Ravi: ఐబొమ్మ రవి ఎపిసోడ్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? చట్టం VS సామాన్యుడి సెంటిమెంట్ ఏది గెలుస్తుంది?
Ravi:పైరసీ కారణంగా టికెట్ కౌంటర్ల వద్ద కలెక్షన్లు తగ్గిపోతాయి, ఇది అటు సినిమా యూనిట్‌కు, ఇటు పంపిణీదారులకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది.
Ravi
కొద్ది రోజులుగా తెలుగు సినీ ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పేరు ఇమ్మడి రవి అలియాస్ ‘ఐబొమ్మ రవి’(Ibomma Ravi). చట్టం దృష్టిలో అతడు చేసిన పని పైరసీ కిందకు వస్తుంది, ఇది పూర్తిగా నేరం అన్న సంగతి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో, ముఖ్యంగా సగటు సినీ అభిమానుల దృష్టిలో మాత్రం అతను వందల కోట్లు ఖర్చు చేసే సినీ పరిశ్రమకు సవాల్ విసిరిన ఓ ‘రాబిన్ హుడ్’.
పోలీసులు రవి(Ravi)ని అరెస్ట్ చేస్తే, నెటిజన్లు అతనికి మద్దతుగా లక్షలాది పోస్టులు పెట్టడం, ‘రవి మా హీరో’ అంటూ మీమ్స్ సృష్టించడం, వీడియోలు వైరల్ చేయడం ఈ ఎపిసోడ్‌లోని చిక్కుముడిని స్పష్టంగా తెలియజేస్తోంది.అంతేకాదు ఇదెంత స్ట్రాంగ్ విషయమో అన్నది సెంటిమెంట్‌ను యాడ్ చేస్తూ క్లారిటీగా చెబుతుంది. మరి, ఈ మొత్తం కథలో లెక్క ఎక్కడ తప్పుతోంది? ఈ సంఘర్షణ వెనుక ఉన్న సామాజిక ఆర్థిక కారణాలు ఏమిటి?
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, కొన్ని వందల కోట్లతో కూడిన భారీ వ్యాపారం. ఒక సినిమా సెట్స్‌పైకి వెళ్లిన క్షణం నుంచి విడుదలయ్యే వరకు వేలాది మంది జీవితాలు, కోట్ల రూపాయల పెట్టుబడులు దానిపై ఆధారపడి ఉంటాయి. దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, కార్మికులు ఇలా వీరందరి శ్రమ, కలలు ఆ సినిమాతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి సినిమా విడుదలై, కొన్ని గంటల్లోనే పైరసీ రూపంలో డిజిటల్ వేదికల్లోకి చేరిపోతే, అది నిర్మాతలకు నిజంగా ‘మరణశాసనం’ లాంటిదే.
పైరసీ కారణంగా టికెట్ కౌంటర్ల వద్ద కలెక్షన్లు తగ్గిపోతాయి, ఇది అటు సినిమా యూనిట్‌కు, ఇటు పంపిణీదారులకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. చట్టం ప్రకారం, పైరసీ కాపీరైట్ చట్టం కింద శిక్షార్హమైన నేరం. అందుకే సినీ పరిశ్రమ మొత్తం రవి అరెస్ట్‌ను స్వాగతించింది, ఇలాంటి చర్యల వల్లనే క్రియేటివిటీని, పెట్టుబడులను కాపాడుకోగలమని వాదించింది.
మరోవైపు, ఇమ్మడి రవికి సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభించడానికి బలమైన సామాజిక కారణాలు ఉన్నాయి. అవి కేవలం ఉచితంగా సినిమా చూడాలనే సగటు ప్రేక్షకుడి ఆశ మాత్రమే కాదు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక మల్టీప్లెక్స్‌లో కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే టికెట్ ధరలు రూ. 300 నుంచి రూ. 500 వరకు ఉంటున్నాయి. నలుగురున్న కుటుంబం ఒక సినిమాకు వెళ్లాలంటే పార్కింగ్, స్నాక్స్‌తో కలిపి రూ. 3000 నుంచి రూ.4000 వరకూ ఖర్చవుతోంది.
