Love: ప్రేమ కోసం 13 ఏళ్లుగా సముద్రంతో పోరాటం
Love: యసువోకు తన అన్వేషణ కష్టమని తెలుసు, కానీ వృథా అని మాత్రం ఆయన అనుకోవడం లేదు.

Love
ఒక మనిషి కోసం రోజుల తరబడి వెతకడమే కష్టం. అలాంటిది ఒక అగాధమైన సముద్రంలో, ఎప్పటికీ తిరిగి రాని ఒక ప్రేమ(Love) కోసం 13 ఏళ్లుగా అన్వేషించడం కేవలం అసాధారణం మాత్రమే కాదు, ప్రేమకు నిర్వచనం కూడా. ఇది ఒక భర్త, తన భార్యపై చూపిన అంతులేని ప్రేమ, చెక్కుచెదరని నమ్మకం. జపాన్‌కు చెందిన యసువో టకమత్సు అనే వ్యక్తి, 2011లో సునామీకి అదృశ్యమైన తన భార్య కోసం గత 13 ఏళ్లుగా సముద్రగర్భంలో అన్వేషిస్తూనే ఉన్నాడు.
2011లో జపాన్‌ను అతలాకుతలం చేసిన సునామీ, ఆ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిన భయంకరమైన భూకంపం కారణంగా 133 అడుగుల ఎత్తున అలలు జనజీవనాన్ని నాశనం చేశాయి. ఈ భయంకర విపత్తులో వేలాదిమంది ప్రజలు, అద్భుతమైన జీవితాలు సముద్రంలో కలిసిపోయాయి.
మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ సమయంలో ఫుకుషిమా పట్టణంలో యుకో అనే మహిళ చివరిసారిగా తన భర్త యసువో తకమత్సు(Yasuo Takamatsu)కు మెసేజ్ చేసింది. “Are you okay? I want to go home” అంటూ ఆమె పంపిన సందేశం, మరికొద్ది క్షణాల్లోనే రానున్న విపత్తుకు సంకేతం. ఆ తర్వాత ఆమె పంపిన “The tsunami is disastrous” అనే మెసేజ్ యసువోకు చేరలేదు. ఆ తర్వాత యుకో ఏమైందో ఎవరికీ తెలియదు.
ఈ విషాదం తర్వాత, యసువో తన భార్య కోసం గంటల తరబడి భూమిపై వెతికారు. ప్రతి మృతదేహాన్ని పరిశీలిస్తూ ఆమె కోసం నరకం అనుభవించారు. కానీ ఆమె శరీరం దొరకలేదు. బహుశా ఆమె సముద్రంలో కొట్టుకుపోయి ఉండవచ్చని అందరూ చెప్పినా యసువో మాత్రం నమ్మలేదు. ఆమె ఇంకా బతికే ఉందని, సముద్రంలో తన కోసం ఎదురు చూస్తోందని ఆయన బలంగా విశ్వసించారు.

తన భార్యను బయటకు తీసుకురావాలంటే సముద్రంలోకి వెళ్లాలి. ఈత మాత్రమే కాకుండా, లోతైన సముద్రంలో డైవింగ్ కూడా తెలియాలి. అందుకు కఠినమైన శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. డైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, 13 సంవత్సరాలుగా ఆయన తన భార్య కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 600 సార్లకు పైగా ఆయన సముద్రంలోకి వెళ్లి వచ్చారు. చాలామంది ఆయన చేసే పనిని పిచ్చి పని అని కొట్టిపారేశారు. “ఆమె చనిపోయింది, ఇక మర్చిపోండని ఎంతోమంది చెబుతున్నా కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు.
యసువోకు తన అన్వేషణ కష్టమని తెలుసు, కానీ వృథా అని మాత్రం ఆయన అనుకోవడం లేదు. “ఇది నా భార్య కోసం నేను చేస్తున్న పని. ఎవరేమనుకున్నా నాకు పట్టింపు లేదు. సముద్రంలోకి వెళ్లిన ప్రతిసారీ నా భార్య దొరుకుతుందనే ఆశతోనే ఉంటాను. ఆమె దొరక్కపోయేసరికి నిరాశతో బయటకు వస్తాను” అని ఆయన అంటుంటారు.
యసువో తకమత్సు అన్వేషణలో భార్య దొరకకపోవచ్చు. కానీ, ఒక మనిషి మరో మనిషిపై చూపిన అంతులేని నమ్మకం, అపారమైన ప్రేమ(love), ఏ తుఫానుకు కూడా చెక్కుచెదరని ఆయన సంకల్పం ప్రపంచానికి ఒక అసాధారణ ప్రేమ కథను అందించింది. ఎప్పటిలాగే ఆశ, నిరాశల మధ్య ఆయన పోరాటం మాత్రం అలా ఇంకా కొనసాగుతూనే ఉంది.
Also Read: Cables and electrical wires: కేబుల్,విద్యుత్ వైర్లు తొలగిస్తున్నారు.ఏ ఏ ప్రాంతాలలో తెలుసా?