Trump: ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump: 150 సార్లు ప్రపంచాన్ని పేల్చేయొచ్చంటూ తమ అణ్వాయుధ శక్తి గురించి బిల్డప్ ఇచ్చిన ట్రంప్ ఇదే సమావేశంలో కొద్దిసేపటికే మాట మార్చారు.
Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)ఈ మధ్యకాలంలో వివాదాస్పద నిర్ణయాలే కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. చుట్టు పక్కల దేశాలపై టారిఫ్ ల పేరుతో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వారిని దూరం చేసుకుంటున్న ట్రంప్ తాజాగా అణ్వాయుధాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ ఒక విధంగా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అణ్వాయుధాల తయారీలో అమెరికాను ఎవ్వరూ దాటలేరని, తమ దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు అంటూ కామెంట్ చేయడం దుమారం రేపుతోంది.
మియామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్ వేదికగా ట్రంప్ (Trump)ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం అణ్వాయుధాల సంఖ్యలో అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.రష్యా రెండో స్థానంలోనూ, చైనా మూడో స్థానంలోనూ ఉన్నాయంటూ చెప్పారు. అయితే ఈ లెక్కల విషయంలో చైనాపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా రహస్యంగా అణ్వాయుధాల శక్తిని పెంచుకుంటోదని , వచ్చే నాలుగైదేళ్ళలో అమెరికాను దాటేసే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్యానించారు.

150 సార్లు ప్రపంచాన్ని పేల్చేయొచ్చంటూ తమ అణ్వాయుధ శక్తి గురించి బిల్డప్ ఇచ్చిన ట్రంప్ ఇదే సమావేశంలో కొద్దిసేపటికే మాట మార్చారు. ప్రపంచాన్ని పేల్చే అవసరం తమకూ లేదంటూ మాట్లాడారు. అణు నిరాయుధీకరణ అంటూ వెంటనే కొత్త పాట అందుకున్నారు. అది గొప్ప విషయంగా పేర్కొంటూ దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించానని తెలిపారు. అణ్వాయుధాలపై అనవసరంగా ఖర్చు చేయొద్దంటూ ప్రపంచ దేశాలకు సూచించారు. దాని తయారీ కోసం ఖర్చు పెట్టే డబ్బును ప్రజలకు ప్రయోజనం కలిగించే ఇతర విషయాలపై వెచ్చించాలంటూ చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా తాను శాంతిని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే త్వరలో అమెరికా కూడా అణు పరీక్షలు చేయబోతుందని ఇటీవలే ట్రంప్ ప్రకటన చేశారు. ఇతర దేశాలు చేస్తున్నప్పుడు.. తామెందుకు చేయకూడదంటూ మాట్లాడారు. పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు చేస్తోందంటూ వ్యాఖ్యానించిన ట్రంప్ చైనా, రష్యాలు ఈ పనిని రహస్యంగా చేస్తున్నాయంటూ ఆరోపించారు. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను మళ్ళీ చేపట్టబోతున్నట్టు ట్రంప్ వెల్లడించారు.
ఈ విషయంలో తాము దాచేది ఏమీ లేదని, అందరికీ చెప్పే చేస్తామని, పరీక్షలు నిర్వహించే స్థలం కూడా త్వరలోనే ప్రకటిస్తామంటూ ట్రంప్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు మియామీ సమావేశంలో మాత్రం ట్రంప్ శాంతి మంత్రి అంటూ కొత్త పాట అందుకోవడం వెనుక ప్రపంచ దేశాలను భయపెట్టేందుకే ఇంతకుముందు ప్రకటన చేస్తారా అన్న చర్చ మొదలైంది.



