Just EntertainmentJust NationalLatest News

Durnadhar: నేతాజీ సైన్యంలో 16 ఏళ్ల గూఢచారిణి .. చరిత్ర విస్మరించిన రియల్ ధురంధర్

Durnadhar: నేతాజీ ఆదేశాలతో రాజమణి తన పొడవైన జుట్టును కత్తిరించుకుని, అబ్బాయిలా మారిపోయింది. పేరు కూడా 'మణి'గా మార్చుకుంది.

Durnadhar

బాలీవుడ్ మూవీ ధురంధర్ (Durnadhar)సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. వెయ్యి కోట్ల క్లబ్‌‌ను దాటి సరి కొత్త రికార్డుల కోసం పరుగులు పెడుతోంది. ఆ సినిమాలో హీరో రణ్‌వీర్ సింగ్ చేసే సాహసాలు, గూఢచర్యం చూసి థియేటర్లలో జనం ఈలలు వేస్తున్నారు.

కానీ, సరిగ్గా 80 ఏళ్ల క్రితం.. మన భారత దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన ఒక నిజమైన ధురంధర్ (Durnadhar)మనకూ ఉన్నారు. ఆమె పేరే సరస్వతి రాజమణి. సినిమా హీరోలు రంగుల ప్రపంచంలో సాహసాలు చేస్తే, ఈమె రక్తం పారుతున్న కాలిని పట్టుకుని, తుపాకి గుళ్ల మధ్య గూఢచర్యం నెరిపిన అసలైన వీరనారిగా చరిత్రలో నిలిచిపోయారు. ఒకప్పుడు బంగారు గనుల యజమాని కూతురై, రాజభోగాలు అనుభవించాల్సిన ఆ పదిహేనేళ్ల బాలిక.. దేశం కోసం తుపాకి పట్టి, గూఢచారిగా మారి మృత్యువుతో పోరాడారు.

అది 1942వ సంవత్సరం రంగూన్ (మయన్మార్)లో ఒక సంపన్న భారతీయ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో పుట్టిపెరిగిన రాజమణికి చిన్నప్పటి నుంచి కూడా విలాసవంతమైన జీవితమే తెలుసు. కానీ, రంగూన్ పర్యటనకు వచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తానన్న నేతాజీ పిలుపుతో ప్రభావితమైన రాజమణి, తన ఒంటిపై ఉన్న ఖరీదైన వజ్రాల ఆభరణాలు, బంగారు ఆభరణాలన్నింటినీ ఆజాద్ హింద్ ఫౌజ్ నిధికి విరాళంగా ఇచ్చేసింది.

ఆమె (Durnadhar)చిన్నపిల్ల అని భావించిన నేతాజీ ఆ నగలను తిరిగి రాజమణికి ఇవ్వడానికి స్వయంగా వారి ఇంటికి వచ్చారు. కానీ నేను ఒకసారి దేశానికి అర్పించిన దాన్ని తిరిగి తీసుకోనని ఆమె చెప్పిన సమాధానానికి నేతాజీ అశ్చర్యపోయారు. ఆమె కళ్లలో ఉన్న దృఢ నిశ్చయాన్ని చూసి, ఆమెకు ‘సరస్వతి’ అని పేరు పెట్టడమే కాకుండా, తన గూఢచారి బృందంలోకి ఆహ్వానించారు.

Durnadhar
Durnadhar

నేతాజీ ఆదేశాలతో రాజమణి తన పొడవైన జుట్టును కత్తిరించుకుని, అబ్బాయిలా మారిపోయింది. పేరు కూడా ‘మణి’గా మార్చుకుంది. తన స్నేహితురాలు దుర్గతో కలిసి బ్రిటిష్ సైనిక మెస్‌లో బూట్లు పాలిష్ చేసే కుర్రాళ్లుగా పనిలోకి చేరారు. అక్కడ పనిచేస్తూనే బ్రిటిష్ జనరళ్లు చర్చించుకునే కీలక యుద్ధ తంత్రాలను, మ్యాప్‌ల వివరాలను ఆ ఇద్దరూ రహస్యంగా సేకరించి నేతాజీకి చేరవేసేవారు.అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవన్న విషయం వారికి తెలిసే సంఘటన జరిగింది.

ఒకరోజు మణి స్నేహితురాలు దుర్గ బ్రిటిష్ వారికి దొరికిపోయింది. దీంతో తన స్నేహితురాలిని ప్రాణాలకు తెగించి అయినా రక్షించాలని నిర్ణయించుకున్న రాజమణి.. రాత్రిపూట బ్రిటిష్ కోటలోకి చొరబడి, కాపలాదారుల టీలో అఫీమ్ కలిపి వారిని స్పృహ తప్పేలా చేసింది. దుర్గను విడిపించి పారిపోతుండగా, బ్రిటిష్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఒక గుండు రాజమణి కాలిని చీల్చింది. అయినా ఆగకుండా రక్తం కారుతున్న కాలిని పట్టుకుని, మూడు రోజుల పాటు ఒక చెట్టుపై దాక్కుని, ఒకవైపు రక్తం, మరోవైపు బుల్లెట్ గాయంతో జ్వరం,ఇంకో పక్క ఆకలి, నీర్సం ఇలా వీటన్నిటిని ఓర్చుకుని ఆజాద్ హింద్ ఫౌజ్ శిబిరానికి చేరుకున్నారు.

రాజమణి సాహసాన్ని చూసి నేతాజీ గర్వపడ్డారు.నీవే మా మహిళా గూఢచారివి.. నీవే మా ఝాన్సీ రాణి అంటూ ఆమెను ప్రశంసించడమే కాకుండా జపాన్ చక్రవర్తి ఇచ్చిన తన ప్రియమైన పిస్టల్‌ను కూడా ఆమెకు బహుమతిగా ఇచ్చారు.

అయితే దురదృష్టం ఏంటంటే..దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, తన సర్వస్వాన్ని అర్పించిన రాజమణిని ప్రభుత్వం గుర్తించలేదు.దీంతో చెన్నైలోని ఒక చిన్న గదిలో అత్యంత పేదరికంలో రాజమణి జీవితం గడిచింది. 2004లో సునామీ వచ్చినప్పుడు, తన దగ్గర ఉన్న కొద్దిపాటి పెన్షన్ డబ్బును కూడా సహాయ నిధికి ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్న గ్రేట్ పర్సన్ రాజమణి.

2018లో 91 ఏళ్ల వయసులో ఈ అగ్నిధార వంటి వీరనారి కన్నుమూశారు. చరిత్ర ఆమెను మరచిపోయినా, రాజకీయనాయకులు గుర్తించకపోయినా.. నేటి స్వతంత్ర భారత పౌరులుగా మనం ఆమె(Durnadhar) త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. నీరా ఆర్యా, సరస్వతి రాజమణి వంటి వారి త్యాగాల పునాదుల మీదనే మన దేశ స్వాతంత్ర్యం నిలబడి ఉందన్న విషయాన్ని మన తర్వాత తరాలకు చెప్పాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button