Social Media: ఆ దేశంలో సోషల్ మీడియా బ్యాన్.. ఏ వయసు వారికో తెలుసా ?
Social Media: ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని పలు దేశాల్లో డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆచరణసాధ్యంలో మాత్రం చాలా వరకూ వెనుకబడ్డాయి.
Social Media
సోషల్ మీడియా(Social Media).. ఏ వయసు వారినైనా ఆకర్షిస్తుంది.. కొందరయితే దానికి బానిసలుగా మారిపోతున్నారు.. ఇంకొందరైతే నిద్రాహారాలు మాని దాంట్లోనే గడుపుతుంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉంటాయన్నది తెలిసిందే.. అలాగే సోషల్ మీడియా కారణంగా సమాచారం త్వరగా చేరే పరిస్థితి ఉన్నా దుష్పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి.
గతంలో చాలా సార్లు ఈ సోషల్ మీడియా (Social Media)వ్యసనం గురించి ఎప్పటికప్పుడు నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళు కూడా సోషల్ మీడియాకు అతుక్కుపోయి వ్యనసంలా మారి తీవ్ర ఇబ్బందులు ఎదురైన పరిస్థితులు కూడా చాలాసార్లు కనిపించాయి. ఇక చిన్న పిల్లలు పరిస్థితి అయితే వేరే చెప్పాలా…స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాకు బానిసలైపోతున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని పలు దేశాల్లో డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆచరణసాధ్యంలో మాత్రం చాలా వరకూ వెనుకబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతపై ఆందోళనల పెరిగిన వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ చట్టం కింద.. 10 సోషల్ మీడియా(Social Media) వేదికలను 16 ఏళ్ల లోపు పిల్లల నుంచి బ్లాక్ చేయాలని ఆదేశాలిచ్చింది. లేని పక్షంలో ఆయా సోషల్ మీడియా(Social Media) సంస్థలకు దాదాపు రూ300 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయించింది.అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిషేధాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. టెక్ కంపెనీలు, భావ ప్రకటనా స్వేచ్ఛ కార్యకర్తలు విమర్శించినప్పటికీ.. తల్లిదండ్రులు, చిన్నారుల న్యాయవాదులు స్వాగతించారు.
ఇదిలా ఉంటే ఆసీస్ తీసుకున్న నిర్ణయంపై మలేషియా, బ్రెజిల్, అమెరికా, డెన్మార్క్ దేశాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కారణంగా టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, థ్రెడ్స్, స్నాప్‌చాట్, రెడ్డిట్, కిక్, ట్విచ్, ఎక్స్ వంటివి 16 ఏళ్ల లోపు పిల్లలు చూసేందుకు వీలుండదు. మరిన్ని కొత్త యాప్‌లు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ జాబితా మారే అవకాశం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అయితే.ఎక్స్ మినహా.. మిగతా 9 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఈ చట్టానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. యూజర్ల వయసును ధృవీకరించడానికి పలు పద్ధతులను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి. ఆన్‌లైన్ కార్యకలాపాల ఆధారంగా యూజర్ల వయసుని అంచనా వేయడం లేదా సెల్ఫీ ద్వారా వారి వయసు ఎంత ఉంది అనేది నిర్ధారించనున్నట్లు వెల్లడించాయి.



