Coconut:కొబ్బరికాయ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
Coconut: కొబ్బరికాయకు మనకు తెలియని కొన్ని అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి.

Coconut
మన దేశంలో ఏదైనా శుభకార్యం జరిగినా, పూజ చేసినా కొబ్బరికాయ(Coconut) లేనిది ఆ కార్యక్రమం పూర్తి కాదు. ఇది మన సంస్కృతిలో ఒక భాగం. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వంటల్లో దీని వాడకం ఎక్కువగానే ఉంటుందని మనకు తెలుసు. అయితే, కొబ్బరికాయకు మనకు తెలియని కొన్ని అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి.
కొబ్బరి నీళ్లను బ్లడ్ ప్లాస్మాగా వాడారు..ఒకప్పుడు, వైద్య రంగంలో కొబ్బరి నీళ్లను ఎంతో ఉపయోగకరంగా వాడారు. 1950లలో, సోలమన్ ద్వీపంలో ఒక వైద్యుడు డీహైడ్రేషన్ వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగికి కొబ్బరి నీళ్లను నేరుగా నరాల ద్వారా ఎక్కించారు. ఆ రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఎందుకంటే, కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ మన రక్తంలో ఉండే ప్లాస్మాకు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే అత్యవసర పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లను బ్లడ్ ప్లాస్మాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో గ్యాస్ మాస్క్‌లు..మొదటి ప్రపంచ యుద్ధంలో రసాయన ఆయుధాలు ఎక్కువగా వాడారు. ఆ సమయంలో సైనికులకు రక్షణ కల్పించడానికి ఉపయోగించిన గ్యాస్ మాస్క్‌లు అంతగా ప్రభావవంతంగా ఉండేవి కావు. కానీ, కొబ్బరి నారను కాల్చి, దాని నుంచి వచ్చే బూడిద పొడిని గ్యాస్ మాస్క్‌లలో వాడటం వల్ల అవి రసాయన వాయువుల నుంచి ఎక్కువ రక్షణ కల్పించాయి. పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబటి ద్వీపం ప్రజలు ఏకంగా కొబ్బరి నారతో మిలటరీ సూట్‌ను కూడా తయారు చేశారట.
కట్టడాలకు కొబ్బరి(Coconut).. పూర్వ కాలంలో కొబ్బరిని కేవలం ఆహారంగానే కాకుండా, కట్టడాల కోసం కూడా ఉపయోగించేవారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఒకప్పుడు కొబ్బరి చెట్టు దూలాలతో ఒక పెద్ద రాజభవనాన్ని నిర్మించారు. ఈ భవనం నిర్మాణం కోసం 10 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారట. కొబ్బరి చెట్టుకు ఉండే బలం, మన్నిక దీనికి ఒక ఉదాహరణ.
బయో డీజల్‌గా కొబ్బరి(Coconut).. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా బయో డీజల్ వాడకం పెరుగుతోంది. గతంలో వేరుశెనగ నూనెతో ఇంజిన్‌లు నడిపేవారు. భవిష్యత్తులో కొబ్బరి నుంచి బయో డీజల్‌ను తయారు చేసి, వాహనాలను నడిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.