Sheikh Hasina: భారత్ టార్గెట్‌గా బంగ్లా ఫేక్ రిపోర్ట్.. తెరపైకి సరికొత్త వివాదం
Sheikh Hasina: నాడు అవామీలీగ్ ఎంపీగా ఉన్న ఫజ్లే నూర్ టాపోష్ నేతృత్వంలోనే ఈ దమనకాండ జరిగిందన్నారు.
Sheikh Hasina
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు భారత్ ఆశ్రయమివ్వడం ప్రస్తుత బంగ్లా ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇటీవలే బంగ్లా కోర్టు హసీనాకు మరణశిక్ష విధించడం, ఆమెను అప్పగించే విషయంలో భారత్ పెద్దగా స్పందించకపోవడంతో పరిణామాలు వేడెక్కాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ను పాలిస్తున్న యూనస్ ప్రభుత్వం ఇండియాను టార్గెట్ చేసింది.
ఒక ఫేక్ నివేదికతో సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. 2009 జరిగిన బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనానే కారణమని.. దీనిలో భారత్ హస్తం కూడా ఉందని చెబుతోంది. షేక్ హసీనా హయాంలో జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తునకు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ ఏర్పాటు చేసిన కొత్త కమిటీ.. ఈ మేరకు నివేదికను సమర్పించింది.
2009లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో, బంగ్లా సైనికులు ఢాకాలోని ప్రధాన కార్యాలయంలో హింసాత్మక దాడికి దిగి, ఆయుధాలను దొంగిలించారు. ఈ ఘటనలో 74 మంది మరణించారు.

హసీనానే(Sheikh Hasina) స్వయంగా తిరుగుబాటుకు అనుమతి ఇచ్చారని తాజా నివేదికలో ఆరోపించారు. నాడు అవామీలీగ్ ఎంపీగా ఉన్న ఫజ్లే నూర్ టాపోష్ నేతృత్వంలోనే ఈ దమనకాండ జరిగిందన్నారు. తిరుగుబాటులో భారత్ ప్రమేయం ఉందని పేర్కొన్నారు. తిరుగుబాటు సమయంలో 921 మంది భారతీయులు బంగ్లాదేశ్‌లోకి చొరబడ్డారనీ.. వాళ్లలో 67 మంది ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదని నివేదికలో పేర్కొన్నారు. నిజానికి.. హసీనా ప్రభుత్వ హయాంలో రైఫిల్స్ తిరుగుబాటుకు సైనిక వేతనాలు, గత ప్రభుత్వంలో వాళ్ల దీనావస్థలే కారణమని ప్రకటించుకుంది.
అయితే ఫజ్లూర్ కమిషన్ మాత్రం దానిని అంతర్గత కుట్రగా అభివర్ణించింది. హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం సైన్యాన్ని బలహీనపరచి తన పవర్‌లో కొనసాగాలనే ఉద్దేశంతో తిరుగుబాటును ప్రోత్సహించిందని పేర్కొంది. ఆమెకు మద్దతుగా భారత్.. బంగ్లాదేశ్‌లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కనుక పాకిస్తాన్‌పై దాడి చేస్తే.. తాము ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామంటూ పిచ్చికూతలు కూసిన ఫజ్లూర్ రెహ్మాన్ ఈ నివేదిక ఇచ్చాడు.
షేక్ హసీనా(Sheikh Hasina)కి భారత్ మద్దతుగా నిలవడాన్ని తట్టుకోలేకపోతున్న ఫజ్లార్ రెహ్మాన్ ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. ప్రపంచ దేశాల ముందు భారత్ ను విలన్ చూపించాలనే పనికిమాలిన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తద్వారా హసీనాను అప్పగించేలా మన దేశంపై ఒత్తిడి తేవాలనుకుంటున్నారు. కానీ, ఇలాంటి కుట్రలను తిప్పికొట్టడం భారత్‌కు కొత్తేం కాదు. ఎప్పుడో ముగిసిపోయిన రైఫిల్స్ తిరుగుబాటు కహానీని ఎన్నిసార్లు తెరపైకి తెచ్చినా అసలు విషయం ఏంటనేది ప్రపంచానికి తెలుసని పలువురు చెబుతున్నారు.



