Eye twitch:కన్ను అదరడం శుభమా, అశుభమా?
Eye twitch: జ్యోతిషవేత్తలు కూడా ఆడవారికి కుడి కన్ను అదిరితే కీడు, మగవారికి ఎడమ కన్ను అదిరితే కష్టాలు తప్పవని నమ్ముతుంటారు.
Eye twitch
సాధారణంగా కన్ను అదరడాన్ని మన సమాజంలో శకునంగా లేదా ఏదో జరగబోయేదానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిషవేత్తలు కూడా ఆడవారికి కుడి కన్ను అదిరితే కీడు, మగవారికి ఎడమ కన్ను అదిరితే కష్టాలు తప్పవని నమ్ముతుంటారు. ఈ నమ్మకం రామాయణ కాలంలోనే ప్రాచుర్యంలో ఉందని చెబుతారు. అయితే, మంచి చెడులను తెలియజేయడానికే కన్ను కొట్టుకుంటుందా లేక శరీరంలో ఏదైనా సమస్య వల్లా అనే సందేహం చాలా మందిలో ఉంది.
కన్ను అదరడాని(Eye twitch)కి వైద్యపరమైన కారణాలు..
కంటి రెప్పలోని కండరాలు అసంకల్పితంగా (Involuntarily) సంకోచించినప్పుడు కన్ను కొట్టుకుంటుంది లేదా అదిరిన అనుభూతి కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిని సాధారణంగా వైద్య పరిభాషలో ఐ ట్విచింగ్ (Eye Twitching) లేదా మైయోకిమియా (Myokymia) అంటారు.
వైద్యులు ఈ కండరాల సంకోచాలను వాటి తీవ్రత, కారణాల ఆధారంగా మూడు రకాలుగా విభజిస్తారు.
మయోకిమియా (Myokymia – సాధారణ కనురెప్పల సంకోచం).. ఇది చాలా సాధారణమైనది మరియు దాదాపు ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది. కండరాల ఆకస్మిక సంకోచం వల్ల ఇలా జరుగుతుంది. ఇది ఎక్కువగా దిగువ కనురెప్పలలో కనిపిస్తుంది. దీని తీవ్రత తక్కువగా ఉంటుంది మరియు ఇది స్వల్ప కాలమే ఉండి వాటంతట అవే ఆగిపోతాయి.

హెమిఫేషియల్ స్పస్మ్ (Hemifacial Spasm).. ఇది కొంత తీవ్రంగా ఉంటుంది. ఇది కేవలం కన్నుకు మాత్రమే కాకుండా ముఖంలోని ఇతర కండరాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఇది కొన్నిసార్లు జన్యు సంబంధిత సమస్యల వల్ల లేదా ముఖ నరాలపై ఒత్తిడి పెరగడం వల్ల ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది శరీరంలోని అంతర్గత సమస్యలను సూచిస్తుంది.
బ్లేఫరోస్పస్మ్ (Blepharospasm – దీర్ఘకాలిక సంకోచం).. ఇది మరింత తీవ్రమైన , అరుదైన రూపం. ఈ సమస్యలో కళ్లు సెకన్లు, నిమిషాలే కాదు, కొన్నిసార్లు గంటల సేపు అదురుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, కనురెప్పలు తీవ్రంగా సంకోచించి, కళ్లు తాత్కాలికంగా మూసుకుపోతాయి. ఇది మెదడులోని నరాలకు సంబంధించిన సమస్యలను సూచిస్తుంది.
కన్ను అదరడానికి ప్రధాన కారణాలు..
నిద్ర సరిపోకపోయినా, కళ్లు ఎక్కువగా అలసిపోయినా కండరాలు సంకోచిస్తాయి.అధిక ఒత్తిడి లేదా ఆందోళనలో ఉన్నప్పుడు నరాల వ్యవస్థపై ప్రభావం పడి కన్ను అదరవచ్చు.కెఫిన్, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం. ముఖ్యంగా విటమిన్ B12 లేదా మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు నరాలు బలహీనపడతాయి.
కొన్ని రకాల కంటి సంబంధిత రోగాలు.
మీ కన్ను పదే పదే, దీర్ఘకాలంగా అదురుతుంటే, లేదా ముఖంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంటే, అది తీవ్రమైన అంతర్గత సమస్యను సూచించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.



