Just SportsLatest News

HCA : ఉచిత టికెట్లన్నీ అమ్ముకుంటున్నారా ?..హెచ్‌సీఏపై టీసీఏ ఆరోపణలు

HCA : ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల పంపిణీపై వివాదం చెలరేగింది. ప్రతి మ్యాచ్‌కు వేల సంఖ్యలో ఉచిత పాస్‌లు వస్తున్నప్పటికీ అవి యువ క్రికెటర్లకు అందడం లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆరోపించింది

HCA

ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల పంపిణీపై వివాదం చెలరేగింది. ప్రతి మ్యాచ్‌కు వేల సంఖ్యలో ఉచిత పాస్‌లు వస్తున్నా సరే  అవి యువ క్రికెటర్లకు అందడం లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆరోపించింది. టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కు సుమారు 4,000 ఉచిత పాస్‌లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) కుఅందుతున్నాయని తెలిపారు.

అయితే ఆ పాస్‌లను అసోసియేషన్ అధికారులు తమ వద్దే ఉంచుకుంటున్నారని, నిజంగా క్రికెట్ ఆడుతున్న యువ ఆటగాళ్లకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ పాస్‌లను ముందుగా హెచ్‌సీఏ , టీసీఏలో నమోదు చేసుకున్న యువ క్రికెటర్లకు ఇవ్వాలని టీసీఏ డిమాండ్ చేసింది.  తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందాలంటే నిజమైన ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిందేనని పేర్కొంది.

ఇదే సమయంలో ఉప్పల్ స్టేడియంలో భద్రతా అంశాలపైనా టీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. అగ్నిమాపక భద్రతా అనుమతులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.

HCA
HCA

అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర రాష్ట్రాలకు తరలించే పరిస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.అదే విధంగా హెచ్‌సీఏలో పరిపాలనను శుభ్రం చేయడానికి బీసీసీఐ  ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని నియమించాలని టీసీఏ కేంద్రాన్ని కోరింది. మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కూడా కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని ఆరోపించింది.

హెచ్‌సీఏలో మొత్తం ఆర్థిక అవకతవకలు రూ.300 కోట్లకు పైగా ఉండవచ్చని టీసీఏ అంచనా వేసింది.దీనిపై టీసీఏ ఇప్పటికే సీఐడీకి ఫిర్యాదు చేసింది.కోర్టు వ్యవహారాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి, క్రికెట్ అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీసీసీఐ అనుమతి లేకుండా టోర్నమెంట్లు నిర్వహించడం, ఆటగాళ్ల ఎంపికలో అవినీతి, ఒక్కో ఆటగాడి నుంచి 5 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయనీ గుర్తు చేసింది. రాజకీయ నాయకులు, పవర్ బ్రోకర్లు, ప్రైవేట్ అకాడమీలు కలిసి తెలంగాణ క్రికెట్‌ను దెబ్బతీస్తున్నారని పేర్కొంది. నిజాలు బయటపడే వరకు చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button