Bill Gates : అప్పుడు కోట్లు కుమ్మరించారు..ఇప్పుడు అమ్మేస్తున్నారు ..బిల్ గేట్స్ నిర్ణయం వెనుక ?
Bill Gates : ఈ నౌకను నాలుగేళ్ల క్రితం 4600 కోట్లకు ముచ్చటపడి మరీ కొనుక్కున్నారు బిల్ గేట్స్.

Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరులలో ఒకరైన బిల్‌గేట్స్ (Bill Gates)తన అద్భుతమైన, అత్యాధునిక లగ్జరీ షిప్‌ను సేల్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విలాసవంతమైన జల విహార నౌక యూరప్‌లోని మొనాకోలో సెప్టెంబర్ 24-27 తేదీలలో జరగనున్న ప్రతిష్టాత్మక మొనాకో యాట్ షోలో వేలానికి రానుంది. దీని ధర అక్షరాలా 645 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ. 5,629 కోట్లు అని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
Bill Gates
‘ఆక్వా’ అనే బిల్ గేట్స్ ముద్దుగా పిలుచుకునే ఈ లగ్జరీ నౌక(Luxury Yacht), కేవలం ఒక నౌక మాత్రమే కాదు, అది సముద్రంపై తేలియాడే ఒక రాజభవనం అని చెప్పొచ్చు. 390 అడుగుల పొడవైన ఈ అద్భుత సృష్టిని రూపొందించడానికి నెదర్లాండ్స్‌కు చెందిన ప్రఖ్యాత ఫెడ్‌షిప్ సంస్థ ఏకంగా ఐదేళ్లు శ్రమించింది. 370 అడుగుల పొడవైన ఈ లగ్జరీ నౌక, పూర్తిగా లిక్విడ్ హైడ్రోజన్‌తో నడుస్తుంది. రెండు ట్యాంకుల్లో 28 టన్నుల ఇంధనం నిల్వ చేయగల సామర్థ్యంతో, ఇది గంటకు 17 నాటికల్ మైళ్ల వేగంతో ఏకబిగిన 3,750 మైళ్లు ప్రయాణిస్తుంది.
అంతేకాదు ఈ నౌకలో ఉన్న సౌకర్యాలు విలాసానికి కేరాఫ్ అన్నట్లుగా ఉంటాయట. ఏడు డెక్‌లు, పూర్తిస్థాయి బాస్కెట్‌బాల్ కోర్టు, అత్యాధునిక సినిమా థియేటర్, పలు హాట్ టబ్‌లు, అత్యవసర సమయాల కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రి, నాలుగు అంతస్థుల భవనాన్ని తలపించేలా క్యాబిన్లు, పలు కార్యాలయాలు, లగ్జరీ స్లైడింగ్ బాల్కనీలు, అనేక అతిథి క్యాబిన్లు, విశాలమైన లైబ్రరీలు, సువిశాలమైన టెర్రస్‌లు దీని సొంతమట. అత్యంత ఖరీదైన, ఆధునిక వసతులతో ఇది సముద్రంపై ఒక అద్భుత లోకాన్ని సృష్టిస్తుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంతటి విలాసవంతమైన, భారీ పెట్టుబడితో రూపొందించిన ఈ నౌకను నాలుగేళ్ల క్రితం 4600 కోట్లకు ముచ్చటపడి మరీ కొనుక్కున్నారు బిల్ గేట్స్. అయితే ఇప్పటి వరకూ దీనిలోకి ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదని ఆయన సన్నిహిత వర్గాలు, అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి, ప్రపంచంలోనే అత్యంత ఆధునిక, పర్యావరణ హిత నౌకను సొంతం చేసుకున్న గేట్స్, దానిని ఎందుకు అమ్మకానికి పెట్టారన్నదే చర్చ నీయాంశం అయింది.
బిల్‌గేట్స్ సన్నిహితుల సమాచారం ప్రకారం, ఈ నౌక కేవలం ఒక ప్రాజెక్ట్‌గా, లేదా ఒక ఆవిష్కరణ పట్ల ఆయనకున్న ఆసక్తితో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన బిజీ షెడ్యూల్, పర్యావరణ కార్యక్రమాలు, ఇతర వ్యాపార, సామాజిక కార్యకలాపాల కారణంగా ఆయనకు ఈ నౌకను ఆస్వాదించడానికి తీరిక దొరకలేదని అంచనా. అంతేకాకుండా, బిల్‌గేట్స్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా మెలిండాతో విడాకుల తర్వాత తన ఆస్తుల నిర్వహణలో కొన్ని మార్పులు చేసుకుంటున్నారని, దీనిలో భాగంగానే ఈ లగ్జరీ ఆస్తిని విక్రయిస్తున్నారని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విక్రయానికి గల అసలు కారణాన్ని గేట్స్ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.
ఫోర్బ్స్ 2025 ప్రపంచ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, బిల్‌గేట్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల్లో 13వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర సంపద విలువ సుమారు 102.2 బిలియన్ డాలర్లు. మరోవైపు ఈ నౌకను వేలంలో దక్కించుకోవడానికి ఇప్పటికే ఒక ఆసక్తికరమైన కొనుగోలుదారు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రీన్ ఫర్ లైఫ్ ఎన్విరాన్‌మెంటల్ సంస్థ సీఈఓ, కెనడియన్ మిలియనీర్ పాట్రిక్ డోవిగి దీనిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
.