Chiranjeevi: చిరు వర్సెస్ బాలయ్య ..టాలీవుడ్లో రచ్చ రచ్చ
Chiranjeevi:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ అగ్రనటులే.. ఎప్పటినుంచో సినిమాల పరంగా వీరిద్దరి మధ్య గట్టిపోటీ నడుస్తూనే ఉంటుంది. ఆఫ్ ది రికార్డ్ వీరిద్దరూ స్నేహంగానే ఉంటామని చెప్పుకున్నా అంత బాండింగ్ మాత్రం ఏం కనబడదు. పైగా చాలాసార్లు బాలకృష్ణ చిరంజీవిపై నోరుజారిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Chiranjeevi
తాజాగా బాలకృష్ణ చిరంజీవి(Chiranjeevi)ని ఉద్దేశిస్తూ ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాలయ్య మామూలుగానే ఎవ్వరికీ మర్యాద ఇవ్వరు.. అలాంటిది అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిని గౌరవం లేకుండా సంబోధించడం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు టాలీవుడ్ లోనూ సంచలనంగా మారింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చకు కారణమయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో టాలీవుడ్ ప్రముఖులను కలిసేందుకు జగన్ ఆసక్తి చూపలేదని, చిరంజీవి గట్టిగా అడగడంతోనే జగన్ దిగొచ్చారంటూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
అయితే కామినేని వ్యాఖ్యలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుబట్టారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ సమావేశానికి అంగీకరించారన్నది పచ్చి అబద్ధమన్నారు. ఆరోజు “ఎవ్వడూ” గట్టిగా అడగలేదంటూ బాలయ్య ఫైరయ్యారు. అప్పటి లిస్టులో తన పేరును తొమ్మిదో ప్లేస్ లో వేయడంపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ లిస్ట్ వేసింది ఎవడాడు అంటూ తాను అడిగిన విషయాన్ని గుర్తు చేసారు.
ఆ సైకోని కలిసేందుకు ఇండస్ట్రీ వాళ్లు వెళ్లిన సమయంలో చిరంజీవి(Chiranjeevi)కి అవమానం జరిగిందన్నది నిజమేనని గుర్తు చేశారు. తనకు కూడా ఆహ్వానం వచ్చినా కూడా వెళ్ళలేదని బాలయ్య చెప్పారు. బాలయ్య చిరంజీవి(Chiranjeevi)ని అలా వ్యంగ్యంగా మాట్లాడడం ఆయన అభిమానులకు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదే సమయంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించడం ఇప్పుడు ఈ వార్తలకు మరింత హీటు పుట్టినట్లు అయింది.

ఏకంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ బాలయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు చిరంజీవి.అప్పటి సీఎం వైఎస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని చెప్పారు. జగన్ ఆహ్వానం మేరకే తాను వెళ్లానని చెప్పిన చిరు..ఆ సమావేశంలో సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ కు వివరించానని చెప్పుకొచ్చారు. ఆ టైమ్ లో కొవిడ్ పరిస్థితుల కారణంగా ఐదుగురే రావాలని జగన్ చెప్పారని, కానీ తాము 10 మందిమి వస్తామని చెప్పగానే అంగీకరించారని గుర్తు చేశారు. అప్పుడు తాను బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదని క్లారిటీ ఇచ్చారు. తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టే తాను వివరణ ఇస్తున్నానని చిరంజీవి తెలిపారు.
నిర్మాత జెమిని కిరణ్ ను వెళ్లి బాలకృష్ణను కలవమని చెబితే… ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదన్నారు. తానే ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి కొంతమందిని తీసుకువెళ్లి సీఎంను కలిసినట్టు వివరించారు. ఆ సమయంలో తాను తీసుకోవడంతోనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించిందని తెలిపారు. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సీఎంతోనైనా, సామాన్యుడితోనైనా తాను గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాననీ చిరంజీవి స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఇండియాలో లేకపోవడంతో పత్రికా ప్రకటన ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నట్టు చిరు క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపై ముందు ముందు ఎలాంటి రగడ రాజుకుంటుందో చూడాలి.
One Comment