోకి ప్రవేశించింది. గత త్రైమాసికంలోనే ధరలు 50 శాతం పెరగ్గా, ప్రస్తుత త్రైమాసికంలో అవి మరో 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాబోయే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో అదనంగా మరో 20 శాతం ధరల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రాబోయే రెండు మూడు నెలల్లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు , ల్యాప్‌టాప్‌ల ధరలు ప్రత్యక్షంగా 4 శాతం నుంచి 8 శాతం వరకు పెరగొచ్చు. ఇప్పటికే వివో , నథింగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ఫోన్ల ధరలను రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు పెంచేశాయి. శాంసంగ్ వంటి కంపెనీలు నేరుగా ధర పెంచకుండా, అప్పటివరకు ఇస్తున్న క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను తగ్గించడం ద్వారా పరోక్షంగా ధరల భారాన్ని వినియోగదారులపై వేస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితిని చూస్తుంటే.. రాబోయే రిపబ్లిక్ డే (జనవరి 26) సేల్స్ లో కూడా పెద్దగా డిస్కౌంట్లు ఆశించలేమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పండుగ సీజన్లలో భారీ ఆఫర్లు ఇచ్చే కంపెనీలు, ఇప్పుడు చిప్ కొరత వల్ల తమ మార్జిన్లను కాపాడుకోవడానికి డిస్కౌంట్లను భారీగానే కోత విధిస్తున్నట్లు కనిపిస్తోంది.

ల్యాప్‌టాప్ ధరలు ఇప్పటికే 5 నుంచి 8 శాతం పెరగ్గా, పెద్ద సైజు టెలివిజన్ల ధరలు కూడా త్వరలో పెరగనున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే స్మార్ట్‌ఫోన్ల ధరలలో 21 శాతం వరకు పెరుగుదల కనిపించిందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ తెలిపింది. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ పెరుగుదల 30 శాతానికి చేరుకోవచ్చని రిటైలర్ల నుంచి అందుతున్న సమాచారం బట్టి అర్థమవుతోంది.
అయితే ఈ చిప్ కొరత సమస్య వెంటనే తీరేలా కనిపించడం లేదు. ఏఐ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కొద్దీ, సాధారణ ఎలక్ట్రానిక్ వస్తువులకు అవసరమైన విడిభాగాల ధరలు పెరుగుతూనే ఉండటం కామన్. తయారీ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పని స్థితిలో ఉంటాయి.
కాబట్టి ఎవరైనా గ్యాడ్జెట్లు కొనుగోలు చేయాలనుకుంటే, ధరలు ఇంకా పెరగకముందే వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదంటే మరికొన్ని నెలల పాటు వేచి చూడటం లేదా పాత మోడల్స్ పై వచ్చే డీల్స్ కోసం వెతకడం తప్ప మరో మార్గం లేదు. ఈ ధరల పెరుగుదల కేవలం కొత్త ఉత్పత్తులకే కాకుండా, రిపేర్లు , విడిభాగాల మార్పిడిపై కూడా ఎఫెక్ట్ చూపించబోతోంది. మొత్తానికి ఏఐ విప్లవం ఒకవైపు సౌకర్యాలను తెస్తుంటే, మరోవైపు సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని మోపుతున్నట్లే కనిపిస్తోంది.
Tata Safari: టాటా సఫారీ పెట్రోల్ వెర్షన్‌లో లగ్జరీ ఫీచర్లు.. ఈ కారు ఎవరికి బెస్ట్?



