Maduro Arrest :మదురో అరెస్టుతో మారిన గ్లోబల్ ఆర్డర్.. ట్రంప్ తీసుకున్న నిర్ణయం దేనికి దారి తీస్తుంది?
Maduro Arrest : ఒక అధ్యక్షుడిగా కాకుండా ఒక డ్రగ్ మాఫియా లీడర్ గానే తాము మదురోను చూస్తున్నామంటూ.. అందుకే ఈ సైనిక చర్య జరిగిందని వైట్ హౌస్ వివరిస్తోంది.
Maduro Arrest
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో ప్రపంచ దేశాలు ఊహించని అత్యంత సాహసోపేతమైన, వివాదాస్పదమైన అడుగులు వేస్తున్నారు. అయితే జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో(Maduro Arrest)ను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను కారాకస్‌లోని వారి నివాసం నుంచి అమెరికా ప్రత్యేక దళాలు రహస్య ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకున్న వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సంచలనంగా మారింది.
ఆపరేషన్ సదరన్ స్పియర్ పేరుతో సాగిన ఈ మెరుపు దాడిలో.. డెల్టా ఫోర్స్ కమెండోలు మదురో(Maduro Arrest)ను అదుపులోకి తీసుకుని నేరుగా న్యూయార్క్‌కు తరలించారు. ఒక సిట్టింగ్ దేశాధినేతను ఇలా విదేశీ భూభాగంపై నుంచి బలవంతంగా తరలించడం అనేది ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చర్యతో అమెరికా కేవలం ఒక నేరస్థుడిని పట్టుకున్నామని చెబుతున్నా..ప్రపంచ దేశాల సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టాల మనుగడపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ చర్యను ట్రంప్ ప్రభుత్వం కేవలం ఒక చట్టపరమైన ఆపరేషన్ గా మాత్రమే అభివర్ణిస్తోంది. 2020 నుంచే మదురోపై నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ , మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలతో అమెరికా కోర్టులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశాయి. మదురో నేతృత్వంలోని కార్టెల్ డె లాస్ సోలెస్ అనే సంస్థ.. అమెరికాలోకి భారీగా కోకైన్ సరఫరా చేస్తోందని, ఇది అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని ట్రంప్ వాదిస్తున్నారు.
ఒక అధ్యక్షుడిగా కాకుండా ఒక డ్రగ్ మాఫియా లీడర్ గానే తాము మదురోను చూస్తున్నామంటూ.. అందుకే ఈ సైనిక చర్య జరిగిందని వైట్ హౌస్ వివరిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల నిపుణులు మాత్రం ఇది ఐక్యరాజ్యసమితి చార్టర్ కు వ్యతిరేకమని గొంతు వినిపిస్తున్నారు. ఒక స్వతంత్ర దేశంపై ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండా లేదా ఆత్మరక్షణ (Self Defence) కోసం కాకుండా కేవలం నేరారోపణల పేరుతో దాడి చేయడమనేది అంతర్జాతీయ నియమాలను తుంగలో తొక్కడమేనన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు కూడా భిన్నమైన రీతిలో స్పందిస్తున్నాయి. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలైన కొలంబియా, క్యూబా , మెక్సికో వంటివి అమెరికా చర్యను నయా వలసవాద దాడిగా చెబుతున్నాయి. అమెరికా తన పొరుగు దేశాలను కేవలం తన పెరటి తోటలుగా భావిస్తుందని అందుకే అక్కడ ఎవరిని ఉంచాలో, ఎవరిని తీయాలో తానే నిర్ణయించుకోవడం ఆయా దేశాల స్వేచ్ఛను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు రష్యా, చైనా , ఇరాన్ వంటి దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, అమెరికా అంతర్జాతీయ చట్టాలను తుంచేసిందని ఆరోపించాయి. వెనిజులాలో ఉన్న చమురు నిల్వలు , ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకే మదురోను తొలగించి, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా చూస్తోందని రష్యా మండిపడింది.
ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే, ఇది భవిష్యత్తులో ఇతర శక్తివంతమైన దేశాలకు ఒక ఉదాహరణగా (Precedent) మారే అవకాశం ఉంది. రేపు రష్యా ఉక్రెయిన్ విషయంలో కానీ, చైనా తైవాన్ విషయంలో కానీ ఇదే పద్ధతిని అనుసరించి అక్కడి నేతలను అపహరిస్తే అమెరికా ఏ ముఖంతో అడ్డుకోగలదన్నదే ఇప్పుడు అసలు సమస్య.
కేవలం నార్కో టెర్రరిజం పేరుతో ఒక సార్వభౌమ దేశంలోకి ఎయిర్ స్ట్రైక్స్ చేసి, బాంబుల వర్షం కురిపించి మరీ ఆ దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం అనేది ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదకరం. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరెస్ కూడా ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రూల్ బేస్డ్ ఆర్డర్ ను విచ్ఛిన్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటు అమెరికా అంతర్గత రాజకీయాల్లో ట్రంప్‌నకు ఈ చర్య వల్ల మైలేజ్ రావచ్చు కానీ, అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్ ఇలాంటి యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడం అధ్యక్షుడి అధికారాల దుర్వినియోగం కిందకు వస్తుందని అక్కడి న్యాయవాదులే విమర్శిస్తున్నారు.
వెనిజులాలో ఇప్పుడు మదురో అనుచరులు ,ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలైతే, అక్కడి నుంచి మరో భారీ వలసల ప్రభంజనం ఇతర దేశాల వైపు మళ్లే ప్రమాదం ఉంది. ఇది అమెరికా సరిహద్దుల్లో మరింత సంక్షోభానికి దారి తీయొచ్చు.

మొత్తం మీద చూస్తే, మదురో తన దేశంలో నియంతలా వ్యవహరించారా లేదా అన్నది పక్కన పెడితే.. ఆయనను పట్టుకోవడానికి అమెరికా అనుసరించిన మార్గం మాత్రం అంతర్జాతీయ చట్టాల పరంగా అంత తప్పు. ఒక నేరస్తుడిని శిక్షించే సమయలో మొత్తం చట్ట వ్యవస్థనే నీరుగార్చే అమెరికా చర్య ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతుంది.
అమెరికా ఈ చర్యతో ఒక దేశాధినేతను పట్టుకుని ఉండొచ్చొమే కానీ, ఆ దేశంలో అస్థిరతకు ,ప్రపంచ దేశాల మధ్య అపనమ్మకానికి బీజం వేసింది. రేపు న్యూయార్క్ కోర్టులో మదురో విచారణ ఎదుర్కొంటున్నప్పుడు, అది కేవలం ఒక డ్రగ్ కేసుగా మాత్రమే కాకుండా, అమెరికా విదేశాంగ విధానం యొక్క క్రూరత్వానికి పరీక్షగా నిలవనుంది. మొత్తంగా ప్రపంచ చరిత్రలో జనవరి 3, 2026 ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందా లేక నియంతల పతనానికి నాందిగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.



