Controversy: ఇండస్ట్రీలో ముదురుతున్న సెగలు.. బట్టల వివాదం ఎక్కడికి దారితీస్తోంది?
Controversy: ఒక వర్గం శివాజీ తన అభిప్రాయాన్ని చెప్పారని మద్దతు ఇస్తుంటే, ఒక వర్గం మాత్రం మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు.
Controversy
సినీ ఇండస్ట్రీలో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. హీరోయిన్లు వేసుకునే దుస్తుల గురించి ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అనసూయ స్పందిస్తూ, బట్టలు ఎలా వేసుకోవాలో చెప్పడం చేతగానితనం అని, ఎదుటివారి మీద కంట్రోల్ లేనివారే ఇలాంటి మాటలు మాట్లాడతారని ఘాటుగా విమర్శించారు.
అయితే దీనిపై శివాజీ మళ్లీ స్పందిస్తూ, అనసూయకు తనకు మధ్య ఉన్న పాత విషయాలను గుర్తు చేస్తూ ఆమె రుణం తీర్చుకుంటానంటూ ఒక రకమైన హెచ్చరిక జారీ చేయడం ఈ వివాదాన్ని(Controversy) మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆయన ప్రెస్ మీట్‌లో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారని, అతి వినయం ప్రదర్శించే వారు చాలా డేంజర్ అని అనసూయ ఇన్ స్టా లైవ్ లో ఎండగట్టారు. ముఖ్యంగా శివాజీ తనను ‘అమ్మ, తల్లి’ అని సంబోధించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇలాంటి పదాలు వాడేవారే అసలైన నిజస్వరూపాన్ని దాచిపెడతారని కుండబద్ధలు కొట్టారు.
View this post on Instagram
మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి పురుషులకు ఎవరు అధికారం ఇచ్చారని అనసూయ ప్రశ్నించారు. బట్టలు అనేవి కేవలం ఒక మనిషి వ్యక్తిగత ఇష్టమని, దానికంటే క్యారెక్టర్ ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు.
ఒకవేళ బట్టల వల్ల సమస్య వస్తుందని భావిస్తే, అది చూసే మగవారి దృష్టిలో లోపం ఉందని, అడవి జంతువుల్లా ప్రవర్తించే మగవారికి బుద్ధి చెప్పాలి కానీ, హీరోయిన్ల మీద పడటం సరికాదని ఆమె అన్న మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తాను కూడా ఒక హీరోయిన్ గా గ్లామరస్ పాత్రలు చేశానని, తన ఒపీనియన్ చెప్పే హక్కు తనకు ఉందని ఆమె చాలా వినమ్రంగానే అయినా, అంతే గట్టిగా వాదించారు. ఫేక్ ఫెమినిజం అంటూ విమర్శించే వారికి కూడా ఆమె గట్టి సమాధానమే ఇచ్చారు.

ప్రస్తుతం ఈ గొడవ కేవలం మాటలతో ఆగేలా కనిపించడం లేదు. శివాజీపై అనసూయ లీగల్ గా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన లాయర్ నోటీసులు అందుకోవడానికి రెడీగా ఉండాలని ఆమె లైవ్ లో చెప్పడం చూస్తుంటే, ఈ వివాదం (Controversy)కోర్టు మెట్లు ఎక్కేలా కనిపిస్తోంది. ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) లో కూడా దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.
అంతేకాదు ఇండస్ట్రీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం శివాజీ తన అభిప్రాయాన్ని చెప్పారని మద్దతు ఇస్తుంటే, ఒక వర్గం మాత్రం మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా, ఇది ఇక్కడితో సర్దుమణుగుతుందా లేక శివాజీకి అనసూయ గట్టి గుణపాఠం చెబుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.



