Just EntertainmentLatest News

YouTuber Komali:యూట్యూబర్ కోమలి సూసైడ్..ప్రేమ విఫలమైతే ప్రాణాలు తీసుకోవాలా?

YouTuber Komali: అఖిల్ రెడ్డి అనే మరో యూట్యూబర్‌తో మూడేళ్లుగా ఉన్న ప్రేమ బంధం విఫలం కావడంతో పాటు , ఏడాది కాలంగా ఇద్దరి మధ్య దూరం పెరగడం కోమలిని బాగా డిస్టర్బ్ చేసినట్లు తెలుస్తోంది.

YouTuber Komali

యూట్యూబర్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ.. చదువులోనూ రాణిస్తున్న 21 ఏళ్ల యువతి కోమలి(YouTuber Komali) ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న కోమలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గరలోని మణికొండ చిత్రపురి కాలనీలో తన మావయ్య ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది.

అఖిల్ రెడ్డి అనే మరో యూట్యూబర్‌తో మూడేళ్లుగా ఉన్న ప్రేమ బంధం విఫలం కావడంతో పాటు , ఏడాది కాలంగా ఇద్దరి మధ్య దూరం పెరగడం కోమలిని బాగా డిస్టర్బ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఒకసారి కోమలి సూసైడ్ అటెంప్ట్ చేసినా కుటుంబ సభ్యులు కాపాడారు. అయితే రెండు రోజుల క్రితం మళ్లీ అఖిల్ తో జరిగిన గొడవ జరిగిందని..దీంతోనే మనస్థాపం చెందిన కోమలి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

కేవలం యూట్యూబర్ కోమలి(YouTuber Komali) మాత్రమే కాదు, ఎంతోమంది ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో సమాజంలో మానసిక దృఢత్వం తగ్గిపోతోందని స్పష్టమవుతోంది. అసలు ఎందుకు ఇంత సున్నితంగా మారిపోతున్నారు.. భవిష్యత్తును ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారనే విషయాలపై సైకాలజిస్టుల చెప్పే కారణాలలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.

ఇప్పుడు చాలామంది ఎక్కువగా సోషల్ మీడియా ప్రపంచంలోనే జీవిస్తోంది. వర్చువల్ ప్రపంచంలో దొరికే లైకులను, కామెంట్లునే నిజమైన సంతోషంగా భావించి,రియల్ లైఫ్‌లోని ఒడిదుడుకులను తట్టుకోలేకపోతున్నారు. దీనినే ఎమోషనల్ ఫ్రాజిలిటీ అని పిలుస్తారు. చిన్న వయసులోనే గాఢమైన ప్రేమలో పడటంతో పాటు అది ఆశించిన విధంగా సాగకపోతే ప్రపంచమే అంతమైపోతుందని భావించడం వల్లే వారిలో డిప్రెషన్ పెరిగిపోతుంది.

ముఖ్యంగా వైఫల్యాలను స్వీకరించే మనస్తత్వం (Failure Acceptance) ఇప్పటివారిలో లోపిస్తోంది. ఎప్పుడూ గెలవాలి లేదా అనుకున్నది జరగాలి అనే మొండితనం కూడా తోడవడం వల్ల, చిన్న ఆటంకం వచ్చినా తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారమని నమ్ముతున్నారు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోవడం(Lack of Emotional Intelligence) వల్ల క్షణికావేశంలో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి.

YouTuber Komali
YouTuber Komali

ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ ఆ వ్యక్తితోనే ముగిసిపోదు.. అక్కడ నుంచి ఆ కుటుంబం పడే నరకం వర్ణనాతీతం. ఇప్పుడు నువ్వు వెళ్లిపోయావు కానీ నీ వెనుక ఉన్న నీ తల్లిదండ్రుల ఏడుపు, మా ఏడుపు వినేవారు ఎవరంటూ కోమలి స్నేహితులు చేస్తున్న పోస్టులు ఇదే చెబుతున్నాయి.

ప్రేమ,పెళ్లి, కెరీర్ అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే, అవే జీవితం కాదు. ఇలాంటివి ఎదురైనప్పుడు స్నేహితులతో మాట్లాడటం, అవసరమైతే ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల ఇలాంటి విపత్కర ఆలోచనల నుంచి బయటపడొచ్చు. ఏ సమస్యకైనా చావు ఒక్కటే పరిష్కారం కాదు. మనం ఒకరిని కోల్పోతే ఆ శూన్యం ఎప్పటికీ, ఎవరూ పూడ్చలేనిదిగానే ఉండిపోతుంది.

సొసైటీలో ఉన్న మనం దీనికోసం చేయాల్సింది ఏంటంటే, మీ చుట్టూ ఉండే మీ సన్నిహితులో, బంధువులో ఒత్తిడిలో ఉన్నారని తెలిస్తే వారితో మాట్లాడటం, వారికి అండగా ఉండడం చేయండి. పోయాక అయ్యో ఇలా చేయాల్సింది కదా అని బాధపడే బదులు.. వాళ్లు ఉన్నప్పుడే వారికి అండగా నిలవండి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button