Robbery: ధూమ్-2 చూపించారుగా… పారిస్ మ్యూజియంలో భారీ దోపిడీ
Robbery: బాలీవుడ్ మూవీ ధూమ్-2 తరహాలో భారీ దోపిడీ జరిగింది. ప్రముఖ లౌవ్రే మ్యూజియంలో ఘరానా దొంగలు విలువైన ఆభరణాలను దోచుకుపోయారు.

Robbery
పారిస్ నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలీవుడ్ మూవీ ధూమ్-2 తరహాలో భారీ దోపిడీ(Robbery) జరిగింది. ప్రముఖ లౌవ్రే మ్యూజియంలో ఘరానా దొంగలు విలువైన ఆభరణాలను దోచుకుపోయారు. ఈ మ్యూజియంలో మోసాలిసా వంటి ప్రపంచ ప్రసిద్ధి కళాఖండాలు,ఇంకా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. ఎప్పటి నుంచి ప్లాన్ చేసారో తెలీదు కానీ తాజాగా దొంగలు పెద్ద చోరీకే పాల్పడ్డారు. హైడ్రాలిక్ నిచ్చెన సాయంతో మ్యూజియంలోకి వచ్చినట్టు గుర్తించారు . కేవలం 7-8 నిమిషాల్లోనే దొంగతనం ముగించుకుని విలువైన ఆభరణాలతో పారిపోయారు.
పారిస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద చోరీ(Robbery)గా చెబుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ దోపిడీ జరిగింది. ప్రస్తుతం మ్యూజియం వెనుక భాగంలో నిర్మాణం జరుగుతుండడం దొంగలకు అవకాశం దొరికినట్టు అర్థమవుతోంది. సెయిన్ నది వైపున నిర్మాణంలో ఉన్న ప్రదేశం నుంచి హైడ్రాలిక్ నిచ్చేన సాయంతో లోపలకి చొరబడ్డారు. ఫ్రెంచ్ రాజ కుటుంబానికి చెందిన ఆభరణాలను ఎత్తుకెళ్లారని గుర్తించారు. దీని బట్టి ముందే రెక్కీ చేసినట్టు అర్థమవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఎత్తుకెళ్ళిన ఆభరణాల విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా.

డిస్క్ కట్టర్ సాయంతో కిటికీ ఊచలను కత్తిరించి చోరీ(Robbery)కి పాల్పడినట్టు గుర్తించారు. ఈ ఘటనపై మ్యూజియం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అత్యవసర కారణాలతో మ్యూజియం మూసివేసినట్టు తెలిపింది. దీంతో వీకేండ్ కావడంతో మ్యూజియం సందర్శనకు వచ్చినవారంతా నిర్వాహకుల ప్రకటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు చోరీ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సందర్శకులు వచ్చే మ్యూజియంగా దీనికి పేరుంది ప్రతీరోజూ 30 వేల మందికి పైగా మ్యూజియం సందర్శనకు వస్తుంటారు.

గతంలోనూ ఇక్కడ పలుసార్లు దోపిడీ యత్నాలు జరిగాయి. 1911 నాటి మోనా లీసా పెయింటింగ్ కూడా చోరీకి గురైంది. మ్యూజియంలో పనిచేసిన మాజీ వర్కర్ దానిని దొంగిలించగా.. తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1983లోరెండు విలువైన ఆర్మర్‌లు కూడా కనిపించకుండా పోయాయి. దశాబ్దాల పాటువెతికినా దొరకలేదు. చివరికి 2021లో మళ్ళీ పోలీసులు స్వాధీనం చేసుకుని మ్యూజియంకు తరలించారు. ఇప్పుడు మళ్ళీ భారీ చోరీ జరగడంతో మ్యూజియం భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా దోపిడీలో మ్యూజియం మాజీ సిబ్బంది పాత్ర ఏదైనా ఉందేమోనన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.