Memory Boost: చదివింది మర్చిపోతున్నారా? అయితే ఇది వారి కోసమే..
Memory Boost: చదివిన విషయాలను మెదడులో పక్కాగా నిక్షిప్తం చేయడానికి సరైన సమయంలో వ్యాయామం చేయడం అనేది ఒక శక్తివంతమైన పరిష్కారం అని తెలుస్తోంది.
Memory Boost
చదివిన పాఠాలు , నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడం(Memory Boost) విద్యార్థులకు అలాగే నైపుణ్యాలు నేర్చుకునే వారికి ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. అయితే, ‘కరెంట్ బయాలజీ ఎ సెల్ ప్రెస్ జర్నల్’లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, చదివిన విషయాలను మెదడులో పక్కాగా నిక్షిప్తం చేయడానికి సరైన సమయంలో వ్యాయామం చేయడం అనేది ఒక శక్తివంతమైన పరిష్కారం అని తెలుస్తోంది.
సాధారణంగా, చదివిన వెంటనే వ్యాయామం చేయడం మంచిదని చాలామంది భావిస్తారు. కానీ, ఈ పరిశోధన ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించింది. ఏదైనా కొత్త విషయం చదివిన లేదా నేర్చుకున్న 3 నుంచి 4 గంటల తర్వాత చురుకైన వ్యాయామం చేయాలి.
మనం కొత్త సమాచారాన్ని నేర్చుకున్నప్పుడు, ఆ సమాచారం మెదడులో ఒక చిన్న గుర్తు (Memory Trace) లాగా ఏర్పడుతుంది. ఈ గుర్తు శాశ్వతంగా మారడానికి (Consolidation) కొన్ని గంటల సమయం పడుతుంది. చదివిన వెంటనే వ్యాయామం చేస్తే, మెదడు ఆ సమాచారాన్ని సరిచేసుకునే పనిలో ఉండటం వల్ల వ్యాయామం వల్ల అంత ప్రయోజనం ఉండదు.
3-4 గంటల విరామం తర్వాత వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఆ సమాచారం పక్కాగా, దీర్ఘకాలిక జ్ఞాపకంగా ‘సేవ్’ అవ్వడానికి శక్తివంతమైన బూస్టర్‌గా పనిచేస్తుంది.

వ్యాయామం జ్ఞాపకశక్తిని పెంచడానికి గల ప్రధాన కారణం, వ్యాయామం చేసే సమయంలో మెదడులో విడుదలయ్యే ఒక కీలకమైన ప్రోటీన్. వ్యాయామం చేసినప్పుడు, మెదడులో BNDF (Brain-Derived Neurotrophic Factor) అనే ప్రత్యేక ప్రోటీన్ అధికంగా విడుదల అవుతుంది.
ఈ ప్రోటీన్ మెదడులో కొత్త నరాల (Neurons) పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది ఇప్పటికే ఉన్న నరాలను బలంగా మారుస్తుంది. జ్ఞాపకాలను నిల్వ చేసే మెదడులోని భాగాన్ని (ముఖ్యంగా హిప్పోక్యాంపస్) బలోపేతం చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా, వ్యాయామం మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని అందిస్తుంది, ఇది సమాచారాన్ని మెరుగ్గా నిల్వ చేయడంలో సహాయపడుతుంది.
చదివిన విషయాలు మర్చిపోకుండా (Memory Boost)ఉండటానికి ఈ సులువైన చిట్కాను అనుసరించవచ్చు:
విరామం: చదువు లేదా ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకున్న తర్వాత 3 నుండి 4 గంటలు విరామం తీసుకోండి.
వ్యాయామం: ఆ తర్వాత, 20 నుండి 30 నిమిషాలు పాటు చురుకైన వ్యాయామం చేయండి (ఉదాహరణకు, చురుకుగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్).
ఈ పద్ధతిని పాటించడం వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, చదివిన విషయాలు ఎక్కువ కాలం, పటిష్టంగా గుర్తుండిపోతాయి.



