Trump: ట్రంప్ ను లేపేసేందుకు ప్లాన్.. ఎయిర్ పోర్టు దగ్గరే స్పాట్
Trump: ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ సెక్యూరిటీ ఉన్నప్పటకీ దుండగులు మాత్రం వెనక్కి తగ్గడం లేదని తాజా పరిస్థితులు చెబుతున్నాయి.

Trump
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Trump)ను హత్య చేసేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. పామ్ బీచ్ ఎయిర్ పోర్ట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న హంటింగ్ స్టాండ్‌ను అధికారులు గుర్తించారు. ట్రంప్ ను మట్టుపెట్టేందుకే ఈ ఏర్పాట్లు చేసుకున్నారని, భద్రతా సిబ్బంది తనిఖీల్లో గుర్తించడంతో బయటపడిందని ఎఫ్ బిఎ అధికారులు చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పై దుండగుడు కాల్పులు జరపడం, ఆయన లక్కీగా చిన్న గాయంతో బయటపడడం అప్పట్లోనే సంచలనంగా మారింది.
ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ సెక్యూరిటీ ఉన్నప్పటకీ దుండగులు మాత్రం వెనక్కి తగ్గడం లేదని తాజా పరిస్థితులు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే ఎయిర్ పోర్టు సమీపం నుంచి దాడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. విమానం ఎక్కే సమయంలో షూట్ చేసేలా ఈ హంటింగ్ స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

భద్రతా సిబ్బంది ఎయిర్ పోర్టు సమీపంలో చేస్తున్న తనిఖీల్లో ఇది బయటపడింది. ట్రంప్ వాడే ఎయిర్ ఫోర్స్ వన్ దిగేచోటుకు 200 గజాల దూరంలో ఉన్న చెట్టుపై దుండగులు కాల్పులు జరిపేందుకు ప్లాన్ చేసుకున్నట్టు గుర్తించారు. గురి తప్పకుండా కాల్పులు జరిపే స్నైపర్ ను ఇక్కడ ఉంచి దాడి చేసేలా చెట్టుపై కొన్ని ఏర్పాట్లు ఉన్నట్టు అర్థమవుతోంది.

ఈ చెట్టుకు ఒక నిచ్చెన , పైన పక్షి గూడులా ఒక పెద్ద గుడారం కూడా రెడీ చేసుకున్నారు. ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కే క్రమంలో చెట్టు పై నుంచి కాల్పులు జరిపేలా పక్కా ప్లాన్ ను సిద్ధం చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఎఫ్ బీఐ అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది సెక్యూరిటీని మరింతగా పెంచారు. ట్రంప్ ను విమానంలోకి రెగ్యులర్ గా వెళ్ళే మార్గంలో కాకుండా వెనుకవైపున చిన్న మెట్లు ఏర్పాటు చేసి లోపలకి వెళ్ళేలా ఏర్పాట్లు మార్చారు.
ట్రంప్(Trump) భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారం, ఇతర ఆధారాలతో ఎఫ్ బీఐ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది. సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ వచ్చే ఎయిర్ పోర్టు, హోటల్స్ వంటి చోట్ల భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు వారం ముందు నుంచే అక్కడి ప్రాంతాలను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు వచ్చే రోజు నిర్వహించిన తనిఖీల్లో ఇది బయటపడినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితమే ఈ హంటింగ్ స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.