Bioluminescence:రాత్రివేళల్లో వెలిగిపోయే మ్యాజికల్ బీచ్‌లు.. బయోల్యూమినిసెన్స్ అద్భుతాన్ని మీరూ చూస్తారా?
Bioluminescence: నవంబర్ నుంచి మార్చి నెలల మధ్య కాలంలో ఈ బయోల్యూమినిసెన్స్ చూడటానికి అత్యంత అనుకూలమైనదని టూరిస్టులు చెబుతారు.
Bioluminescence
సముద్రం అనే పేరు గుర్తుకు రాగానే.. మనందరికీ నీలి రంగు సముద్రంలో ఎగిసిపడే తెల్లటి అలలు కళ్ల ముందు కనిపిస్తాయి. అయితే రాత్రివేళ చీకట్లో సముద్రపు అలలు నక్షత్రాల్లా మెరిసిపోతున్న దృశ్యం కూడా కొన్నిచోట్ల చూడొచ్చట. వినడానికి ఏదో సినిమాలోని గ్రాఫిక్స్ లా అనిపిస్తున్నా .. ఈ అద్భుతం మన భారతీయ తీరాల్లోనే నిజంగానే జరుగుతోంది. దీనినే శాస్త్రీయంగా బయోల్యూమినిసెన్స్(Bioluminescence) అని పిలుస్తారు. నేచుర్ లవర్స్‌కు, ఫోటోగ్రాఫర్లకు ఇది ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది.
సముద్రపు నీటిలో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు, మెయిన్‌గా ఫైటోప్లాంక్టన్ అనే శైవలాలు తమ శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల కాంతిని విడుదల చేస్తాయి. అలలు తీరాన్ని తాకినప్పుడు కానీ, నీటిలో కదలిక ఏర్పడినప్పుడు కానీ ఈ జీవులు నీలి రంగు కాంతిని వెదజల్లుతాయి. చీకట్లో ఇది సముద్రమంతా వెలుతురు పరుచుకుందా అన్నట్లుగా భ్రమను కలిగిస్తుంది. ఇది చూడటానికి అందంగా ఉండటం మాత్రమే కాకుండా, సముద్రపు జీవవైవిధ్యానికి ఒక సంకేతంగా కనిపిస్తూ అందరినీ మురిపిస్తుంది.
భారత్‌లో ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. లక్షద్వీప్‌లోని బంగారాం బీచ్.. ఈ మెరుపులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లోని హావ్ లాక్ ఐలాండ్ లోని రాధానగర్ బీచ్‌లో.. రాత్రివేళ ఇసుక కూడా మెరుస్తున్నట్లు కనిపిస్తూ మరో వింత అనుభూతిని ఇస్తుంది.

కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని మట్టూ బీచ్, పడిుబిద్రి బీచ్ లలో కూడా ఈ నీలి కాంతి ఇటీవల పర్యాటకులను ఆశ్చర్యపరిచినట్లు వార్తలు వినిపించాయి. గోవాలోని కొన్ని మారుమూల తీరాల్లో కూడా అప్పుడప్పుడు ఈ వింత కనిపిస్తూ ఉంటుందని టూరిస్టులు చెబుతూ ఉంటారు.
అయితే ఈ మెరుపులను చూడాలని అనుకున్నవారు పౌర్ణమి రోజులు కాకుండా, అమావాస్య కానీ చీకటి ఎక్కువగా ఉన్న రాత్రులలో కానీ వెళ్లాలి. అప్పుడే ఆ నీలి కాంతి స్పష్టంగా కనిపిస్తుందట. నవంబర్ నుంచి మార్చి నెలల మధ్య కాలంలో ఈ బయోల్యూమినిసెన్స్ (Bioluminescence) చూడటానికి అత్యంత అనుకూలమైనదని టూరిస్టులు చెబుతారు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి బీచ్‌లకు వెళ్లాలని ప్లాన్ చేస్తే, అక్కడ ఫ్లాష్ లైట్లు వాడకుండా నిశ్శబ్దంగా ఆ ప్రకృతి వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. ఈ అనుభవాన్ని మీ జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోండి .



