Subbirami Reddy: ఏకంగా రూ. 5,700 కోట్ల రుణ మాఫీ..సుబ్బిరామిరెడ్డి కేసులో ఏం జరిగింది?
Subbirami Reddy:చిన్నపాటి రుణం తీసుకున్న పేదవాడిని బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తే, మరోవైపు డబ్బున్నవారికి వేలకోట్ల అప్పులు మాఫీ చేయడానికి అదే బ్యాంకులు ఎలా సిద్ధపడతాయో ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపించింది.

Subbirami Reddy
మనదేశ వ్యవస్థలు ఎప్పుడూ ఒకే విధంగా పనిచేయవని, పలుకుబడి ఉన్నవారి విషయంలో ఒకలా, బలహీనుల విషయంలో మరొకలా వ్యవహరిస్తాయని అనేకసార్లు ప్రూవ్ అవుతూనే ఉంది. తాజాగా, సుబ్బిరామిరెడ్డికి(Subbirami Reddy) సంబంధించిన గాయత్రి ప్రాజెక్ట్స్ కేసు ఈ చేదు నిజాన్ని మరోసారి రుజువు చేసింది. ఒకవైపు చిన్నపాటి రుణం తీసుకున్న పేదవాడిని బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తే, మరోవైపు డబ్బున్నవారికి వేలకోట్ల అప్పులు మాఫీ చేయడానికి అదే బ్యాంకులు ఎలా సిద్ధపడతాయో ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపించింది.
మనం ఏదైనా చిన్న అప్పు తీసుకుంటే, లేదా పొరపాటున చెల్లించడంలో ఆలస్యం అయితే, బ్యాంకులు చూపించే కఠినత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వడ్డీల మీద వడ్డీలు వేసి, మన జీవితాన్ని నరకంలా మారుస్తాయి. కొన్ని సందర్భాల్లో, ఇల్లు లేదా ఇతర ఆస్తులను జప్తు చేసి రోడ్డున పడేస్తాయి. ఋణ వసూలు కోసం లీగల్ నోటీసులు, బెదిరింపులు, పరువు తీసే పద్ధతులు సర్వసాధారణం. పేదవాడి హక్కుల గురించి మాట్లాడే చట్టాలు ఉన్నా కూడా, అవి అమలులో మాత్రం నిస్సహాయంగా ఉండిపోతాయి.
కానీ, ఇదే వ్యవస్థ పెద్దల విషయంలో మాత్రం అత్యంత ఉదారంగా, సాగిలపడి పని చేస్తుంటుంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి ఎంతోమంది ఆర్థిక నేరగాళ్ల కేసులు దీనికి నిదర్శనం. కొన్ని వేల కోట్లు అప్పు తీసుకున్నా సరే..వాటిని చెల్లించకుండా దేశం విడిచి వెళ్లిపోయినా,ఇప్పటికీ వారిని పట్టుకోలేకపోతుంది. సుబ్బిరామిరెడ్డి(Subbirami Reddy) గాయత్రి ప్రాజెక్ట్స్ కేసు కూడా అలాంటిదే. ఈ కంపెనీ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకులకు దాదాపు 8,100 కోట్ల అప్పు చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా నష్టపోయిన ఈ కంపెనీ దివాలా పిటిషన్ వేయగా, దానిని కొనుగోలు చేయడానికి ఏ సంస్థా ముందుకు రాలేదు. దీంతో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ఒక ప్రత్యేక అవకాశం ఇచ్చింది.
ఆ అవకాశంలో భాగంగా, సుబ్బిరామిరెడ్డి(Subbirami Reddy) కుటుంబం రూ. 2,400 కోట్లను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కింద చెల్లిస్తామని చెప్పగా, ఆ ఒప్పందానికి బ్యాంకులు అంగీకరించాయి. ఫలితంగా, మిగిలిన రూ. 5,700 కోట్ల అప్పు మాఫీ చేయబడింది. ఇది సామాన్యులకు ఏమాత్రం ఊహకందని విషయం.

నిజానికి ఈ భారీ రుణ మాఫీలు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వాటికి నష్టాలు పెరిగి, కొత్త రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తాయి. ఇది చివరికి దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుంది. పన్ను రూపంలో ప్రజలు కట్టిన డబ్బుతోనే ఈ నష్టాలను ప్రభుత్వం పూరిస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ అసమానతను తగ్గించడానికి, వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, రుణ మాఫీ ప్రక్రియలను నిక్కచ్చిగా అమలు చేయడం అవసరం. ప్రతి రుణదాతకు సమాన నియమాలు ఉండాలి. పెద్దల రుణ మాఫీలకు మినహాయింపులు ఉండకూడదు. ఈ సమస్యపై ప్రభుత్వం, బ్యాంకులు, న్యాయ వ్యవస్థ సమన్వయంతో పనిచేస్తేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. లేకపోతే, డబ్బున్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం అనే కాన్సెప్ట్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.