Guar Gum : గోరుచిక్కుడు గమ్..అమెరికాకు ఎందుకంత అవసరం?
Guar Gum : గోరుచిక్కుడు మొక్కలోని గింజల నుంచి తయారయ్యే తెల్లటి పొడి పదార్థమే ఈ గ్వార్ గమ్.ఇది నీటితో కలిపినప్పుడు చాలా చిక్కగా మారుతుంది.

Guar Gum
గోరుచిక్కుడు. మన భారతీయ వంటకాల్లో ఒక సాదాసీదా కూరగాయ మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లో మిలియన్ల డాలర్లు సంపాదించిపెట్టే ఒక మల్టీపర్పస్ కమొడిటీ అని తెలిస్తే షాక్ అవుతారేమో. కానీ ఇదే నిజం.
గోరుచిక్కుడు మొక్కలోని గింజల నుంచి తయారయ్యే తెల్లటి పొడి పదార్థమే ఈ గ్వార్ గమ్(Guar Gum). ఈ పొడికి ఉన్న డిమాండ్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది నీటితో కలిపినప్పుడు చాలా చిక్కగా మారుతుంది. అందుకే వివిధ పరిశ్రమల్లో ద్రావణాలను చిక్కగా చేయడానికి, లేదా ఒక బైండర్‌గా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

అమెరికాకు ఎందుకంత అవసరం?..గ్వార్ గమ్(Guar Gum) ఎక్కువగా వినియోగించే పరిశ్రమలలో ఒకటి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. ముఖ్యంగా, భూమి లోపల నుంచి గ్యాస్, ముడి చమురును వెలికి తీసే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ (ఫ్రాకింగ్) ప్రక్రియలో దీన్ని విపరీతంగా వాడతారు. ఇది ద్రావణాల సాంద్రతను, చిక్కదనాన్ని పెంచుతుంది. దానితో సులభంగా భూమి లోపల నుంచి గ్యాస్, ఆయిల్ బయటకు వస్తుంది.
వేరే పరిశ్రమల్లోనూ..గ్వార్ గమ్ కేవలం ఆయిల్ పరిశ్రమకే పరిమితం కాలేదు. ఫుడ్ ఇండస్ట్రీలో ఐస్‌క్రీమ్‌లు, సూప్‌లు, సాస్‌ల టెక్స్చర్ మెరుగుపరచడానికి; గ్లూటెన్ లేని ఆహార పదార్థాలు తయారుచేయడానికి దీనిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా, షాంపూలు, కాస్మోటిక్స్, పేపర్, టెక్స్‌టైల్ ఇండస్ట్రీలలో కూడా గ్వార్ గమ్ ఒక కీలకమైన ముడిపదార్థం.

భారత్‌కు భారీ ఆదాయం..ప్రపంచంలోనే అత్యధికంగా గ్వార్‌ను ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో దీనిని ఎక్కువగా పండిస్తారు. అమెరికా లాంటి దేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలకు భారీ డిమాండ్ ఉండటంతో, భారత్ నుంచి గ్వార్ గమ్ ఎగుమతులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది భారతదేశానికి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఒకప్పుడు కేవలం కూరగాయగా చూసిన గోరుచిక్కుడు ఇప్పుడు మన దేశానికి ఆర్థికంగా పెద్ద బూస్ట్‌గా మారిపోయింది.
One Comment