ఈ ధరలు సగటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇందుకే చాలామంది తమ ఇష్టాన్ని మొగ్గలోనే చంపేసుకుంటున్నారు. మరికొంతమంది తమ పిల్లల కోరికను కూడా తీర్చలేకపోతున్నామని మదన పడుతున్నారు. అందుకే ఇలాంటి వారందరికీ రవి ఒక దేవుడుగా మారాడు.
అంతేకాదు రిమోట్ ప్రాంతాలలో, చిన్న పట్టణాలలో నివసించే వారికి పెద్ద సినిమాలను వెంటనే చూడడానికి థియేటర్లు అందుబాటులో ఉండకపోవచ్చు.

థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత గానీ, కొన్నిసార్లు ఇంకా ఆలస్యంగా గానీ సినిమా OTTలోకి రాదు. ఈ గ్యాప్‌లో ఆసక్తిని తట్టుకోలేని సినీ అభిమానులు పైరసీ వైపు మొగ్గు చూపుతున్నారు.
రవి(Ravi), ఈ అతిపెద్ద ఖర్చుల భారాన్ని తగ్గించి, సినిమాను తక్కువ సమయంలో, ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం వల్లే సామాన్యుడు అతన్ని ‘రాబిన్ హుడ్’గా చూస్తున్నాడు. చట్టం ఏం చెప్పినా, తమ జేబుకు అనుకూలంగా ఉండేవాడే హీరో అన్నది వారి ప్రాథమిక భావన.
ఈ మొత్తం ఎపిసోడ్లో చిక్కుముడి ఎక్కడ పడిందంటే, అది చట్టానికీ, సామాజిక న్యాయ భావనకూ మధ్య ఉన్న అగాధం. రవి నిస్సందేహంగా చట్ట ప్రకారం నేరస్తుడే. కానీ, అతడికి మద్దతు పెరుగుతోంది అంటే, అది సినీ పరిశ్రమ తన ప్రేక్షకులను ఎంత దూరం చేసుకుందో చెప్పడానికి నిదర్శనం.
ఈ మొత్తం సినిమాలో ఎవరు హీరో, ఎవరు విలన్? అని అంటే.. అధిక ధరలు, కృత్రిమ డిమాండ్‌తో ప్రేక్షకులను దోపిడీ చేయాలని చూసే వ్యవస్థ .. నిజమైన విలన్. పైరసీ అనేది ఈ వ్యవస్థలో ఉన్న లోపానికి, అధిక ధరల పట్ల సామాన్యుడి కోపానికి ఒక లక్షణం (Symptom) మాత్రమే, కానీ మూల కారణం (Cause) కాదు.
ఇమ్మడి రవి(Immadi Ravi).. అతను వేరే వాళ్ల సొత్తును అపహరించాడు, ఇది నేరం. కానీ ప్రస్తుతానికి, ఆ బాధిత ప్రేక్షకులే. వారు తమ నిరసనను, అసహనాన్ని రవికి మద్దతుగా తెలియజేస్తున్నారు.దీంతో రవి ఒక సామాజిక హీరోగా మారాడు.
చట్టాన్ని అతిక్రమించడం ఎప్పుడూ సరైంది కాదు. కానీ, ఈ సంఘటన సినీ పరిశ్రమకు కనువిప్పు కావాలి. కేవలం పైరసీని అరికట్టడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉండేలా నియంత్రించడం, OTT రిలీజ్‌ను వేగవంతం చేయడం, దీని ద్వారా చట్టబద్ధమైన పద్ధతిలోనే ప్రేక్షకుడికి వినోదాన్ని అందించడం ద్వారా మాత్రమే ఈ ‘పైరసీ రాబిన్ హుడ్’ కథలకు ముగింపు పలకొచ్చు.
అయితే రవి(Ravi) అరెస్ట్ అనేది ఒక ఎపిసోడ్ ముగింపు కావచ్చు, కానీ సామాన్యుడి ‘సరసమైన వినోదం’ ఆకాంక్ష అనేది ఇంకా కొనసాగుతున్న అంతులేని.. అంతం కాని కథ అన్నది అక్షర సత్యం.



