Pakistan: పాక్ ఎయిర్ లైన్స్ ఫర్ సేల్.. చేజిక్కించుకునే యత్నంలో మునీర్
Pakistan: పీఐఏ విక్రయ నిర్ణయం గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నంగా మారబోతోంది.
Pakistan
గత కొంతకాలంగా పాకిస్తాన్ (Pakistan)తీవ్ర ఆర్థికసంక్షోభంతో సతమతమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల రుణాలు తీసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి 7 బిలియన్ల డాలర్లు అంటే 63 వేల 220 కోట్ల ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు తన జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ (Pakistan)ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అమ్మేసేందుకు డిసైడయింది. ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది.
పీఐఏ విక్రయ నిర్ణయం గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నంగా మారబోతోంది. దశాబ్దాలుగా అవినీతి, నిర్వహణ లోపాలు.. పైలట్ లైసెన్స్ కుంభకోణంతో చతికిలపడిన పీఐఏను కొనుగోలు చేసేందుకు నలుగురు రేసులో నిలిచారు. అయితే ఈ విక్రయానికి సంబంధించిన డీల్ లో పలు షరతులు ఉన్నాయి.
ఈ షరతుల్లో ముఖ్యమైనది ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పీఐఏలోలో 51-100 శాతం వాటాను విక్రయించడం. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా 8600 కోట్లు ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విక్రయంద్వారా వచ్చే ఆదాయంలో 15శాతం పాకిస్తాన్ (Pakistan)ప్రభుత్వానికి వెళుతుంది. మిగిలింది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు.

అయితే ఈ బిడ్డింగ్ రేసులో పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కూడా ఉన్నాడు. బిడ్డింగ్ వేసేందుకు రేసులో నిలిచిన నాలుగు సంస్థల్లో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది. ఇది పాకిస్తాన్‌లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. మునీర్‌కు ఈ సంస్థతో మంచి సంబంధాలున్నాయి. దీంతో ఈ డీల్ అంతా మునీర్ కోసమే మొదలైందన్నది చాలా మంది భావిస్తున్నారు.
ఆసిమ్ మునీర్ తీరుపై స్వదేశంలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని పక్కన పెట్టి నియంతగా పాకిస్తాన్‌ను పాలించే ప్లాన్‌లో చేస్తున్నాడని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే పీఐఏ విక్రయానికి సర్కార్ నిర్ణయం తీసుకోవడం చాలా అనుమానాలకు దారితీసింది, మరోవైపు పాకిస్తాన్ (Pakistan)ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పతనమైపోవడానికి అవినీతే ప్రధాన కారణం.
గత కొన్నేళ్ళుగా అందులో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు. ముఖ్యంగా 2020లో పైలెట్ లైసెన్స్ కుంభకోణంతో పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. దాదాపు 30 శాతానికి పైగా పాక్ పైలట్లు నకిలీ లైసెన్సులతో జాబ్ సాధించారని తేలింది. దీంతో సంస్థ 262 మందిని తొలగించవలసి వచ్చింది. ఇటీవల కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతుండడంతో ఇతర దేశాలు పాక్ ఎయిర్ లైన్స్ విమానాలను బ్యాన్ చేశాయి. ఈ నేపథ్యంలో పీఐఏ మనుగడ కొనసాగించడం దాదాపు కష్టంగానే కనిపిస్తోంది. చేతులు మారితే తప్ప అందులో ప్రక్షాళణకు తొలి అడుగు పడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.



