Suicides: పెరుగుతున్న ఆత్మహత్యలు.. NCRB నివేదిక ఏం చెప్పింది?
Suicides: తెలంగాణలో సూసైడ్ రేట్ (ప్రతి లక్ష జనాభాకు) 27.7గా ఉంది. ఇది జాతీయ సగటు (12.3) కంటే చాలా ఎక్కువ. అత్యధిక సూసైడ్ రేటు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో ఐదవ స్థానంలో ఉంది.

Suicides
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధానంగా కుటుంబ సమస్యలే ముఖ్య కారణంగా నిలుస్తున్నాయి.
2023లో తెలంగాణలో నమోదైన మొత్తం ఆత్మహత్యలు(Suicides) 10,580 కాగా, 2022లో ఈ సంఖ్య 9,980గా ఉంది. అంటే, ఒక సంవత్సరంలో 6% వృద్ధి నమోదైంది. ఆత్మహత్యల సంఖ్యలో దేశంలో తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది, దేశవ్యాప్త కేసుల్లో 6.2% వాటా కలిగి ఉంది.
తెలంగాణలో సూసైడ్(Suicides) రేట్ (ప్రతి లక్ష జనాభాకు) 27.7గా ఉంది. ఇది జాతీయ సగటు (12.3) కంటే చాలా ఎక్కువ. అత్యధిక సూసైడ్ రేటు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో ఐదవ స్థానంలో ఉంది.
ప్రధాన కారణాలు (44.2% కుటుంబ సమస్యలే)..తెలంగాణలో ఆత్మహత్యలకు ముఖ్య కారణం కుటుంబ సమస్యలు, గొడవలు మరియు గృహ కలహాలు.
మొత్తం మరణాలలో 4,680 మంది (44.2%) మరణాలకు ఈ సమస్యలే ప్రధాన కారణమని నివేదిక తెలిపింది.జాతీయ సగటు (31.9%)తో పోలిస్తే, తెలంగాణలో కుటుంబ సమస్యల వల్ల మరణాలు ఎక్కువగా ఉండటం గమనార్హం.తరువాత ముఖ్య కారణం ఆరోగ్య సమస్యలు. 1,904 మంది (18%) మానసిక, శారీరక అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

మిగతా కారణాలలో మద్యపానం/డ్రగ్స్ (119), ఆస్తి గొడవలు (45), నిరుద్యోగం (10),పేదరికం (7) ఉన్నాయి. విద్యార్థులలో పరీక్షల ఫెయిల్ మరియు ఒత్తిడి వంటి మానసిక సమస్యలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న వారిలో పురుషులు అధికంగా (8,236 లేదా 77.8%) ఉన్నారు, మహిళలు (2,342 లేదా 22.1%) ట్రాన్స్‌జెండర్లు (2) ఉన్నారు.
వయస్సు పరంగా చూస్తే, 30–39 సంవత్సరాల వయసువారు ఎక్కువ మంది ఉన్నారు. యువత , విద్యార్థులలో ఆత్మహత్యల శాతం దేశ సగటుతో పోలిస్తే అధికంగా ఉంది.
ఆత్మహత్య(Suicides) చేసుకునే విధానాలలో విషం సేవించడం (5,192 కేసులు), ఉరి వేసుకోవడం (3,931 కేసులు) ప్రధానంగా ఉన్నాయి. 4 కేసులలో (11 మందికి సంబంధించి) సామూహిక/కుటుంబ ఆత్మహత్యలు (Mass/Family Suicide) నమోదయ్యాయి.
గత పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినా కూడా..విద్యార్థులు , ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఆత్మహత్యలు పెరిగాయి. NCRB సైకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం, దంపతుల గొడవలు, తల్లిదండ్రుల ఒత్తిడి, పిల్లలపై చదువు ఒత్తిడి, పెళ్లి సంబంధిత సమస్యలు, ఆర్థిక గొడవలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నట్లుగా, ప్రజలు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ , హెల్ప్‌లైన్‌లను ఉపయోగించుకోవాలి. Tele Manas (14416), One Life (78930 78930), Roshini Trust (8142020033) వంటి హెల్ప్‌లైన్స్ అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యులు తమవారిలో మౌనంగా ఉండటం, ఒంటరితనం, ఆహారం తీసుకోకపోవడం, సామాజికంగా వెనుకడుగు వేయడం వంటి ప్రవర్తనా మార్పులను గమనించాలి. పరీక్షల సీజన్, ఉద్యోగం, వ్యాపార నష్టాల సమయంలో మానసిక భరోసా ఇవ్వడం అత్యవసరం.
మొత్తంగా.. తెలంగాణలో పెరుగుతున్న ఆత్మహత్యల కేసులలో, దాదాపు సగం మరణాలకు కుటుంబ సమస్యలు ప్రధానంగా నిలుస్తున్నాయి. ఈ సూసైడ్ రేట్‌ను తగ్గించడానికి సమాజంలో మానసిక ఆరోగ్యంపై మరింత జాగ్రత్త, చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.