Reels:గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? ఈ 5 భయంకరమైన సమస్యలు తప్పవు..!
Reels:కంటి అలసట మీరు మొబైల్‌ని ఎంతసేపు చూస్తున్నారనే దానిపై మాత్రమే కాకుండా, మీరు ఎలాంటి కంటెంట్‌ను చూస్తున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందని కనుగొన్నారు.

Reels
మీరు మొబైల్‌లో గంటల తరబడి రీల్స్ (Reels)చూస్తున్నారా? అయితే మీరు వినోదం కోసం చూస్తున్న వీడియోలు మీ జీవితాన్ని ఒక భయంకరమైన ప్రమాదం వైపు నెడుతున్నాయని మీకు తెలుసా? ఇది కేవలం కళ్లు అలసిపోవడం కాదు, మెదడు, నిద్ర.. అంతెందుకు మొత్తం ఆరోగ్యంపై ఎలాంటి భయంకరమైన ప్రభావం చూపిస్తుందో తెలిస్తే మీరు ఒక్క క్షణం కూడా రీల్స్ చూడటానికి సాహసించరు. అవును ఇటీవల వెలువడిన ఒక పరిశోధనలో వెల్లడైన షాకింగ్ నిజాలు ఇవే చెబుతున్నాయి.
జర్నల్ ఆఫ్ ఐ మూవ్‌మెంట్ రీసెర్చ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో, కంటి అలసట మీరు మొబైల్‌ని ఎంతసేపు చూస్తున్నారనే దానిపై మాత్రమే కాకుండా, మీరు ఎలాంటి కంటెంట్‌ను చూస్తున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందని కనుగొన్నారు. SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు, పుస్తకం చదవడం లేదా వీడియో చూడటం కంటే రీల్స్ కంటి కనుపాపలో ఎక్కువ మార్పులను కలిగిస్తాయని తెలిపారు.

ఒక గంట పాటు రీల్స్(reels) చూడటం వల్ల కనుపాప నిరంతరం సంకోచించి విస్తరిస్తుంది, దీనివల్ల కనురెప్పలు తక్కువగా రెప్పపాటు చేస్తాయి. ఈ కారణంగానే కంటి అలసట మరింత పెరుగుతుంది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించారు, అది కంటి రెప్పపాటులు, వాటి మధ్య సమయం, కనుపాప పరిమాణంలో వచ్చే మార్పులను కొలుస్తుంది.
పరిశోధకుల ప్రకారం, మీరు నిరంతరం 20 నిమిషాల కంటే ఎక్కువసేపు మొబైల్ వాడితే, అది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇందులో మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, మెడ నొప్పి, చేతుల అలసట వంటి సమస్యలు కూడా ఉన్నాయి. మొబైల్, ఇతర డిజిటల్ పరికరాల నుంచి వెలువడే నీలి కాంతిని ఎక్కువసేపు చూడటం వల్ల కంటి అలసటతో పాటు నిద్ర సమస్యలు ,ఇతర దృష్టి సంబంధిత సమస్యలు వస్తాయి.
ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో, 60 శాతం మంది కంటి అలసట, మెడ నొప్పి వంటి శారీరక సమస్యలను ఎదుర్కొన్నారని, అదే సమయంలో 83 శాతం మంది ఆందోళన, నిద్ర సమస్యలు వంటి మానసిక సమస్యలను ఎదుర్కొన్నారని వెల్లడైంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి 40 శాతం మంది బ్లూ లైట్ ఫిల్టర్ లేదా డార్క్ మోడ్ వంటి చర్యలను అనుసరించారు. ఈ వివరాలన్నీ మొబైల్ ఫోన్ వినియోగంపై మనం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి.
One Comment