Just LifestyleJust NationalLatest News

Gen Z:లిక్కర్ సామ్రాజ్యానికి ‘జెన్ జీ’ షాక్..ఏకంగా రూ. 75 లక్షల కోట్ల మార్కెట్ గల్లంతు

Gen Z: ప్రపంచంలోని టాప్ 50 మద్యం కంపెనీలు ఈ నాలుగేళ్లలో (2021-2025) ఏకంగా $830 బిలియన్లు అంటే దాదాపు రూ. 75 లక్షల కోట్లు మార్కెట్ వాల్యూను కోల్పోయాయి.

Gen Z

ప్రపంచవ్యాప్తంగా మందు బాబుల సంఖ్య పెరుగుతోందని అంతా అనుకుంటున్నాం. కానీ అది పొరపాటేనని అసలు లెక్కలు చూస్తే అర్థమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 1997 నుంచి 2012 మధ్య పుట్టిన ‘జెన్ జీ’ (Gen Z) తరం ఇప్పుడు లిక్కర్ కంపెనీలకు నిద్రను దూరం చేస్తుందట.

బ్లూమ్‌బెర్గ్ తాజా రిపోర్ట్ ప్రకారం, ప్రపంచంలోని టాప్ 50 మద్యం కంపెనీలు ఈ నాలుగేళ్లలో (2021-2025) ఏకంగా $830 బిలియన్లు అంటే దాదాపు రూ. 75 లక్షల కోట్లు మార్కెట్ వాల్యూను కోల్పోయాయి. అంటే 2021 లో ఉన్న గరిష్ట స్థాయి నుంచి 46 శాతం పతనాన్ని చూశాయట. నిజంగానే ఇద మద్యం వ్యాపారంలో ఒక ఊహించని కుదుపు అనే చెప్పొచ్చు.

ఈ నివేదికతో మందు గ్లాసుకు జెన్ జీ(Gen Z) ఎందుకు దూరమవుతోందన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత తరాలతో పోలిస్తే జెన్ జీ తరం కాస్త భిన్నంగానే ఆలోచిస్తుంది. అమెరికాలోని గ్యాలప్ సర్వే ప్రకారం, ఈ తరంలో 21.5 శాతం మంది అస్సలు మద్యమే ముట్టుకోవడం లేదట.

మరో 39 శాతం మంది అయితే ఎప్పుడో ఒకసారి మాత్రమే తాగుతున్నారట. ఈ జెన్ జీ తరం యువతకు సిక్స్ ప్యాక్ బాడీ, జిమ్, యోగా మీద ఉన్న ఇంట్రస్ట్ మందు మీద లేదు. మద్యం వల్ల కలిగే అనారోగ్య సమస్యల పట్ల ఈ తరానికి పూర్తి అవగాహన ఉంది.

మందు కొట్టి హ్యాంగోవర్‌తో ఆ తర్వాత రోజును వృథా చేసుకోవడం కంటే, మెంటల్‌గా పీస్ ఫుల్ గా ఉండటానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పీకల దాకా తాగి పడిపోయిన ఫోటోలు కనుక ఒకవేళ సోషల్ మీడియాలో కనిపిస్తే తమ ఇమేజ్ దెబ్బతింటుందని వీరు ఆలోచిస్తున్నారు.

దీనికి బదులు స్టైలిష్ గా ఉండే మాక్‌టెయిల్స్ (నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్) వైపే మొగ్గు చూపిస్తున్నారు. లిక్కర్ మీద పెట్టే ఖర్చును ట్రావెలింగ్ , గాడ్జెట్స్ మీద పెట్టడం బెటరని వీర ఫీలవుతున్నారు.

Gen Z
Gen Z

ఇక భారతదేశంపై ప్రభావం ఎంత అనే విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా మద్యం వాడకం 20-30 శాతం తగ్గినా కూడా, భారత్ లో పరిస్థితి మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో జెన్ జీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇక్కడ యువత మద్యం బదులు ఆర్గానిక్ డ్రింక్స్ ,అలాగే కాఫీ కానీ లో-ఆల్కహాల్ బీర్లను కానీ కోరుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ లిక్కర్ విక్రయాలు జోరుగానే ఉన్నాయి. భారతదేశంలో 2025 నాటికి 5 శాతం డెవలప్మెంట్ కనిపిస్తున్నా, 2030 నాటికి జెన్ జీ ఇంపాక్ట్ ఇక్కడ కూడా చాలా గట్టిగా ఉండబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే ఈ నష్టాల నుంచి బయటపడటానికి మద్యం కంపెనీలు చాలావరకూ ఇప్పుడు రూటు మారుస్తున్నాయి. నాన్-ఆల్కహాలిక్ బీర్లు, వైన్లు , మాక్‌టెయిల్స్ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వాల్యూమ్ అంటేఎక్కువ మంది తాగడం తగ్గినా, వాల్యూ అంటే ఖరీదైన బ్రాండ్స్‌ను పెంచేలా ‘ప్రీమియమైజేషన్’ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అంటే తక్కువ తాగినా కూడా.. ఖరీదైన క్రాఫ్ట్ జిన్ , సింగిల్ మాల్ట్ వంటివి తాగేలా యూత్‌ని ఆకర్షిస్తున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button