Pakistan Cricket : పాక్ క్రికెట్ ఒక కామెడీ సీరియల్…ఏకిపారేస్తున్న ఆ దేశ మాజీలు
Pakistan Cricket : ప్రపంచ క్రికెట్ లో అనిశ్చితికి మారుపేరు ఏదైనా ఉందంటే అది కచ్చితంగా పాక్ జట్టే... ఎప్పుడెలా ఆడుతుందో తెలీదు
Pakistan Cricket
ప్రపంచ క్రికెట్ లో అనిశ్చితికి మారుపేరు ఏదైనా ఉందంటే అది కచ్చితంగా పాక్ జట్టే… ఎప్పుడెలా ఆడుతుందో తెలీదు… అప్పటి వరకూ పెద్ద పెద్ద జట్లపై అద్భుత విజయాలు సాధిస్తుంది… అహో ఒహో అనుకునే లోపే పసికూనల చేతిలో చావుదెబ్బలు తింటుంది. దీంతో అప్పటి వరకూ జట్టులో ఉన్న సీనియర్లను సెలక్టర్లు ఇంటికి సాగనంపేస్తారు.
సిఫార్సుల పేరుతో వచ్చే ఆటగాళ్లను ఎంపిక చేస్తుంటారు. ఇదంతా ఒక ఎపిసోడ్ గా ఉంటే.. నాణానికి మరోవైపు పాక్ క్రికెట్(Pakistan Cricket) బోర్డు చీఫ్ గా ఉండే వ్యక్తులు ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటారు. తమకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ నానా హంగామా చేస్తుంటారు. ఫలితంగా అందరి ముందు నవ్వుల పాలవుతుంటారు. ప్రస్తుతం పాక్ క్రికెట్(Pakistan Cricket) గురించి చెప్పాలంటే ఆ దేశ మాజీ ఆటగాళ్లు కామెడీ సీరియల్స్ తో పోలుస్తున్నారు.
పాక్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, షాహిద్ అఫ్రిది, డానిష్ కనేరియా వంటి వాళ్లు పాక్ బోర్డును ఇప్పుడు ఏకిపారేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఇటీవల పాక్ జట్టు బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో పరాజయం పాలవడమే.
టీ20 ప్రపంచకప్ సమయంలో బంగ్లాకు పాక్ ఎంతలా మద్దతు ఇచ్చిందో అందరికీ తెలుసు. బంగ్లా జట్టు కోసం ఒక దశలో తాము కూడా టోర్నీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది. అయితే ప్రస్తుతం ముగిసిన వన్డే సిరీస్ లో పాక్ అంటే ఏ మాత్రం గౌరవం కూడా ఇవ్వని బంగ్లా ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని సైతం పక్కనపెట్టిన ఘటన వైరల్ గా నిలిచింది.
అదే రెండో వన్డేలో ఆఘా రనౌట్ వివాదం. బంతి డెడ్ అయిందని భ్రమపడి క్రీజు వదిలడం, బంతిని తానే తీసి బౌలర్ కు ఇద్దామని ఆఘా అనుకుంటే.. అక్కడ జరిగింది వేరు. బంగ్లా కెప్టెన్ మిరాజ్ తెలివిగా వికెట్లు గిరాటేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ఇది రూల్స్ ప్రకారం కరెక్టే అయినా, పాక్(Pakistan Cricket) మాత్రం సీరియస్ గానే తీసుకుంది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా తామెంతో నమ్మిన బంగ్లా ఆటగాళ్లేనా ఇలా ప్రవర్తించింది అనుకునేలా చేసింది.

అలాగే మూడో వన్డేలో గెలిచే అవకాశం లేకపోయినా, డీఆర్ఎస్ విషయంలో పీసీబీ చేసిన అధికారిక ఫిర్యాదు వారి తీవ్ర అసహనానికి నిదర్శనం. 15 సెకన్ల లోపు డీఆర్ఎస్ కు వెళ్లాలని నిబంధన ఉండగా.. బంగ్లా రీప్లే చూసి అప్పీల్ చేసిందనేది పాక్ బోర్డు ఆరోపణ. నిజానికి ఆ బంతి డీఆర్ఎస్ కు వెళ్లినా వెళ్లకున్నా పాక్ గెలిచే పరిస్థితి లేదు. అయినా కూడా బంగ్లాపై అక్కసుతో పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అయితే మా వాళ్లు ట్రోఫీలు గెలిచేది లేదు.. ఇక దొంగిలించుకురావడమే అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. గత ఏడాది ఆసియాకప్ భారత్ గెలిచినా ట్రోఫీ ఇవ్వకుండా తీసుకుని వెళ్లిపోయిన పీసీబీ చీఫ్ నఖ్వీని ఉద్దేశించే అక్మల్ ఈ కామెంట్స్ చేశాడు. ఒకవైపు జింబాబ్వే, అమెరికా వంటి పసికూనలు పెద్ద పెద్ద జట్లపై అద్భుత ప్రదర్శనలు కనబరుస్తుంటే పాక్ జట్టు మాత్రం తన ఉనికిని కూడా కాపాడుకోలేని దీనస్థితికి దిగజారిపోయింది.





