Air India : ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులెందుకు?
Air India : అహ్మదాబాద్ విమాన విషాదం యావత్ దేశాన్ని ఇంకా కలచివేస్తుండగానే, దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం బట్టబయలైంది.

Air India: అహ్మదాబాద్ విమాన విషాదం యావత్ దేశాన్ని ఇంకా కలచివేస్తుండగానే, దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం బట్టబయలైంది.. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ( DGCA) ఏకంగా నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేయడమంటే, ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ప్రయాణీకుల భద్రత పట్ల ఎయిర్ ఇండియా ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందో చాటి చెప్పే చెంపదెబ్బ అనే చెప్పొచ్చు. క్యాబిన్ సిబ్బంది(cabin crew)కి సరైన విశ్రాంతి ఇవ్వకపోవడం, విధి నిర్వహణలో నియమాలను తుంగలో తొక్కడం, శిక్షణ పద్ధతులలో లోపాలు, కార్యాచరణ విధానాల్లోనూ ఉల్లంఘనలు – ఇవన్నీ ఎయిర్ ఇండియా ఏ స్థాయి నిర్లక్ష్యానికి పాల్పడుతోందో బహిరంగంగానే చెబుతున్నాయి.
Air India
ఎయిర్ ఇండియా (AirIndia) స్వయంగా జూన్ 20, జూన్ 21 తేదీల్లో డీజీసీఏకు సమర్పించిన అంతర్గత నివేదికలే ఈ నోటీసులకు ఆధారం అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంటే, సంస్థ లోపలే ఉన్న వాస్తవాలను దాచలేకపోయిందన్నమాట. ఈ వివరాల ఆధారంగా జూలై 23న డీజీసీఏ వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జూన్ 20న అందిన వివరాల ప్రకారం, డీజీసీఏ మూడు ప్రత్యేక నోటీసులు జారీ చేసింది. వీటిలో కనీసం నాలుగు అల్ట్రా లాంగ్ హాల్ విమానాలకు అంటే ఏప్రిల్ 27న రెండు, ఏప్రిల్ 28న ఒకటి, మే 2న ఒకటి నడిపిన విమానాలకు సంబంధించి క్యాబిన్ సిబ్బంది విధి, విశ్రాంతి నిబంధనలను ఉల్లంఘించినట్లు క్లియర్‌గా చెప్పింది.
అంతేకాదు, 2024 జూలై 26, అక్టోబర్ 9, 2025 ఏప్రిల్ 22న నడిపిన విమానాలతో సహా, కనీసం నాలుగు విమానాలకు సంబంధించిన సిబ్బంది శిక్షణ, కార్యాచరణ విధానాల్లో కూడా తీవ్ర ఉల్లంఘనలు జరిగినట్లు వర్గాలు తెలిపాయి. సరైన శిక్షణ లేని సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారు? ఇది అగ్నిపరీక్ష కాదా? డీజీసీఏ షోకాజ్ నోటీసులో 2024 జూన్ 24, 2025 జూన్ 13 తేదీల్లో నడిపిన విమానాలకు సంబంధించి ఫ్లైట్ డ్యూటీ పీరియడ్ (FDP) , వీక్లీ రెస్ట్ నిబంధనలు కూడా ఉల్లంఘించినట్లు వెల్లడైంది. ఇది సిబ్బందిపై విపరీతమైన భారాన్ని మోపడమే కాకుండా, వారి మానసిక, శారీరక సామర్థ్యాలను దెబ్బతీసి, భద్రతకు ముప్పు తెస్తుంది.
జూన్ 21న ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా వెల్లడించిన వివరాల ఆధారంగా జారీ చేసిన మరో షోకాజ్ నోటీసు మరింత ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రకారం, మూడు సందర్భాల్లో క్యాబిన్ సిబ్బంది శిక్షణ, కార్యాచరణ విధానాల్లో ఉల్లంఘనలు జరిగాయని, అలాగే ఏప్రిల్ 10-11, ఫిబ్రవరి 16, మే 19, 2024 డిసెంబర్ 1న నడిచిన కొన్ని విమానాల్లోనూ నిబంధనల అతిక్రమణలు ఉన్నాయని డీజీసీఏ వర్గాలు తెలిపాయి.
ఇటీవలి కాలంలో ఎయిర్ ఇండియా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి డీజీసీఏ దృష్టిలో పడటం ఇది మొదటిసారి కాదు. అయితే, అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనతో ఎయిర్ ఇండియాకు పాత గాయాలు తిరగతోడుతున్నాయి. ఆ ప్రమాదంలో విమానంలో ఉన్న 260 మంది మరణించి, ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడటం సంస్థ భద్రతా విధానాలపై తీవ్ర సందేహాలను లేవనెత్తింది. ఇప్పుడు డీజీసీఏ జారీ చేసిన ఈ నోటీసులు ఎయిర్ ఇండియాలోని అంతర్గత లోపాలను, ముఖ్యంగా సిబ్బంది నిర్వహణ, శిక్షణ, విశ్రాంతి పద్ధతుల్లోని లోపాలను స్పష్టం చేస్తున్నాయి.
ప్రయాణీకుల ప్రాణాలను పణంగా పెట్టి నిబంధనలను ఉల్లంఘించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ వరుస ఘటనలు భారతీయ విమానయాన భద్రతా ప్రమాణాలపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. డీజీసీఏ ఈ అంశాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుంది, ఎయిర్ ఇండియాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుంది అనేది తేలాల్సి ఉంది. కేవలం జరిమానాలతో సరిపెడితే, ఈ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంటుంది. విమానయానంలో భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలి, లేదంటే ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి వస్తుంది. ఎయిర్ ఇండియా తమ పద్ధతులను మార్చుకోకుంటే, ప్రజల విశ్వాసాన్ని కోల్పోక తప్పదు.