Crime: ప్రతీ 10 నిమిషాలకు ఓ మహిళపై నేరం..దేశమా తల దించుకో
Crime: ప్రతి 10 నిమిషాలకు ఓ మహిళపై నేరం... ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే.. అవును. ఇది భయానకమైన వాస్తవం. 2022లో జాతీయస్థాయిలో మహిళలపై నేరాల రేటు ప్రతి లక్ష మంది మహిళలకూ 66.4గా నమోదైంది.

Crime
నారీశక్తిని దేవతలుగా కొలిచే సంస్కృతి మనది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటారు.అంటే ఎక్కడ మహిళల్ని గౌరవిస్తారో అక్కడ దేవతలే నివాసముంటారని చెబుతారు పెద్దలు. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే 2022 NCRB గణాంకాలు దేశం ఎటు వెళ్తోందో చెప్పే అక్షర సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ప్రతి 10 నిమిషాలకు ఓ మహిళపై నేరం… ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే.. అవును. ఇది భయానకమైన వాస్తవం. 2022లో జాతీయస్థాయిలో మహిళలపై నేరాల రేటు ప్రతి లక్ష మంది మహిళలకూ 66.4గా నమోదైంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరింత భయంకరంగా మారింది. నేరాల స్థాయి చూస్తే, అక్కడ మహిళగా జీవించడమే సాహసంగా మారిందనిపిస్తోంది.

అత్యధిక నేరాలు నమోదైన రాష్ట్రాలు (ప్రతి లక్ష మంది మహిళలకు)
- ఢిల్లీ: 144.4
- హర్యానా: 118.7
- తెలంగాణ: 117
- రాజస్థాన్: 115.1
- ఆంధ్రప్రదేశ్: 96.2
ఇవి కేవలం సంఖ్యలు కావు. వీటి వెనుక చిన్నారులపై అఘాయిత్యాలు(Crime), గృహ హింస, వేధింపులు, అత్యాచారాలు, మానవ హక్కుల హరణలు. ఇలాంటి ఘటనలు (crime)ఎక్కువగా నమోదవుతుండటం, ఆ రాష్ట్రాల్లో భద్రత వ్యవస్థపై తీవ్రమైన సందేహాన్ని కలిగిస్తోంది.

కానీ ఒక మరొక కోణం ఏమిటంటే.. ఈ సంఖ్యలు పెరగడంతో.. అక్కడ ఫిర్యాదు చేసే ధైర్యం, పోలీసుల స్పందన, కేసుల నమోదు ప్రక్రియ బలంగా ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే నేరాలు కాదు, నిజాలు బయటపడుతున్నాయనేది మరోవైపు వాదన కూడా వినిపిస్తోంది.
తక్కువ నేరాల రేటు నమోదైన రాష్ట్రాలు:
- నాగాలాండ్: 4.6
- మణిపూర్: 15.6
ఇక్కడ నిజంగా నేరాలు తక్కువగా జరుగుతున్నాయా? లేక అక్కడ పోలీసులకు వెళ్లాలన్న భయం, మౌనం, వ్యవస్థపై నమ్మక లోపం మహిళలను వెనక్కి నెట్టి — నిజాలు బయటికి రావకుండా చేస్తున్నాయా అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.
అసలు ప్రశ్న ఏంటంటే ఎక్కువ నేరాల రేటు గల రాష్ట్రాలే ప్రమాదకరమా? లేక తక్కువ సంఖ్యల వెనక మౌన హింస దాగుందా? ఈ గణాంకాలు అన్నీ లెక్కలకే పరిమితం. లెక్కలకు రాని నేరాలు ఇంకెన్ని ఉన్నాయో. అలాగే మహిళలపై నేరాల అసలైన స్థితి తెలుసుకోవాలంటే, సంఖ్యల్ని కాదు, వాటి వెనకున్న వాస్తవాల్ని అర్థం చేసుకోవాలి.
పూర్తి గణాంకాలను ఇక్కడ చూడొచ్చు: https://dataful.in/datasets/21547/