Minimalism: వస్తువుల మోజులో పడి ప్రశాంతతను కోల్పోతున్నారా? మినిమలిజంతో మీ జీవితాన్ని మార్చుకోండి!
Minimalism: తక్కువ వస్తువులతో, ఎక్కువ అర్థవంతంగా జీవించడమే ఈ జీవనశైలి ముఖ్య ఉద్దేశం. "తక్కువ అంటేనే ఎక్కువ" (Less is More) అనేది మినిమలిస్టుల ప్రధాన సూత్రం.
Minimalism
ప్రస్తుతం మనం ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే, ఎన్ని వస్తువులు కొంటున్నామనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. పెద్ద ఇల్లు, ఖరీదైన కార్లు, కప్ బోర్డ్ నిండా బట్టలు, రకరకాల గ్యాడ్జెట్లు.. ఇవన్నీ ఉంటేనే మనం సంతోషంగా ఉంటామని భ్రమపడుతున్నాం.
కానీ ఈ వస్తువుల సంఖ్య పెరిగే కొద్దీ కూడా మనలో తెలియని ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతున్నాయన్న విషయాన్ని గమనించడం లేదు. ఈ విచ్చలవిడి వినియోగ సంస్కృతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే ‘మినిమలిజం’ (Minimalism) అంటున్నారు నిపుణులు. తక్కువ వస్తువులతో, ఎక్కువ అర్థవంతంగా జీవించడమే ఈ జీవనశైలి ముఖ్య ఉద్దేశం. “తక్కువ అంటేనే ఎక్కువ” (Less is More) అనేది మినిమలిస్టుల ప్రధాన సూత్రం.
మినిమలిజం(Minimalism) అంటే కేవలం ఇంట్లోని సామాన్లను బయట పారేయడం కాదు, మన జీవితానికి ఏది అవసరమో, ఏది సంతోషాన్నిస్తుందో కూడా గుర్తించడం. మనం కొనే ప్రతి వస్తువు మన సమయాన్ని, శక్తిని , డబ్బును తీసుకుంటుంది.
ఉదాహరణకు, మీరు ఒక 10 జతల బట్టలు ఎక్సట్రాగా కొన్నారనుకోండి.. వాటిని సర్దడానికి, ఉతకడానికి, ఇస్త్రీ చేయడానికి మీరు కొంత సమయం ఎక్కువగా కేటాయించాలి. అలాగే ఇంటి నిండా అనవసరమైన వస్తువులు ఉంటే, ఇల్లు సర్దడానికే మీ టైమంతా
గడిచిపోతుంది. అదే తక్కువ వస్తువులు ఉంటే, ఆ మిగిలిన సమయాన్ని మీరు మీ కుటుంబంతో గడపటానికి లేదా మీకు నచ్చిన పని చేయడానికి వాడుకోవచ్చు. వస్తువుల కంటే అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వడమే మినిమలిజం నేర్పే మొదటి పాఠం.
ఈ జీవనశైలిని అలవాటు చేసుకోవడం వల్ల ఆర్థికంగా కూడా చాలా లాభాలు ఉన్నాయట. మనం ఏదైనా వస్తువు కొనే ముందు ఇది నాకు నిజంగా అవసరమా? లేక కేవలం ఆశ కొద్దీ కొంటున్నానా అని ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలా డబ్బు ఆదా అవుతుందట. అనవసరమైన షాపింగ్ తగ్గడం వల్ల అప్పుల భారం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది పర్యావరణానికి చాలా చాలా మేలు చేస్తుంది.

అలాగే తక్కువ వస్తువులు కొంటే, తక్కువ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి, తక్కువ సహజ వనరులు ఖర్చవుతాయి. మన ఇంటిని మనం ఎలా అయితే అనవసరమైన వస్తువుల నుంచి శుభ్రం చేసుకుంటామో (Decluttering), మన మనసును కూడా అలాగే అనవసరమైన ఆలోచనల నుంచి శుభ్రం చేసుకోవడానికి మినిమలిజం తోడ్పడుతుందట.
డిజిటల్ యుగంలో ‘డిజిటల్ మినిమలిజం(Minimalism)’ కూడా చాలా అవసరం. అనవసరమైన యాప్స్ డిలీట్ చేయడం, నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం, రోజులో కొంత సమయం ఫోన్‌కు దూరంగా ఉండటం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మినిమలిజం పాటిస్తున్నారంటే మీరు పేదరికంలో ఉన్నారని కాదు, మీరు ఎంతో క్లారిటీతో ఉన్నారని అర్థం. మీ దగ్గర ఉన్న వస్తువులే మిమ్మల్ని శాసించకుండా, ఆ వస్తువులపై మీకే పూర్తి కంట్రోల్ ఉండాలి. మన జీవితంలో వస్తువుల సంఖ్య తగ్గినప్పుడు, మనం నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నాం, మనకు ఏం కావాలనే విషయాలపై స్పష్టత పెరుగుతుంది.
సంతోషం అనేది మనం కొనే వస్తువుల్లో లేదు, మన దగ్గర ఉన్న వాటితో సంతృప్తిగా ఉండటంలో ఉంది. మినిమలిజం అనేది కేవలం ఒక ట్రెండ్ కాదు, అది ఒక ప్రశాంతమైన జర్నీ. ఈ రోజు నుంచే మీ చుట్టూ ఉన్న వస్తువులను గమనించండి.. మీకు ఆనందాన్ని ఇవ్వని వాటిని ఇతరులకు ఇచ్చేయండి లేదా వదిలించుకోండి. మీ ఇల్లు ఎంత ఖాళీగా ఉంటే మీ ఆలోచనలు అంత స్వచ్ఛంగా ఉంటాయి. జీవితం చాలా చిన్నది, దాన్ని అనవసరమైన వస్తువుల బరువుతో నింపేయకండి..




One Comment