Election : వన్ నేషన్.. వన్ ఎలక్షన్: ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Election : దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, మేధావుల సర్కిల్‌లో తీవ్ర చర్చకు దారితీస్తున్న 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' ప్రతిపాదనపై మరోసారి వేడి రాజుకుంది.

Election : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ (ఒకే దేశం, ఒకే ఎన్నిక) ప్రతిపాదనపై ఈరోజు బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఒక ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమయింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు ఈ మీటింగ్ షెడ్యూల్ చేశారు. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు, సవాళ్లు, దాని అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చిస్తారు.
Election
అయితే దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, మేధావుల సర్కిల్‌లో తీవ్ర చర్చకు దారితీస్తున్న ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై మరోసారి వేడి రాజుకుంది. లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఈ విధానం, స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో (1951-52 నుంచి 1967 వరకు) అమలులో ఉండేది. ఆ తర్వాత పలు కారణాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలంగా వాదిస్తోంది.
ముఖ్యంగా, ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండటం వల్ల ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు భారీగా ఖర్చు అవుతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని కేంద్ర ప్రభుత్వ వాదన. అంతేకాకుండా, నిరంతరం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు తరచుగా ఎన్నికల విధుల్లో నిమగ్నమై పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని, ఒకేసారి ఎన్నికలు వస్తే ప్రభుత్వాలు ఐదేళ్లపాటు స్థిరంగా పాలనపై దృష్టి సారించవచ్చని చెబుతున్నారు.
భద్రతా బలగాలు, ప్రభుత్వ అధికారులు తరచుగా ఎన్నికల కోసం తరలింపు జరగడం వల్ల వనరుల దుర్వినియోగం జరుగుతుందని, ఒకేసారి ఎన్నికలతో ఈ వనరులను ఇతర ముఖ్యమైన పనులకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. తరచుగా ఓటు వేయాల్సి రావడం వల్ల ఓటర్లలో అలసట వచ్చి, ఓటింగ్ శాతం తగ్గుతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుందని కూడా మద్దతుదారులు నమ్ముతున్నారు. తరచుగా జరిగే ఎన్నికల ప్రచారాలు సమాజంలో వర్గ విభేదాలను పెంచుతాయని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సామాజిక సామరస్యం పెరుగుతుందని, విధాన నిర్ణయాల్లో స్థిరత్వం వస్తుందని కూడా వారు వాదిస్తున్నారు.
మరోవైపు ఈ ప్రతిపాదనను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, డిఎంకె వంటి అనేక ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారి ప్రధాన అభ్యంతరాలు భారత ప్రజాస్వామ్య స్వభావం, సమాఖ్య వ్యవస్థపై దీని ప్రభావానికి సంబంధించినవి. భారతదేశం ‘రాష్ట్రాల యూనియన్’ అని, ప్రతి రాష్ట్రానికి దాని సొంత సమస్యలు, ప్రాధాన్యతలు ఉంటాయని, లోక్‌సభతో పాటు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ అంశాలు డామినేట్ చేస్తాయని, ప్రాదేశిక సమస్యలు, స్థానిక అంశాలు పక్కకు వెళ్తాయని ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని వారు వాదిస్తున్నారు.
ఒకేసారి ఎన్నికలు జరిగితే, జాతీయ పార్టీలకే ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి నిధులు, ప్రచారం, మీడియా కవరేజ్ విషయంలో అధిక లబ్ధి చేకూరుతుందని, దీనివల్ల ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత, ప్రభావం తగ్గుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది భారత ప్రజాస్వామ్యంలోని వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. తరచుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వాలపై, ప్రజాప్రతినిధులపై నిరంతరం ప్రజల నిఘా ఉంటుందని, ఇది వారిని ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండేలా చేస్తుందని, ఒకేసారి ఎన్నికలు జరిగి ఐదేళ్ల తర్వాతే మళ్లీ అవకాశం వస్తే, ప్రభుత్వాల జవాబుదారీతనం తగ్గుతుందని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
అలాగే, ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అమలు చేయాలంటే రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్‌కు ఉదాహరణకు ఆర్టికల్ 83, 85, 172, 174, 356 సవరణలు చేయాల్సి ఉంటుందని, ఇది చాలా పెద్ద ప్రక్రియ అని, 50% రాష్ట్రాల ఆమోదం కూడా అవసరమని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాసం ద్వారా పడిపోయినా, లేదా లోక్‌సభ ముందే రద్దయినా ఏం చేయాలనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదని, అలాంటి సందర్భాల్లో మళ్లీ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం ఆచరణాత్మకంగా అసాధ్యమని లేదా తక్కువ కాలానికి ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అవుతుందని వారు వాదిస్తున్నారు.
కాగా ఈ ప్రతిపాదన దేశంలోని వివిధ భాషలు, సంస్కృతులు, ప్రాంతాలను కలిగి ఉన్న భారతదేశం యొక్క వైవిధ్యంలో ఏకత్వం అనే భావనను దెబ్బతీస్తుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భిన్నాభిప్రాయాల మధ్య, ఈరోజు బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగే ఉన్నత స్థాయి సమావేశం ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి కొత్త దిశానిర్దేశం చేస్తుందో, భవిష్యత్తులో ఈ అంశంపై ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.